ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో తెలియలేదు ఈ పోస్ట్.
నిన్న సాయంత్రం మిత్రుడి కొడుకు బర్త్డే పార్టీ లో ఉన్నప్పుడు 'పునీత్ రాజ్ కుమార్ చనిపోయారట' అన్నాడో మిత్రుడు వాట్సాప్ లో వచ్చిన మెసేజ్ చూసి.
ఇదేదో ఫేక్ న్యూస్ అయి ఉంటుందిలే అన్నాను. మొన్నొకసారి శ్రీకాంత్ మరణం అని హెడ్డింగ్ పెట్టి హీరో శ్రీకాంత్ ఫోటో కూడా పెడితే అయ్యో పాపం అనుకున్నా, తీరా చూస్తే హెడ్డింగ్ ఒకటి మేటర్ మరొకటి. ఇది కూడా అలాంటిదేనేమో అన్నాను.
లేదు నిజమే, ఫొటోస్ కూడా షేర్ చేశారు అన్నాడు.
కొంచెం షాకింగ్ గానే అనిపించింది అతని మరణం. నేను MCA చదువుతున్న రోజుల్లో ఒకసారి బెంగుళూరు వెళ్ళినప్పుడు అప్పు సినిమా రిలీజ్ అయి దుమ్ము దులుపుతోంది. యెవర్రా ఈ హీరో అని చూస్తే రాజ్ కుమార్ కొడుకు 'పునీత్ రాజ్ కుమార్' అని ఆ సినిమా డైరెక్టర్ మన పవన్ కళ్యాణ్ తో బద్రి తీసిన పూరి జగన్నాథ్ అని తెలిసింది.
మొదటి సినిమా బద్రి తో బంపర్ హిట్ కొట్టి రెండవ సినిమా బాచి తో మొహం వాచేలాగా ప్లాప్ అందుకున్న పూరి జగన్నాధ్ ని పిలిచి మరీ రాజ్ కుమార్ తన పెద్ద కొడుకుతో అప్పటికే తెలుగులో బంపర్ హిట్ అయిన 'తమ్ముడు' సినిమాని రీమేక్ చేయించాడు.
ఆ తర్వాత పూరీ జగన్నాద్ తెలుగులో 'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' తో మళ్ళీ హిట్ అందుకుని కన్నడ ఇండస్ట్రీ వైపు వెళ్ళకూడదు అని డిసైడ్ అయ్యారట, కానీ మళ్ళీ రాజ్ కుమార్ గారు పిలిపించి తన చిన్న కొడుకైన పునీత్ రాజ్ కుమార్ ని హీరో గా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత పూరి భుజాలపై ఉంచారు. కన్నడ ఇండస్ట్రీ వైపు వెళ్ళకూడదని అనుకున్న పూరి, రాజ్ కుమార్ గారి మీద గౌరవంతో చేసిన సినిమానే 'అప్పు'. అప్పట్లో అదొక బ్లాక్ బస్టర్ హిట్.
అదే సినిమాని రవి తేజ తో 'ఇడియట్' గా తీసిన పూరి వెనక్కి తిరిగి చూసే అవసరం లేనంతగా దూసుకెళ్లిపోయారు వరస హిట్లతో.
నెక్స్ట్ ఇయర్ పూరి జగన్నాథ్ జూనియర్ ఎన్టీఆర్ తో ఆంధ్రా వాలా తీస్తుంటే అదే సినిమాని కన్నడలో కూడా పునీత్ తో తీయమని అడిగితే పూరి జగన్నాథ్ సున్నితంగా తిరస్కరించారట కావాలంటే ఇదే కథని వేరే డైరెక్టర్ తో తీసుకోమని. అప్పుడు అదే కథని మెహర్ రమేష్ డైరెక్షన్ లో 'వీర కన్నడిగ' పేరుతో సమాంతరంగా తీశారు. రెండు భాషల్లో రిలీజ్ అయిన ఆ సినిమా తెలుగులో బోల్తా కొడితే కన్నడ లో బంపర్ హిట్ అయింది.
ఆ తర్వాత కూడా ఎన్నో తెలుగు సినిమాలు రీమేక్ చేసి హిట్స్ అందుకున్నారు పునీత్. రీసెంట్ గా యువరత్న సినిమాతో తెలుగు లో కూడా కాస్త చోటు సంపాదించుకోవాలని చూశారు గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు.
ఒక సూపర్ స్టార్ కొడుకు సూపర్ స్టార్ అవ్వడం చూస్తుంటాం. కృష్ణ గారి అబ్బాయి మహేష్ బాబు లాగా కానీ ఒక సూపర్ స్టార్ ఇద్దరి కొడుకులు సూపర్ స్టార్స్ అవ్వడం అరుదుగా చూస్తుంటాం. అలాంటి రికార్డు సాధించారు రాజ్ కుమార్ గారి పుత్రులు శివరాజ్ కుమార్ మరియు పునీత్ రాజ్ కుమార్. రాజ్ కుమార్ గారి రెండవ కొడుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ కెరీర్ లో 'నంజుండి కళ్యాణ' లాంటి రెండు మూడు బంపర్ హిట్స్ ఉన్నా పెద్దగా నిలదొక్కుకోలేక పోయారు. (ఇదే 'నంజుండి కళ్యాణ' సినిమాని తెలుగులో రాజేంద్ర ప్రసాద్, నిరోషా జంటగా 'మహాజనానికి మరదలు పిల్ల' అని రీమేక్ చేశారు గానీ ప్లాప్ అయింది. కన్నడ నుంచి రీమేక్ చేసిన 90% సినిమాలు తెలుగులో ప్లాప్ అయ్యాయి నా అంచనా ప్రకారం).
శోభన్ బాబు గారు ఆరోగ్యం బాలేక కాదు ఆయుష్షు లేక మరణించారు అంటుంటారు అలా పునీత్ గారిని కూడా ఆయుష్షు లేక మరణించారనే అనుకోవాలి. ఎందుకంటే నిత్యం వ్యాయామం చేస్తూ ఆహారం కూడా మితంగానే తీసుకుంటారని అతని సన్నిహితులు చెప్తూ ఉండేవారు.
ఫ్రీ స్కూల్స్, వృద్దాశ్రమాలు, అనాధాశ్రమాలు, గోశాలలు లాంటివి నిర్మించి తన సేవా గుణాన్ని కూడా చాటుకున్నారు. బాల నటుడిగా కెరీర్ మొదలెట్టి నటుడిగా కెరీర్ లో ఇంకా ముందుకు దూసుకు పోతాడు అనుకున్న అభిమానులను శోకం లో ముంచి వెళ్లిపోయిన పునీత్ రాజ్ కుమార్ గారికి ఆత్మ శాంతించాలని కోరుకుంటున్నాను.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి