20, నవంబర్ 2018, మంగళవారం

Plantar Fasciitis - ప్లాంటార్‌ ఫేషియా


'మీరు మధ్య వయస్కులై ఉండి పొద్దుటే లేవగానే నొప్పి లేదంటే  మీరు మీ బెడ్ మీద కాక స్వర్గం/నరకం లోనో ఉన్నట్లు' అనే మాట నిజం అని నమ్మేవాడిని నేను

గత రెండు నెలల క్రితం వరకు, నిద్ర లేవగానే నేను నా బెడ్ మీద ఉన్నానా? లేదా? అని రోజూ నేను చెక్ చేసుకునే వాడిని  .. కానీ గత రెండు నెలలుగా అవసరం తప్పింది లేస్తూనే 'కాలి మడమ' నొప్పిగా ఉండటంతో


మిత్రులైన జోసెఫ్,సలీంతో ఈ విషయం చర్చించినప్పుడు/మసీదించినప్పుడు వాళ్ళ ఇద్దరికీ కూడా ఇలాంటినొప్పి ఉందని తెలియంగానే నేను కూడా బాలకృష్ణలా సంబర ఆశ్చర్యాల్లో మునిగిపోయాను. హమ్మయ్య, మన లాంటోళ్ళు ఇంకా ఉన్నారన్నమాట అనే శాడిస్టిక్ ఆనందం తో పక్కనోడికి కూడా ఉందని తెలిసాక.  


ఎలాగూ కాలమతి ని కాబట్టి, నొప్పి ఎక్కువయ్యాకే డాక్టర్ దగ్గరికి వెళ్లాలను కున్నా. కానీ రోజు దీపావళి సంబరాలు ఆఫీస్ లో జరుగుతూ ఉంటే టైం కలిసి వస్తుందని, డాక్టర్ దగ్గరికి బయలు దేరాను

బ్రౌనీ తినకుండా ఎక్కడికి వెళ్తున్నావ్ అని ఒక తెల్లోడు ఎదురయ్యాడు

దీపావళి  ఫెస్టివల్ లో బ్రౌనీ ఏమిటా అనుకున్నా

తర్వాత అర్థమైంది అది బిర్యాని అని, నోరు తిరగక అతను అలా అన్నాడని

పక్కనే ఉండే హాస్పిటల్ లోకి నొప్పిగా ఉండే ఎడం కాలుతో అడుగెట్టి డాక్టర్ ఉన్నారు అని అడిగా?

డాక్టర్ జత్వట్ ఉన్నారు అందా అందమైన రిసెప్షనిస్ట్ 

జట్టట్ .. నోరు తిరగకపోవడమేంటో ఇవాళ. సరే అని ఆయన రూమ్ లోకి అడుగెట్టా

కాసేపు నా సోది విన్నాక, దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ 'Plantar Fasciitis' అన్నాడు 

డాక్టర్ పేరే కాదు ఆయన చెప్పిన పదం కూడా నోరు తిరగడం లేదు పలకడానికి.  'ప్లాంతర్ పకిడి'?  అన్నాను అర్థం కాక 

కాదు 'ప్లాంటార్ఫేషియఅన్నాడు

ఈయనేదో పెద్ద పేరే చెప్పాడు, కొంపదీసి నాకు రోజులు దగ్గర పడట్లేదుగా .. ఇక శాలువా కప్పుకు తిరగాలా గీతాంజలి లో నాగార్జున లా . ఇప్పటికిప్పుడు సిడ్నీ లో శాలువా కొనాలంటే నెల శాలరీ దానికే పోతుంది.  అర్జెంట్ గా ఇండియా నుంచి పంపమని నాన్నకు చెప్పాలి

స్కాన్ రిపోర్ట్స్ ఉన్నాయా నీ దగ్గర అన్నాడు?

ఇండియా లో ఉన్నాయిఅప్పుడెప్పుడో నాన్న రిటైర్ అయినప్పుడు చాలా శాలువాలు వచ్చాయి. అందులో వడియాలు ఆరేయగా మిగిలిన శాలువాల లోంచి ఒకటి ఉండాలి డాక్టర్

Excuse me అన్నాడు నే చెప్పేదేదో అర్థం కాక 

సారీస్కాన్ రిపోర్ట్స్లేవు డాక్టర్ 

సరే స్కాన్ చేయించుకురా అన్నాడు 

స్కాన్ చూసిప్రతీ పది మందిలో ఒకరికి ఇది వస్తుంది

ఇంతకీ ఒకడిని నేను మిగతా తొమ్మిది మంది ఎవరబ్బా అని తీవ్రంగా ఆలోచించాను కానీ నా అరికాలి కి తట్టలేదు. ఇలా తెగ అలోచించి నా అరికాలికి ఇంత స్ట్రైన్ ఇస్తాను కాబట్టే పెయిన్ వచ్చి ఉంటుంది అని తీర్మానించుకునేలోపే  ప్లాంటార్ఫేషియా గురించి ఎక్స్ప్లెయిన్ చెయ్యడం మొదలెట్టాడు 

కొంత మందికి మడమ క్రింది భాగంలో ఉండే ఎముక (కాల్కేనియస్) పదునుగా పెరుగుతుంది. ఇది పొడిచినట్లుగా లేదా సూదితో గుచ్చినట్లుగా నొప్పిని కలగజేస్తుంది.



ఇది తగ్గడానికి కింది సూచనలు ఇచ్చాడు. 
  • అధికబరువును తగ్గించుకోవటం.  -- నా బరువు మరీ ఎక్కువ లేదు. 
  • కొందరికి కార్టికోస్టిరాయిడ్‌ ఇంజెక్షన్లూ అవసరమవుతాయి. -- నో మెడిసిన్ ప్లీజ్ 
  • ఏ చికిత్సలూ పనిచేయకపోతే ఆపరేషన్‌ కూడా చేయాల్సి రావొచ్చు. -- వామ్మో ఇదంటే భయం 
  • కూసిన్ని వ్యాయామాల లాంటివి చేయాలి - ఇది ఓకే. చేసేస్తాను. 

సో, ప్రస్తుతానికి  వ్యాయామాలు చేస్తున్నా, తగ్గుతుందేమో చూడాలి


2 కామెంట్‌లు: