4, నవంబర్ 2018, ఆదివారం

కాలమతిని నేను

నీకెన్ని సార్లు చెప్పాలిరా ఏదైనా తిన్నాక మూతి తుడుచుకొని స్కూల్ కి రమ్మని. నీ మూతి చూస్తే తెలిసిపోతుంది, పొద్దున్నే నువ్వేం తిన్నావో అన్నాడు నా మిత్రుడు బడదల్ (చిన్నప్పటి మిత్రుడు. మరిన్ని వివరాలకు నా పాత పోస్ట్ ని సంప్రదించండి  )

చెప్పుకో, ఏం తిన్నానో అడిగా నేను 

ఉప్మా అన్నాడు 

నీ బొంద అది నిన్న రాత్రి తిన్నది. ఇవాళ టైం లేక ఇంకా ఏం తిని రాలేదు. ఇదిగో జేబులో బోండాలు ఉన్నాయి, ఈ క్లాస్ లో తిందాంలే అన్నాను. 

బోండాలు జేబులో ఎందుకు వేసుకున్నావ్? నిక్కరుకి నూనె అంటుకుంటుంది. 

నూనే కదా ఏం కాదు, మొన్న ఏకంగా గులాబ్ జాములే జేబులో పెట్టుకొచ్చాను. 

మా అమ్మ రేవు దగ్గర నీ బట్టలు బండ కేసి ఉతకాల్సి వచ్చినప్పుడల్లా, బండ బూతులు తిడుతూ ఉంటుంది, ఎందుకో ఇప్పుడర్థమైంది అంటూ చంకలు గుద్దుకున్నాడు. 

నువ్వో పెద్ద సైంటిస్ట్ వి, గొప్ప విషయం కనుక్కున్నావులే, అయినా ఇప్పుడా విషయం చాకి రేవు పెట్టడం అవసరమా?  అన్నాను. 

శర్మ సార్ 'సైలెన్స్' అంటూ క్లాస్ లోకి వచ్చి గట్టిగా అరవడంతో మాట్లాడం ఆపేసాను. పాఠం మొదలెట్టారు. 

ఇవాళ  సుమతి, కాలమతి, మందమతి అనే మూడు చేపల కథ తెలుసుకుందాం. ఒకరోజు సుమతి  తన మితులైన కాలమతి, మందమతి దగ్గరకొచ్చి ఈ చెరువులో నీళ్ళు ఎండిపోవస్తున్నాయి కాబట్టి మనం ఇక్కడ ఉండటం సురక్షితం కాదు, అంతేకాదు ఇంకొద్దిగా నీళ్ళు తగ్గిన తరువాత ఈ చెరువులో చేపలు పట్టాలని ఇద్దరు జాలర్లు మాట్లాడుకుంటుండగా విన్నాను కాబట్టి మనం ఈ చెరువును వదలి ఇంకో పెద్ద చెరువు కి వెళ్ళిపోదాం అని అంది. ఇది విన్న ఆ రెండు చేపలు, ఎప్పుడో చెరువు ఎండిపోతే ఇప్పుడే మారడం ఎందుకంటూ ఎగతాళి చేసి దాని మాటలు కొట్టి పడేశాయి. కానీ సుమతి మాత్రం ఒక చిన్న కాలువ ద్వారా తప్పించుకుని వేరే పెద్ద చెరువులోకి వెళ్ళిపోయింది. కొద్ది రోజుల తర్వాత ఆ చెరువులో చేపలు పట్టడానికి జాలర్లు రానే వచ్చారు. అప్పటికీ అక్కడే ఉన్న కాలమతి, మందమతి తో పాటు ఇంకొన్ని చేపలు వలలో చిక్కాయి. జాలర్లు ఆ చేపలను ఒడ్డున పడేసారు. కాలమతి ఎట్లాగైనా తప్పించుకోవాలని అలోచించి చచ్చిన దానిలా పడి ఉంది. మందమతి మాత్రం ఎగిరెగిరి పడసాగింది మిగతా చేపల్లాగే. దాంతో ఆ జాలర్లు మొదట ఎగిరెగి పడుతున్న చేపలను బుట్టలో వేసి మూత పెట్టసాగారు. ఇదే అదనుగా భావించి కాలమతి కాలువ లోకి దూకి తప్పించుకున్నది. కానీ మందమతి మాత్రం జాలర్ల చేతిలోనే చిక్కి చని పోయింది.

కాబట్టి నీతి  ఏమిటంటే రాబోయే ఆపద నుంచి ముందుగానే జాగ్రత్త పడాలి అని కథ ముగించారు ఈ లోపు బోండాలు తినడం ముగించేశాము. యేవో తింగరి పనులు చేస్తున్నాం అని అర్థమైన శర్మ సార్ నన్ను లేపి 'మొదటి చేప పేరేమి ?' అన్నాడు 

బసంతి అనుకుంటా సార్..  కాదు కాదు సుప్పనాతి సర్

నీ మూతి కాదూ, మూడవ చేప పేరు ?

ముద్దబంతి

చేమంతి ఏం కాదు.. రెండవ చేప పేరు?

కాలమతి

ఇది మాత్రం ఎలా గుర్తు పెట్టుకున్నావ్ అని ఆయన అడగలేదు కానీ, నా మెంటాలిటీ దాని ప్రాక్టీకాలిటీ తో (ఏదో ఫ్లో లో రాసేసాను, కరెక్టా కాదా అని ఆలోచించకండి)  మ్యాచ్ అయినందువల్లేమో ఆ పేరు బాగా గుర్తు ఉండిపోయింది. 

సో, నేను కాలమతి లాంటి వాడిని, కరెక్ట్ గా చెప్పాలంటే, ఇళ్ళు కాలుతుంటే మంటలార్పడానికి బావి తవ్వే తోలు మందం  గాడిని, ముడ్డి కిందకు మంట వస్తే గానీ జాగ్రత్త పడే రకాన్ని కాదు. 

అసలు ఇలాంటి మెంటాలిటీ తో ఉండటం వల్ల ఎదురయిన కష్ట నష్టాల గురించి ఇంకో టపాలో మాట్లాడుకుందాం.  

2 కామెంట్‌లు: