30, సెప్టెంబర్ 2021, గురువారం

ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 4

ఆస్ట్రేలియా సీరీస్ లో ఒకటవ , రెండవ మరియు  మూడవ భాగాలకి ఇది కొనసాగింపు. 

ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి బయటికి రాగానే చీకటి పడిపోయింది, టైం చూస్తే 5:30. మొదటి రోజు ఆఫీసులో పెద్ద పనిలేదు కాబట్టి ఒక గంట ముందే బయలుదేరేవాన్ని. క్రాంతి ఫోన్ చేసి 5:30 వరకు వెయిట్ చేయగలవా నేనూ వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం రూమ్ కి అన్నాడు. 

ఇదేంట్రా అబ్బాయ్, ఇంత చీకటి పడింది అన్నాను క్రాంతి తో ఆఫీస్ నుండి బయటికి రాగానే. 

ఇంకా చలికాలం స్టార్ట్ అవలేదు కాబట్టి ఈ మాత్రం.. లేదంటే సాయంకాలం నాలుగుకే చీకటి పడుద్ది. 

మధ్యాహ్నం లంచ్ కి వచ్చినప్పుడు అన్ని షాప్స్ తెరచి ఉంచారు, ఇదేంటి ఇప్పుడు ఒకటి రెండు తప్ప అన్నీ మూసేశారు? 

అవును ఇక్కడ సాయంత్రం 5 కే మూసేస్తారు, ఆ తెరచి ఉన్న షాప్స్ కూడా మన ఇండియన్స్ పెట్టుకున్న షాప్స్ అయి ఉంటాయి. 

ఆఖరికి మెడికల్ షాప్ లు కూడానా. 

అవును,కెమిస్ట్ warehouse లాంటి పెద్దవి తప్ప చిన్న మెడికల్ షాప్స్ ఐదుకే మూసేస్తారు. 

ఇలా తొందరగా చీకటి పడ్డం వల్ల ఇక్కడా సాయంకాలం మిస్ అవ్వవల్సిందేనా? బెంగుళూరు లో ఉన్నప్పుడు ఆఫీస్ నుంచి బయటకి వచ్చేప్పటికి సాయంత్రం ఏడో లేదా ఎనిమిదో అయ్యేది. ఒక వేళ లక్కీగా మేనేజర్ ఆఫీస్ కి రాకపోతే సాయంత్రం ఆరుకే బయటపడినా ఆ ట్రాఫిక్ ని ఈదుకొని ఇంటికి చేరడానికి 7:30 అయ్యేది. అలా బెంగుళూరు లో ఎన్ని లెక్కలేనన్ని సాయంత్రాలు మిస్ అయ్యానో ఆ విషయం తలచుకుంటే ఇప్పటికీ బాధగా ఉంటుంది. అయితే కనీసం ఇక్కడ ఎండలు బాగా తక్కువన్నమాట అన్నాను చుట్టూ చూసి అప్పటికే పూర్తి చీకటి పడిపోవడంతో. 

అలా అనుకునే నేనొచ్చిన మొదటి వారమే ఎగేసుకొని బీచ్ కి వెళ్ళి తిరిగొస్తే మా రూమ్ లో వాళ్ళు నా మాడిపోయిన మొహాన్ని గుర్తుపట్టక రూమ్ లోకి రానివ్వలేదు. ఇక్కడి ఎండలతో స్కిన్ కాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి బాడీకి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయకుండా ఎండాకాలంలో బయటికి వెళ్ళకు.  సరే గానీ మన ఆఫీసులు ఉండే ఏరియా లో ఇండియన్ హోటల్స్ లేవు కదా మధ్యాహ్నం ఏం తిన్నావ్ అన్నాడు. 

మనకు రైస్ ఐటెం తప్ప పిజ్జా, బర్గర్, పాస్తా లాంటివి నచ్చవు కాబట్టి థాయ్ రెస్టారెంట్ ఉంటే అక్కడ క్రాబ్ మీట్ ఫ్రైడ్ రైస్ తిన్నాను. టేస్ట్ చాలా బాగుంది అన్నాను 

టేస్ట్ప బాగుంటుంది గానీ పర్సు కి చిల్లెట్టి ఉంటారే?

అవును, 22 డాలర్లు ఛార్జ్ చేశారు. ఇలాగైతే ఇక్కడ డబ్బులు మిగిల్చి బెంగుళూరు లో ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కాదు కదా ఇంకా అప్పులు చెయ్యాల్సి వస్తుంది. కాబట్టి రేపటి నుంచి నేను కూడా నీ లాగే డబ్బా తెచ్చుకోవాల్సిందే అన్నాను. 

సరే, మొన్న నా ఫేవరిట్ హీరో పవన్ కళ్యాణ్  గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది. వెళదామా నీ కిష్టమైతే అన్నాడు. 

నీది తెనాలే, నాది తెనాలే అని చంకలు గుద్దుకొని వెళదాం అని చెప్పి 'అవును ఇక్కడికి కొత్త  తెలుగు సినిమాలన్నీ తెస్తారా ?' అని అడిగాను. 

అన్నీ కాదు కానీ పెద్ద హీరోల సినిమాలు తెస్తారు కానీ ఇక్కడ సినిమాలు చూడాలంటే బెంగుళూరు లో ఫ్లాట్ కొనుకునే నీ కోరిక ను వాయిదా  వేస్తూనే ఉండాలి, ఎందుకంటే టికెట్ రేట్ 25-30 డాలర్ల దాకా ఉంటుంది బాగా కాస్ట్లీ అన్నాడు. 

సరే మరి రాత్రి భోజనం?

ఆ థియేటర్ ఉండే ఏరియా లో మన పారడైజ్ బిర్యాని రెస్టారెంట్ ఉంది. కాబట్టి ఇబ్బంది లేదు అన్నాడు. 

సరే సినిమా చూసొచ్చాక రెస్టారెంట్ కి వెళదాం అన్నాను, పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఉత్సాహంలో.  

ఇదేం బెంగళూరో, హైదరాబాదో  కాదు అప్పటికి రెస్టారెంట్ తెరిచుంచడానికి 

అదేంటి రెస్టారెంట్ కూడా పది లోపలే  మూసేస్తారా? 

అవును ఇప్పడు కొంచెం బెటర్, మన ఇండియన్స్ ఇక్కడికి చొరబడ్డాక ఈ మాత్రం లేట్ గా అయినా షాప్స్ తెరచి ఉంచుతున్నారు. లేదంటే వీళ్ళ early to bed early to rise పాలసీ వల్ల హోటల్స్ కూడా ఎనిమిదికే మూసేవారు. 

రెస్టారెంట్ కి వెళ్ళి మెనూ చూసి ఇదేంటి, బిర్యాని 15 డాలర్లా? అన్నాను. 

చెప్పానుగా నువ్వనుకున్నంత ఈజీ కాదు ఇక్కడ డబ్బులు మిగిలించడం. ఇక్కడ అన్నీ ఎక్స్ట్రీమ్ రేట్స్. రెంట్స్ మరీ ఎక్కువ, ఆ రెంట్స్ కట్టుకునే బదులు ఊరి బయట టెంట్స్ వేసుకుని బతకడం బెస్ట్. 

కనీసం అదైనా ఫ్రీ అన్నమాట. 

అంతలేదు, దానికీ డబ్బు కట్టాల్సిందే. సిడ్నీ బాగా కాస్ట్లీ సిటీ. అంతేకాదు ఈ దేశంలో లో టాక్స్ బాగా ఎక్కువ. ఇక్కడ సంపాదించిన డబ్బు నీళ్ళను మన రెండు చేతులతో పట్టుకున్నట్లే ఉంటుంది. సంపాదన చేతుల నిండుగా ఉన్నట్లు ఉంటుంది గానీ మన నోటి దాకా వచ్చేలోగా సగంటాక్సుల రూపంలో కారిపోతుంది అని ముందే హెచ్చరించాడు. 

అక్కడ బిర్యాని తిని తర్వాత గబ్బర్ సింగ్ సినిమా చూసి రూమ్ కి వెళ్ళేపాటికి  టవల్ కి, బాత్రూం గోడలకి , సింకులో ఎక్కడపడితే అక్కడ ఎర్రటి మరకలు ....రక్తం లాగా

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి