బిగ్ బాస్ దెబ్బకు పెదరాయుడు చిత్తై పోతాడనుకుంటే పెదరాయుడు దెబ్బకు బిగ్ బాస్ మట్టి కరిచాడు. ఇది నిన్నో మొన్నో జరిగిన మా ఎన్నికల గురించి అని అనుకునేరు? కాదు కాదు పాతికేళ్ళ క్రితం జరిగిన విషయం చెప్తున్నా.
ఘరానా మొగుడు సినిమాతో 10 కోట్ల కలెక్షన్స్ సాధించి శిఖరం అంచుకు ఎక్కేసిన చిరంజీవి, ముగ్గురు మొనగాళ్లు, మెకానిక్ అల్లుడు, SP పరశురామ్ అంటూ దిగడం మొదలు పెట్టాడు, ఎంతగా అంటే హిట్టొస్తే చాలురా ఈవీవీ సత్యనారాయనా అని అల్లుడా మజాకా సినిమాలో నటించి మరింత కిందికి దిగజారి పోయాడు. ఆ రోజుల్లో మహిళలతో ఛీకొట్టించుకుని సభ్య సమాజం తలదించుకునేలా పేరు తెచ్చుకున్న ఆ బూతు సినిమా ఎలాగోలా హిట్టనిపించుకుంది గానీ చిరంజీవి రేంజ్ కి నికార్సయిన హిట్ సినిమా కాదది.
అల్లుడా మజాకా తర్వాత విడుదల అవుతున్న బిగ్ బాస్ సినిమాతో మళ్ళీ శిఖరం పైకి ఎక్కుతాడని అప్పట్లో నేనెంతో ఆశపడ్డాను పైగా గ్యాంగ్ లీడర్ లాంటి బంపర్ హిట్ తీసిన విజయ బాపినీడే ఈ బిగ్ బాస్ కు దర్శకుడు అవడం నా ఆశలకు మరింత ఊతమిచ్చింది.
అదే రోజు రిలీజ్ అవుతున్న పెదరాయుడు మీద వేరే ఎవరికైనా నమ్మకాలు ఉన్నాయేమో గానీ మెగా స్టార్ మేనియా లో ఉన్న నా కళ్ళకు ఆ సినిమా అనలేదు. పైగా ఆ సినిమాలో రజని కాంత్ ఉన్నాడు, నాలుగైదు నెలల క్రితం రిలీజ్ అయిన బాషా రికార్డ్స్ ఇంకా కళ్ల ముందు కదలాడుతూనే ఉన్నాయి అయినా సరే బిగ్ బాస్ ఇక్కడ అని ధైర్యం చెప్పుకున్నా.
అప్పట్లో రిలీజ్ కి ముందు రోజు రాత్రే ఫాన్స్ షో వేసే వారు, దానికి టికెట్స్ తీసుకురావడానికి ఎప్పటిలాగానే మా కరడు గట్టిన చిరంజీవి అభిమాని ఉండనే ఉన్నాడుగా కాబట్టి టికెట్స్ గురించి భయం లేదు. ఉన్న దిగులంతా నాన్న ను ఒప్పించడమే, మరీ కష్టం కాదు కానీ ఆ రోజుకు ఒక రెండు గంటలు ఎక్కువ చదివేస్తే ఒప్పుకుంటారు సినిమాకి వెళ్ళడానికి.
రాత్రి 10 గంటల టైం లో షో మొదలైంది. గంట లోపే అర్థం అయిపోయింది సినిమా లో అస్సలు విషయం లేదని. ఫాన్స్ అయిన మాకే నచ్చలేదంటే ఇక మామూలు ప్రేక్షకులకు అస్సలు ఎక్కదు అని సినిమా చూసొచ్చాక అర్థమైంది. ఇంటికొచ్చేదాకా మేమెవ్వరం నోరు విప్పలేదు సినిమా ఇంట చెత్తగా ఉందే అని.
భాషా లాంటి సినిమా తీయాలని అనుకున్నారని, లేదు.... లేదు భాషా సినిమా లాంటి కథనే తీయబోయి భాషా రిలీజ్ అయిందని స్టోరీ మార్చేసి కలగా పులగం చేశారు అని ఎవరికి నచ్చినట్లు వారు విశ్లేషించారు సినిమా సర్కిల్స్ లో.
ఏది ఏమయితేనేం రెండ్రోజులకే పూర్తిగా బిగ్ బాస్ థియేటర్స్ ఖాళీ ఇక్కడ, అక్కడేమో పెదరాయుడు ఆడే థియేటర్స్ లో జాతర మొదలైంది. అగ్నికి వాయువు తోడయినట్లు మోహన్ బాబు నటనకు, రజనీ కాంత్ స్టైల్ తోడై బిగ్ బాస్ ను పూర్తిగా బూడిద చేసేసింది పైగా 10 కోట్లు అని గొప్పగా చెప్పుకునే ఘరానా మొగుడు కలెక్షన్స్ ని 2 కోట్ల మార్జిన్ తో దాటేసింది.
అదీ, పెదరాయుడు దెబ్బకు చిత్తై పోయిన బిగ్ బాస్ విషయం. మొన్న జరిగిన 'మా' ఎన్నికలకు దీనికి ఎటువంటి సంబంధం లేదని మనవి.
చిరంజీవి సినిమాలతో పాటు దాదాపు ఒకే టైం లో రిలీజ్ అయి అంచనాలు తారుమారుచేసిన సినిమాలు మచ్చుకు కొన్ని గుర్తున్నాయి.
రిక్షావోడు - ఒరేయ్ రిక్షా (దాసరి, ఆర్ నారాయణ్ మూర్తి కాంబినేషన్)
స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ - స్టువర్ట్ పురం దొంగలు (భానుచందర్ హీరో)
మృగరాజు - నరసింహనాయుడు (హీరో ఎవరో చెప్పాల్సిన పని లేదు)
కొదమ సింహం - ఇంద్రజిత్
ఈ చివరి రెంటిదీ డిఫరెంట్ స్టోరీ. రెండూ హిట్ కాలేదు కానీ, కొదమ సింహం వల్ల తన కొడుకు బోసుబాబు(అతనికి మొదటి/చివరి సినిమా ఇదే అనుకుంటాను) ని హీరో గా పెట్టి తను డైరెక్ట్ చేసిన సినిమా 'ఇంద్రజిత్' కి నష్టం జరిగింది అని గిరిబాబు చాలా సార్లు తన గోడు వెళ్లబోసుకున్నారు.
// “ అల్లుడా మజాకా సినిమాలో నటించి మరింత కిందికి దిగజారి పోయాడు. ఆ రోజుల్లో మహిళలతో ఛీకొట్టించుకుని సభ్య సమాజం తలదించుకునేలా పేరు తెచ్చుకున్న ఆ బూతు సినిమా ఎలాగోలా హిట్టనిపించుకుంది” //
రిప్లయితొలగించండిఅర్థమయిందిగా మెగా లయినా, సూపర్ లయినా మరొకరయినా తమకు డౌన్ గా సాగుతున్నప్రుడు తిరిగి హిట్ అవడానికి ఎటువంటి కథ అయినా కూడా రెడీ అయిపోతారని. వాళ్ళ పట్ల అంత అభిమానం పెంచుకోవడం అనవసరం.
// “ రిలీజ్ కి ముందు రోజు రాత్రే ఫాన్స్ షో వేసే వారు” //
ఓరి నాయనో, అటువంటి సౌలభ్యాలు కూడా ఉండేవా బాబూ? ఫాన్ అని థియేటర్ వాళ్ళు ఎలా గుర్తు పట్టేవారు? ఫాన్ లకు గుర్తింపు కార్డులేమయినా ఉండేవా?
(jk) 🙂
అభిమాన సంఘాల వారికి ఇస్తారు రావు గారు. అదో బిజినెస్.
తొలగించండిధన్యవాదాలు, కొండలరావు గారు.
తొలగించండిఅంతే లెండి, అభిమాన సంఘాల వారిని ప్రసన్నం చేసుకోకపోతే థియేటర్ మీద రాళ్ళతో దాడి చేస్తారేమోననే భయం ఉండచ్చు.
అవును మేష్టారు, డబ్బు, క్రేజ్ కోసం ఎలాంటి వేషాలైనా వేస్తారు వారికి విలువల గురించి పెద్దగా పట్టింపు ఉండదు.
తొలగించండిపాసుల విషయంలో కొండలరావు గారు చెప్పింది నిజం.
సందర్బోచితంగా సత్యం చెప్పారు. సినిమా అయినా ఓటింగ్ లో అయినా ప్రజల అభిమానం పొందాలంటే మెగా ఓవర్ యాక్షన్ సరి(పో)కాదు. నాగబాబు వెకిలి డైలాగులు కూడా ప్రకాష్ రాజ్ కొంప ముంచడానికి బాగా పనికివచ్చాయి.
రిప్లయితొలగించండివీళ్ళకు ముందుండి ధైర్యంగా నడిపించే నాయకత్వ లక్షణాలు లేవు కొండలరావు గారు.
తొలగించండిYCP, TRS, BJP ల పరోక్ష మద్దతు తోనే విష్ణు గెలిచాడు, అంతకంటే ఏమీ లేదు.
రిప్లయితొలగించండిజనసేన, తేదేపా మద్దతిచ్చిన ప్రకాష్ రాజ్ ఓడిపొయ్యారన్నమాట!
తొలగించండికర్ణుడి చావుకి వంద కారణాలు అన్నట్లు ప్రకాష్ రాజ్ ఓడిపోవడానికి బొచ్చెడు కారణాలు.
తొలగించండిఎప్పుడైతే ప్రకాష్రాజ్ తరుపున బుస్సుబాబు ఏలుపెట్టాడో, అప్పుడే ఖతమైపొయ్యాడు. ఐనా ఈ పిచ్చభిమానులు.. రాల్లెయ్యడానికేగానీ.. ఓట్లెయ్యడానికి ముందుకురారెందుకో?
తొలగించండిMoney matters Chiru gaaru.
తొలగించండికమ్మీ కాంగీ ఖతం
రిప్లయితొలగించండికాంగీ అంటే కాంగ్రేస్ అనా, మరి ఈ కమ్మీ ఏమిటి అజ్ఞాత గారు?
తొలగించండిఇంకెవరు. కంప్యూనిష్టులు.
తొలగించండిథాంక్స్ చిరు గారు, పాలిటిక్స్ నాలెజ్డ్ నిల్ ఇక్కడ అందుకే అడిగా
తొలగించండిమీ టైటిల్ ని గ్రేట్ ఆంధ్రా వాళ్ళు కాపీ కొట్టారు.
రిప్లయితొలగించండిhttps://www.youtube.com/watch?v=nXX5Db14BpE
అవును కాస్త టైటిల్ మ్యాచ్ అవుతోంది. పైగా నా పోస్ట్ వచ్చిన రెండు రోజులకి పెట్టినట్లు ఉన్నారు వీడియో.
తొలగించండిఅయినా మీ అభిమానం కానీ, నా పోస్ట్ కొచ్చిందే 400 వ్యూస్, అందులో ఎవరు కాపీ కొడతారు బోనగిరి గారూ, ఏదో కోఇన్సిడెన్స్ అయి ఉండచ్చు. Thanks for sharing the video link.
ఈ రోజుల్లో 400 అంటే చాలా ఎక్కువ. నాకు అయిదారేళ్ళ కిందట వచ్చేవి. ఇప్పుడు వంద మంది చూస్తే (చదివితే ?) గొప్ప.
తొలగించండిమీడియా వాళ్ళకి కాపీ కొట్టడం మామూలే. "తెరల ప్రపంచం" అన్న నా పోస్ట్ కాన్సెప్ట్ ని సాక్షాత్తు ఈనాడు వాళ్ళే కాపీ కొట్టి, ఫ్రంట్ పేజీలో వేసారు. కొన్ని వాక్యాలు యధాతధంగా వాడుకున్నారు.
నాకు సినిమా నాలెడ్జి తప్ప మిగతా జ్ఞానం నిల్ కాబట్టి ఎక్కువగా సినిమా కబుర్లే రాస్తుంటాను. మన తెలుగు వారికి, సినిమా కబుర్లు అంటే ఇష్టం కాబట్టి ఈ మాత్రం వ్యూస్ వస్తున్నాయి బోనగిరి గారు లేదంటే రోజూ పేపర్ లో వచ్చే వార్తల లాంటివి అయితే ఎవ్వరూ చదవరు.
తొలగించండిమీరూ ఒక బ్లాగ్ ఓనర్ అనే విషయం ఇప్పుడు మీరు చెబితేనే తెలుస్తోంది, నా కంటే బాగా సీనియర్ అని తెలుస్తోంది మీ బ్లాగ్ చూస్తే. అప్పుడప్పుడూ రాస్తూ ఉండండి, సినిమా విశేషాలు అంటే ముందుగా నేనే చదువుతాను.
మన తెలుగు సినిమా డైరెక్టర్స్ మాత్రమే కాపీ కొడుతున్నారు అనుకున్నా ఇంతవరకు, ఈ పేపర్ వాళ్ళదీ అదే దారి అన్నమాట.