మా ఆఫీసులో శాంత మూర్తి అని పేరుకు తగ్గట్లు ప్రశాంతంగా, శాంతంగా ఉండే ఒక వ్యక్తి ఉన్నాడు .
"సారీ మేష్టారు, కాఫీ మీ మీద పడింది, అసలే మీరు ఇవాళ కొత్త డ్రెస్ వేసుకొచ్చారు." అని ఎవరైనా కాఫీ ఒలకబోసినా ఉతికేస్తే పోతుంది, దానిదేముంది అంటాడు.
ఏమనుకోకండి, ఇవాళ మీ లంచ్ బాక్స్ లో బిర్యాని తెచ్చారని తినేసాను అని ఎవరైనా అంటే,బయటికి వెళ్ళి తిని వస్తాను, దానిదేముంది అంటాడు.
మీకు కోపం రాలేదా? అని అడిగితే 'ఎందుకు కోపం, పాపం అతనికి నా కంటే ఎక్కువ ఆకలి వేసినట్లు ఉంది, అందుకే తిన్నాడు' అని అనుకొని మన్నించే రకం.
అంతే కాదు, ఎవరైనా పొరపాటున తిట్టినా కోపం రాదు, అతన్నే కాదు వాళ్ళింట్లో వాళ్ళను తిట్టినా అస్సలు కోపం రాదు దున్నపోతు మీద వాన పడినట్లు దులుపుకు వెళ్తాడే తప్ప చలించడు.
మొన్న ఒక రోజు లంచ్ టైం లో పొరపాటున సైరా సినిమా లాస్ వెంచర్ అట కదా, ఇక చిరంజీవి సినిమాలు ఆపేస్తే బెటర్ అన్నాను.
అంతే, ఎప్పుడూ కోప్పడని ఆ శాంత మూర్తి, మా బాస్ ని అలా అంటావా అని కోపంతో రగిలిపోయాడు, కల్లు తాగిన కోతిలా చిందులేయడమే కాక ఆల్కహాల్ తాగిన ఆంబోతులా రంకెలేశాడు.
అతను చిన్నప్పటి నుంచి విన్న బూతులన్నీ ప్రయోగించాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే శాంత మూర్తి కాస్తా రౌద్ర మూర్తి అయ్యాడు.
అతను చిన్నప్పటి నుంచి విన్న బూతులన్నీ ప్రయోగించాడు. ఎప్పుడూ ప్రశాంతంగా ఉండే శాంత మూర్తి కాస్తా రౌద్ర మూర్తి అయ్యాడు.
P.S: మొన్న ఒక పోస్టులో చిరంజీవిది ఈతాకు యవ్వారం అన్నానని ఒక మూర్ఖ అభిమానికి పిచ్చి కోపం వచ్చి నన్నొక పనికి రాని వాడి కింద జమకడుతూ కామెంట్స్ పెట్టాడు ఫేస్బుక్ లో. దాని మీద అల్లిన కథనం పైది. ఒక వేళ నేను చిరంజీవినే డైరెక్ట్ గా అన్నా ఆయన పట్టించుకోరు, ఎందుకంటే ఆయన నిండుకుండ లాంటి వారు. అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంది అంటారు చూశారా ఆ టైపు, ఇదిగో ఏమీ లేని ఈ ఖాళీ ఎంగిలి ఇస్తరాకు గాళ్ళే ఎగిరెగిరి పడుతుంటారు. ఇలాంటివి స్పోర్టివ్ గా తీసుకోలేని వారు ఒక్కసారి ఆత్మ విమర్శ చేసుకుంటే మంచిది. "పేరు గొప్ప ఊరు దిబ్బ" అన్నట్లు అంతో ఇంతో చదువుకునే ఉంటారు కానీ దానికి తగ్గ ప్రవర్తన ఉండదు. ఇంత చదువు చదివి ఏం లాభం? సద్విమర్శలకు అదే పద్దతిలో సమాధానాలివ్వడం చేయాలి అంతే కానీ బూతులు తిట్టడం పద్దతి కాదు అని ఎప్పటికి తెలుసుకుంటారో ఏమో. అప్పట్లో గోడ మీద ఉన్న వాల్ పోస్టర్ల మీద పేడ కొట్టడం, బురద చల్లడం చేసేవాళ్ళు , ఇప్పుడు అదే పని సోషల్ మీడియా ని అడ్డు పెట్టుకొని చేస్తున్నారు అంతే తేడా.
ఎంతసేపూ సినిమాల్లోనే హీరోలు ఉంటారని, అలాంటి సినిమా హీరోలకి అభిమానులుగానే ఉండిపోదాం, అమ్మ, నాన్న, కుటుంబం కంటే ఈ సినిమా హీరోలే మనకు ముఖ్యం అనుకుంటారే తప్ప సరిగ్గా ప్రయత్నిస్తే మనమూ ఏదో ఒక రంగంలో హీరో అవ్వచ్చు అని విస్మరిస్తున్న ఈ శాంత మూర్తి లాంటి వారికి జాలితో ఈ పోస్ట్ అంకితం.