20, అక్టోబర్ 2021, బుధవారం

చల్లని కేసు

ఈ మధ్య నేను చూసిన మరో మంచి సినిమా కోల్డ్ కేస్, పృథ్వి రాజ్ ప్రధాన పాత్రలో నటించిన మళయాళ సినిమా ఇది, మరి తెలుగులో డబ్బింగ్ చేశారో లేదో తెలీదు. 

పరిష్కరించకుండా మిగిలిపోయిన కేసునో లేదంటే ఐడెంటిఫై చేయలేని వ్యక్తుల హత్య కి సంబంధించిన కేస్ లని కోల్డ్ కేస్ అంటారని నాకు అర్థమైన ప్రకారం నిర్వచించగలను. గూగుల్ లో సరదాగా సెర్చ్ చేస్తే తెలుగు అనువాదం ఇలా దొరికింది, దాన్నే తీసుకొచ్చి టైటిల్ గా  పెట్టేశా.




కోల్డ్ బ్లడెడ్ మర్డరర్ ని అయితే 'చల్లటి రక్తపు హంతకుడు' అని అనువాదం చేసుకోవచ్చేమో.  సరే సోది పక్కనబెట్టి సినిమా గురించి మాట్లాడతా. 

సాధారణంగా మర్డర్ మిస్టరీ కి సంబంధించిన థ్రిల్లర్ సినిమాల్లో ఇతనే హంతకుడు అని మొదట్లోనే పరిచయం చేయడం ఆ తర్వాత హీరో అతన్ని ఏ విధంగా కనిపెట్టి పట్టుకుంటాడు అనేది ఒక రకం అయితే మరో రకం లో చివరి వరకు ఆ హంతకుడెవరో ప్రేక్షకులకి కూడా తెలియనివ్వకుండా చివర్లో రివీల్ చేయడం. సో, ఈ రెండు పద్ధతుల్లో ఏది బెటర్ గా తీయొచ్చు అనేది ఆ తీసే విధానం బట్టి ఉంటుంది గానే మొదటి పద్దతిలోనే తీస్తేనే లేదంటే రెండో పద్దతిలోనే తీస్తేనే హిట్ అవుతాయని ఎవరూ బల్ల గుద్ది చెప్పలేరని నా గట్టి నమ్మకం. లేటెస్ట్ గా వచ్చిన నాని, సుధీర్ బాబు కాంబినేషన్ లో వచ్చిన 'V ' మొదటి రకానికి చెందినదైతే, అదే నాని నిర్మాతగా విశ్వక్ సేన్ హీరో గా వచ్చిన 'Hit' సినిమా రెండో కోవలోకి చెందినది. 

ఈ రెండవ కోవలోని థ్రిల్లర్స్ ని కూడా రెండు రకాలుగా విభజించచ్చు అని నా అభిప్రాయం. చాలా వరకు సినిమాల్లో హత్య లేదా హత్యలు  చేసిన వాడు ఇదిగో వీడే అంటూ ప్రేక్షకులను ఫూల్స్ ని  చేస్తూ  అంత వరకు సీన్ లో చూపించని కారెక్టర్ ని సీన్ లో కి తీసుకొచ్చి వీడే హంతకుడు అని చెప్తారు. అక్కడే ప్రేక్షకులు ఆ ట్విస్ట్ ని ఎంజాయ్ చేయలేక ఆ సినిమా మీద నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. 'శివన్ ' అని ఒక తెలుగు సినిమా యు ట్యూబ్ లో ఉంటుంది చూడండి, చివర్లో  అంతవరకూ సినిమాలో చూపించని వాడిని తీసుకొచ్చి, వీడే అంతటికీ కారణం అని చివర్లో చిన్న ఫ్లాష్ బ్యాక్ జత చేర్చి చూపెడతారు. 

ఇక రెండో కోవలోకి వచ్చేది నాకు గుర్తున్నంతలో అప్పట్లో వంశీ అన్వేషణ, రాజశేఖర్ 'ఆర్తనాదం', కథ లో సస్పెన్స్ పండించగలిగితే బాబీడియోల్ ని కూడా హీరోగా పెట్టి హిట్ తీయొచ్చని నిరూపించిన 'గుప్త్',  నిన్నటి రీమేక్ సినిమా రాక్షసుడు. ఈ సినిమాల్లో అంతవరకూ కథలో ఉండే కారెక్టరే ఆ హత్యలు చేస్తున్నట్లు చూపించి, అర్రే మనం గుర్తించలేక పోయామే భలే ట్విస్ట్ ఇచ్చాడు రా కథకుడు అని సలాం చేస్తారు. సరిగ్గా ఈ కోల్డ్ కేస్ సినిమాలో కూడా అంతవరకూ కథలో ఉండే కారెక్టరే ఆ హత్యలు చేస్తున్నట్లు చూపించి కాస్త థ్రిల్ చేస్తారు. ఈ సినిమాలో థ్రిల్ కి హారర్ మోడ్ ని కూడా ముడెయ్యడం కొంచెం వెరైటీ అనుకోవాలి. 

కథలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నాయి గానీ సినిమాటిక్ లిబర్టీ కింద వాటిని వదిలేయచ్చు. పైగా  చెత్త సినిమాల మధ్య ఈ మాత్రం విషయం ఉన్న సినిమా చూపిస్తే ఖుషీ అయిపోతాం. సినిమా నాకు నచ్చింది కానీ మరెందుకో చాలా మందికి నచ్చినట్లు లేదు. 

మమ్ముట్టి నటించిన మళయాళ సినిమా 'ది ప్రీస్ట్' కూడా చూశాను గానీ అంతగా నచ్చలేదు, యేవో రెండు స్టోరీ లను కలిపి ఒక సినిమాగా తీసిన ఫిలింగ్ కలిగింది. ఈ సినిమా నాకు నచ్చలేదు కానీ ఎక్కువ మందికి నచ్చినట్లు ఉంది. 

2 కామెంట్‌లు: