13, సెప్టెంబర్ 2021, సోమవారం

ఎవ్వరినీ ఉద్దేశించి రాసిన కథ కాదు

ఒకానొక ఊర్లో భూషణం అని ఒక పెద్ద మనిషి ఉండేవాడు, అతనంటే చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ భయం భక్తి  ఉందో లేదో తెలీదు కానీ రాజు గారి దేవతా వస్త్రాల టైపు లో కొంతమంది కి ఉన్నట్లు ఇంకొంత మందికి లేనట్లు ఉండేది. ఆ పెద్ద మనిషి కూడా అందరికీ నేనే పెద్దన్న అన్నట్లు గానే  వ్యవహరిస్తూ తన ఊరిని బాగానే చూసుకునేవాడు ఈగ కూడా వాలనీయకుండా, అలాంటిది ఒకానొక రోజు ఏనుగుల గుంపు వచ్చి అతని తోటని పెంట పెంటగా చేసి చెల్లాచెదరు చేసి ఊరిని అల్లకల్లోలం చేశాయి. 

అతని తోటనే కాపాడుకోలేకపోయాడు ఇక ఊరినేం కాపాడతాడు అని అవహేళన చేశారు చుట్టుపక్కల జనం. ఈగో హర్ట్ అయి ఆ ఏనుగుల గుంపు ని వేటాడటానికి మెరికల్లాంటి తన మనుషులను కొందరిని పోగు చేసి మంచి ట్రైనింగ్ ఇప్పించి పంపాడు. 

వాళ్ళు వేట మొదలెట్టారు, ఆ ఏనుగుల అడవిలోకి పారిపోతూ వీళ్ళకి దొరకలేదు.  అయ్యా, రోజూ మనూరి నుంచి బయలుదేరి అక్కడికి వెళ్ళి వేటాడి మళ్ళీ మన ఊరికి వచ్చేప్పటికి బాగా అలసిపోతున్నాం అన్నారు ఆ మెరికలు

సరే మీ కోసం ఆ ఊర్లోనే వసతి ఏర్పాటు చేస్తాను, యెంత ఖర్చైనా పర్లేదు ఆ ఏనుగుల మంద ను మట్టుబెట్టి తీరాల్సిందే అని వారికో వంటమనిషి, పనిమనిషి పెట్టాడు. కొన్ని రోజులకు వాళ్ళ పెళ్ళాలు, పిల్లలు అక్కడే సెటిల్ అయ్యారు, మరింత ఖర్చులు పెరిగాయి. 

సర్పంచ్ ఊరి అభివృద్ధికి వచ్చే డబ్బులను అక్కడికి తరలించాడు, సరి పోకపోతే తన ఊరి ప్రజల నుంచి పోగు చేసి పంపాడు. 

కొన్ని నెలలకి ఆ ఏనుగుల గుంపు లీడర్ ని చంపారు, కానీ మిగతా ఏనుగుల మందను మట్టుబెట్టే దాకా అక్కడి నుంచి తిరిగి రావద్దని ఆదేశించాడు. 

ఇలా తరాలు మారిపోయాయి, అటువైపు ఏనుగుల మంద పెరుగుతూనే ఉంది , ఇటువైపు వీళ్ళకు ఖర్చులు పెరుగుతూనే ఉన్నాయి. తర్వాతి తరం వాడైన బోడయ్య,  ఆ మెరికలని అక్కడి నుంచి వెనక్కి వచ్చెయ్యమన్నాడు. 

మూడ్రోజుల క్రితమే రాసిన ఈ పోస్ట్ వ్యక్తిగత పనుల్లో పడి మర్చిపోయి ఇప్పుడు పోస్ట్ చేస్తున్నా. ఈ కథ చనిపోయిన లేదా బతికి ఉన్న వారిని ఉద్దేశించి రాసినది కాదని, మీకెక్కడైనా పోలికలు కనిపిస్తే అవి కేవలం యాదృచ్ఛికం అని సవినయంగా మనవి చేసుకుంటున్నాను. ఇంతే సంగతులు చిత్తగించగలరు. 

29 కామెంట్‌లు:

 1. మొహమాట పడుతున్నారు గానీ ఎవరినో ఉద్దేశించే వ్రాసుంటారు? 🙂

  రిప్లయితొలగించండి
 2. ఎప్పుడో చిన్నప్పుడు చదివిన పాఠం లో పద్యం గుర్తుకొస్తోంది
  "కుక్క తోక తెచ్చి ఎన్నాళ్ళు ఉతికినా నలుపు నలుపే గాని తెలుపు రాదు". అందర్నీ సమస్కరించలేము.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఏమనుకోకండి లక్కరాజు వారు, అది “ఎలుకతోక దెచ్చి ….. “ (వేమన పద్యం). (కుక్కల్లో తెల్లకుక్కలు కూడా ఉంటాయి కదా, కాబట్టి “కుక్క తోక” కాదు)
   // ఆ. ఎలుకతోక దెచ్చి యెందాక నుతికిన
   నలుపుగాక యేల తెలుపు గలుగు
   కొయ్యబొమ్మ తెచ్చి కొట్టిన గుణియౌనె
   విశ్వదాభిరామ వినర వేమ.//

   తొలగించండి
  2. నాకు తెలుసు విన్నకోట వారో శర్మగారో తప్పు పట్టుకుంటారని."సమస్కరించలేము" కూడా తప్పే. "సంస్కరించలేము" అనుకుంటా. This is not my day.సామాన్యంగా నేను తెలుగులో వ్రాసి ఒక వారం రోజులు సరిదిద్దుతాను. విన్నకోట వారూ థాంక్స్.సరిఅయిన పద్యం చెప్పినందుకు.Thank You .

   తొలగించండి
  3. ఎప్పుడో స్కూళ్ళో చదువుకున్న పూర్తి పద్యాన్ని మళ్ళీ గుర్తుకు తెప్పించారు మేష్టారు, థాంక్స్

   తొలగించండి
  4. లక్కరాజు రాజు గారూ, ఈ తెలుగు టైపింగ్ సమస్యలు నన్నూ బాగా ఇబ్బంది పెడుతుంటాయి.ఇంగ్లీష్ లో 10 నిముషాల్లో టైప్ చేయగలిగేది తెలుగులో గంట పడుతోంది.

   తొలగించండి
  5. పెద్దలు మన్నించాలి. లక్కరాజావారు తప్పులు పట్టేంత వాడిని కాదు సార్! ఏమనుకోవద్దూ!ఆ పద్యం అసలు రూపం ఇదంటారు.చాలా చోట్ల అది ఎలుక అనే ఉంటుంది.

   ఎలుగు తోలు దెచ్చి ఏడాది ఉతికినా నలుపు నలుపేగాని తెలుపురాదు.

   ఇక తెనుగులో టైప్ చేయడానికి సమస్యలు తక్కువే, తెలియవలసినది వర్ణక్రమం అని పెద్దల ఉవాచ.

   ఇక వాడే సాఫ్ట్ వేర్ చాలా చిత్రాలు చేస్తూ ఉంటుంది. నాకు నచ్చినది 'బర్హా' సుళువు.

   తొలగించండి
  6. ఎలుగు కూడా నలుపులో ఉంటుంది కాబట్టి అదీ కరెక్టే అయి ఉండచ్చేమో శర్మ గారూ, మీ లాంటి పెద్దలే నిర్ణయించాలి, నా లాంటి పిల్ల కాకులకు తెలియక పోవచ్చు. ఈ బరహా సాఫ్టువేర్ try చేసి చూస్తాను.

   తొలగించండి
  7. శర్మ గారు,
   మీవంటి పెద్దలు, విజ్ఞులు చెబితే మేం విని నేర్చుకోవాలి. అంతేకానీ నేనంతటివాడిని కాను అని మీరే అంటారేమిటి?

   నిజానికి “ఎలుగుతోలు” అనే నేను చదువుకున్నట్లు, విన్నట్లు జ్ఞాపకం. ఈ మధ్య “ఎలుకతోలు” అనడం ఎక్కువయింది. సరే, లక్కరాజు వారికి పూర్తి పద్యంతో సహా చెబుదాం అనుకుని వేమన శతకం చూశాను - అది కూడా “ఆంధ్రభారతి” వారి శతకాల జాబితాలో. అక్కడ “ఎలుక” అని చూసి ఆశ్చర్యపోయాను. పైగా “తోలు” కాదు “తోక” అని ఉంది కూడా. నేను నేర్చుకున్నదాని మీద నాకే అనుమానం వచ్చింది గానీ సరే నేనెంతవాడినిలే అనుకుని ఆ పద్యమే ఇక్కడ పెట్టాను. మరి ఆ పద్యపాఠం వేరు, ఈ సామెత వేరు అనుకోవాలా?

   (ఓ సంగతి చెప్పనా - ఈ సోకాల్డ్ ఆన్లైన్ “సౌలభ్యం” వచ్చిన తరువాత నేను నేర్చుకున్నదాని మీద నాకే అంతకంతకూ అనుమానం పెరిగిపోతోంది 😳. )

   తొలగించండి
 3. లక్కరాజు వారు,
  // “ నాకు తెలుసు విన్నకోట వారో శర్మగారో తప్పు పట్టుకుంటారని” //

  నాకున్నదాని కన్నా ఎక్కువ credit ఇచ్చేస్తున్నారు మీరు. సామాన్యుడిని. నాకున్న పరిమిత జ్ఞానం ప్రకారం ఏదైనా కొట్టొచ్చినట్లు కనిపిస్తే ఆ సంగతి ఎదుటివారికి చెప్పెయ్యాలనే ……. దురద, అంతే 🙏.

  మీరు చాలా దశాబ్దాలుగా దూరతీరాల్లో ఉంటున్నారు కదా. దాని వలన మీ తెలుగు వాడకంలో కొన్ని కొన్ని మసకబారడం సహజం.

  రిప్లయితొలగించండి
 4. ఇండిక్‌ కీ బోర్డు సులువు. ఆంగ్లాక్షరలాతో టైప్ చేస్తే సింపల్ గా తెలుగులో వచ్చేస్తాయి‌.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇది ఎలా పని చేస్తుందో తెలీదు గానీ నేను ఎదుర్కొన్న ఇబ్బంది ఏమంటే కరెక్ట్ అని తెలుగులో రావడానికి 'karact' అని ఇంగ్లీష్ లో టైప్ చేయాల్సి రావడం

   తొలగించండి
 5. విన్నకోట వారూ శర్మగారూ పనిలో పని నాకు ఒక సందేహం ఉంది తీర్చండి ప్లీజ్. ఎదో తోక తీసుకువచ్చి ఎంత సాఫీ చేద్దామన్నా అది ముడుచుకు పోయే ఉంటుంది. అది కుక్క అనుకుంటాను. ఇదికూడా ఫేమస్ పద్యమే. అసలు అది వ్రాద్దామనుకున్నాను కానీ గుర్తు రాలేదు. మొదట నక్క పెడదా మానుకున్నాను కానీ చివరికి కుక్కతో సెటిల్ అయ్యాను.

  రిప్లయితొలగించండి
 6. నాకు తెలిసి అది "ఎలుగుతోలు తెచ్చి...." ఎలుగుతోలు నల్లగానే ఉంటుంది కదా (ధృవపు ఎలుగుబంట్ల సంగతి వదిలేయండి వాటిగురించి వేమన ప్రస్తావించడు కదా). ఎలుకతోలు అన్నది అపపాఠం అని నా ఉద్దేశం. ఎలుకలు సాధారణంగా గోధుమర్ణపు చర్మంతో ఉంటాయి. పైగా ఎలుకతోలు వలన ప్రయోజనం శూన్యం. అంతచిన్న దానితో పనికివచ్చే ఏవస్తువునూ చేయలేరు కదా. ఎలుగుతోలు ఐతే పెద్దగా వస్తుంది, ఉపయోగించే అవకాశం మెండు. కాని దాని నలుపును విరచేందుకు ప్రయత్నించి లాభం లేదు కదా, అందువల్ల దానితో నల్లటి వస్తువులే తయారు చేయగలం కానీ ఆకర్షణియంగా తెల్లగా ఉండేవి చేయలేం.

  రిప్లయితొలగించండి
 7. లక్కరాజు వారు,
  // “ విన్నకోట వారూ శర్మగారూ పనిలో పని నాకు ఒక సందేహం ఉంది తీర్చండి ప్లీజ్” //

  శర్మ గారు చెబుతారేమోనని ఆగాను. వయసులో పెద్దవారు కదా, తొందరగా గుడ్-నైట్ అనేసి ఉంటారు. బహుశః. కాబట్టి నేనే నా పరిమిత జ్ఞానం ప్రకారం చెబుదామని పూనుకున్నాను.

  వంకర తీద్దామని ప్రయత్నించేది కుక్క తోకనే నండి. ఎంత సాఫు చేద్దామని తంటాలు పడినా కూడా మన పట్టు వదిలేస్తే మళ్ళీ తన మామూలు వంకర ఆకారానికొచ్చేస్తుంది కదా. కాబట్టి కుక్క అని మీరు కరక్ట్ గానే “సెటిల్” అయ్యారు (🙂). వక్రబుద్ధి కలిగిన మనిషికి ఎంతగా మంచిమాటలు చెప్పినా విన్నట్లే విని మళ్ళీ తన మూమూలు పద్ధతికే (వంకర) వెళ్ళిపోయే మనిషి గురించి చెప్పడానికి వాడే నానుడి ఇది.

  ఇక “కుక్కతోక వంకర” అనే దాన్ని గురించి ప్రత్యేకించి పద్యం ఉన్నట్లు నేనెప్పుడూ వినలేదండి. I might be wrong.

  రిప్లయితొలగించండి
 8. థాంక్స్ విన్నకోట వారూ, శర్మ గారూ, శ్యామలీయం గారూ . ఈ కుక్క నక్క ఎలుగు బంట్ల తోటి కన్ ఫ్యూజ్ అవుతున్నాను.

  రిప్లయితొలగించండి
 9. శ్యామలీయం గారు ఎలుకలని పట్టించుకోవద్దన్నారు కదా !

  రిప్లయితొలగించండి
 10. కథ ఏనుగులగురించైతే, కామెంట్లు ఎలుకల/ఎలుగుల గురించా? ఇది కూడా యాదృచ్ఛికమేనా లేక అందరి దృష్టి ఏనుగులనుంచి పక్కదారి పట్టించడానికి కొంతమంది (off) ఘనుల ప్రయత్నమా?

  రిప్లయితొలగించండి
 11. కాంత్ గారూ తెలుగులో ఏనుగులమీద నాకు తెలిసిన సామెతలు లేవు. అందుకని. మీకుఁబాధ కలిగిస్తే క్షమించండి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నాకొక్కటి అర్థం అయింది, వేమన గారే ఈ వర్ణ వివక్ష కి కారణంలా తోస్తోంది, తన పద్యాల ద్వారా నలుపుని హేళన చేశారు, మా మనోభావాలు దెబ్బతిన్నాయి, ఆయన మీద case వేయొచ్చంటారా?

   తొలగించండి
  2. వెయ్యచ్చు వెయ్యచ్చు, పవన్ కుమారా. దేవుడి మీద కేసు వేసినట్లు ఓ సినిమా వచ్చిందిగా, దాన్ని స్ఫూర్తిగా తీసుకోవచ్చు 😁.

   తొలగించండి
  3. మంచి లాయర్ ని చూసి నోటిస్ ఇప్పించేద్దురూ కేస్ నిలబడుతుందాలేదా తరవాత చూద్దాం.జిత్మలానీ ఐతే ఇటువంటి కేస్ లు బాగా వాదించగలరు. వేమన తాత అడ్రసు..... దొరికిందండోయ్...ఇరుక్కుపొయారు వేమన తాతగారు."ఉనికి పశ్చిమ వీధి మూగ చింతపల్లె మొదటి ఇల్లు" ఈ మాత్రం ఆధారం చాలు లెద్దురూ...:)

   తొలగించండి
  4. అయితే case వేసేస్తాను శర్మ గారు, రాత్రికి రాత్రే కాస్త గుర్తింపు పొందచ్చు మీడియా వాళ్ళ దెబ్బకి

   తొలగించండి
  5. లక్కరాజుగారూ,
   మీకు ఏనుగులమీద సామెతలు తెలియదన్నందుకు బాధపడనక్కర్లేదు. కాని మీరు మొదట వేమన పద్యం ఉదహరించి ఇప్పుడు ఏనుగులమీద సామెతలు తెలియదని చెప్పి కప్పిపుచ్చుకోడం కొంచం కన్‌ఫ్యూసించవల్సిన విషయం. చిన్నప్పుడెప్పుడో చదివిన ఒక సామెత గుర్తుకొస్తోంది "ఏనుగుకును ఒక పరి కాలు జారుట కలదు" (ఆంగ్లంలో అది Even Homer Sometimes Nods). అంటే పెద్దపెద్దవారు కూడా అప్పుడప్పుడు చిన్న చిన్న తప్పులు చేయొచ్చు అని (DDLJ లో షారుఖ్ డైలాగ్‌లాగుందికదూ). ఇది మీకు అన్వయించి "లక్కరాజుగారు బొక్కబోర్లా పడ్డార"ని చెప్పుకోవచ్చునన్నమాట. ఈ కామెంట్‌తో మీకు బాధకలిగిస్తే ఇప్పుడు మీరు నన్ను క్షమించేసేయండి. (BTW, గూగ్‌ల్ లో వెతికితే ఏనుగుల మీద సామెతలు, వేమన శతకంలో ఏనుగు పదమున్న పద్యాలూ, ఇంకా ఏనుగు లక్ష్మణ కవి సుభాషితాలూ అన్నీ కనిపిస్తాయి.)

   తొలగించండి
 12. "ఎవ్వరినీ ఉద్దేశించి రాసిన కథ కాదు" అన్న డిస్క్లైమర్ తో వ్రాసిన పోస్ట్ లో వచ్చిన వేమన గారి పద్యం ఆధారంగా వేమనగారి మీద వర్ణ వివక్షత వ్యాజ్యం వేస్తే కోర్టులో నిలవదని నా అభిప్రాయం.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. పాయింట్ లాజికల్ గానే ఉంది లక్కరాజు గారు, దీనికి పరిష్కారం ఆలోచించాలి మరి.

   తొలగించండి