పి.వి నరసింహారావు గారి జయంతి కదా అని అందరూ ఆయన గురించి రాస్తుంటే మనం మాత్రం ఏం తక్కువ తిన్నాం బళ్ళో దెబ్బలైనా, ఇంట్లో దోశలైనా, గుళ్ళో ప్రసాదాలైనా అని ఆయన మీద ఏదో ఒకటి రాద్దామని అనిపించి మొదలెట్టా కానీ ఆయన గురించి నాకు పెద్దగా తెలీదాయె. సరే మొదలు పెడితే ఏదో ఒకటి రాయొచ్చు అని మొదలెట్టా.
అప్పట్లోనే ఆయన 15 లాంగ్వేజెస్ వరకు నేర్చుకున్నారని విన్నాను. ఇప్పుడంటే చాలా మందికి చాలా లాంగ్వేజెస్ వచ్చు. అంతెందుకు నా బోటి వాడికే తెలుగు, కన్నడ , ఇంగ్లీష్, జావా, సి, సి++ అని బోల్డు వచ్చు. మరి అప్పట్లోనే అన్ని భాషలు అంటే యెంత గొప్ప మరి. అయినా ఎక్కువ భాషలు నేర్చుకోవడం కూడా మంచిదే. హిందీ వస్తే మేనేజర్ మన వాడు అవుతాడు, తమిళ్ వస్తే టీం అంతా మన వాళ్ళే, తెలుగు వస్తే ఇదిగో ఇలా ఎవ్వరికీ ఉపయోగం లేని బ్లాగులు రాసుకోవాలి. అదేం ఖర్మో, నేను ఏ టీం కి వెళ్లినా హిందీ మేనేజర్, అరవ టీం మెంబెర్స్ ఉంటారు. చక్కగా హాయిగా తెలుగులో మాట్లాడలేని పరిస్థితి ఆఫీస్ లో. ఇదేమైనా జాతక ప్రభావమో ఏమో తెలీదు. దీనికి ఉంగరాలో, రంగు రాళ్ళో, గులక రాళ్ళో, జాతకం చెప్పే పంతుల్లో, గుళ్లో దేవుళ్ళో, మీలో ఒకళ్ళో నాకు పరిష్కారం చూపెడతారని కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నాను.
పి. వి నరసింహారావు గారు అప్పుడెప్పుడో ప్రధాన మంత్రి గా ఉన్నారని తెలుసు. చిన్నప్పుడు ప్రధాన మంత్రి కి, ముఖ్య మంత్రికి తేడా తెలీక పరీక్షలో ఏ క్వశ్చన్ వచ్చినా 'N.T. రామారావు' అని రాసేవాడిని. టి.వి లో వార్తలు చూడరా ఇలాంటివి తెలుస్తాయి అని మా నాన్న యెంత తిట్టినా దులిపేసుకొని ఆడుకోవడానికి వీధిలోకి పరిగెత్తేవాడినే కానీ ఈ నాటికీ ఏ రోజూ వార్తలు విన్నది గానీ చూసింది గానీ లేదు అందుకే నా జ్ఞానం ఇట్టా ఏడ్చిందని తెలుసు కానీ ఈ జన్మకింతే అని సరి పెట్టుకోవడమే. ఇక గవర్నర్, రాష్ట్రపతి గురించి అయితే అస్సలు అర్థం అయ్యేది కాదు, వాళ్ళేం చేస్తారో అస్సలు తెలిసేది కాదు, మరి ఇప్పుడు తెలుసా? అని అడక్కండి అది అప్రస్తుతం. ఎందుకంటే మనం ఇక్కడ పి. వి నరసింహారావు గురించి మాట్లాడుకుంటున్నాం.
ఆయన పేరులో ఉండే 'నరసింహా' అనేది బాగా కామన్ నేమ్. మా క్లాస్ లోనే కాదు , చుట్టుపక్కల ఉండే ఇళ్లలోనూ ఆ పేరుతో పది మంది దాకా ఉండేవారు. నరసింహ మూర్తి అని ఒక కుర్రాడు ఉండేవాడు మా కాలేజీ లో. ఎప్పుడూ అమ్మాయిలకి లైన్ వేస్తుండే వాడు అందుకని మర మూర్తి అని పిలిచేవాళ్ళం.
మనుషుల పేర్లే కాదు, ఈ 'నరసింహా' పేరుతో సినిమాలు కూడా చాలా వచ్చినట్లు ఉన్నాయి.
నరసింహా
నరసింహానాయుడు
నర్సింహుడు
లక్ష్మీ నరసింహా
సైరా నరసింహా రెడ్డి
పైన నేను పేర్కొన్న సినిమాల్లో ఒక సినిమా పేరు తుపాకీ కాల్పులు గుర్తుకు తెప్పిస్తే, మరోటి హుస్సేన్ సాగర్ లో దూకిన నిర్మాతని గుర్తుకు తెస్తుంది, అవేంటో మీరే కనుక్కోండి. కాకపోతే మన టాపిక్ అది కాదు కాబట్టి అంతటితో వదిలేద్దాం.
మొత్తానికి నే చెప్పొచ్చేది ఏమిటంటే .... పి.వి నరసింహారావు గారు మన మాజీ ప్రధాని, బహుభాషా కోవిదుడు, తెలుగోడు అయి ఉండి కూడా ప్రధాని అయ్యాడు అని అప్పట్లో గొప్పగా చెప్పేవారు అని.
భవిష్యత్తులో మళ్ళీ ఏ తెలుగోడు అయినా ఆ సీట్ లో కూర్చోగలడో లేడో చూడాలి. ఇప్పట్లో అయితే ఆ సూచనలు ఏమీ కానరావట్లేదు.
చిన్నప్పుడు బళ్ళో ఒకడికి 'ఆవు - గడ్డి' మాత్రమే తెలుసు. ఇందిరా గాంధీ గురించి చెప్పమంటే, ఆవిడ ఉండే బంగాళా బాగా పెద్దది, బంగాళా బయట లాన్ లో గడ్డి ఏపుగా ఉంటుంది. ఆవులకు గడ్డి అంటే ఇష్టం ఇలాంటి ఏపుగా పెరిగిన పచ్చి/పచ్చ గడ్డి అంటే మరీ ఇష్టం అని ప్రతీ దానికి తనకు తెలిసిన ఆవు - గడ్డి కాన్సెప్ట్ తో లింక్ చేస్తుంటాడు.
ఆవు - గడ్డి కథ కు నా ఈ బ్లాగ్ పోస్ట్ కి అస్సలు సంబంధం లేదు, ఉందనిపిస్తే అది మీ భ్రమ అని నా మనవి.