సాధారణంగా నేను హిందీ సినిమాలు ఇష్టపడను. ఒక ఇరవైయ్య్యేళ్ళ క్రితం కాస్తో కూస్తో చూడాలని అనిపించేవి. తర్వాత అవీ చూడబుద్ధి కాలేదు. అప్పుడప్పుడూ మరీ బాగున్నాయి అన్న సినిమాలు తప్పితే హిందీ సినిమాలు చూడటం దాదాపు మానేశాను.
మొన్న ఆదివారం రోజు, నాకు ఈ పంచాంగాలు, జాతకాలు తెలీదు కాబట్టి ఏ శుక్రుడో నన్ను వక్ర దృష్టితో చూస్తుండబట్టో లేక ఆ దిక్కుమాలిన ఆదివారం అమావాస్య రోజో ఏమో తెలీదు కానీ ఒక హిందీ సినిమా అదీ హారర్ చూద్దామని అనుకుంటే ఆ netflix భాండాగారంలో ఓ సినిమా కనపడింది. రేటింగ్స్ లాంటివి చూడకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏ సినిమా దొరికితే అది చూసే నేను ఆ సినిమా చూడటం మొదలు పెట్టాను.
కాసేపటికే ఆ సినిమా హారర్ కాదు జుగుప్సకి పరాకాష్ట అనిపించింది, నా లైఫ్ లో ఒక్క సినిమా కూడా పూర్తిగా చూడకుండా మధ్యలో మధ్యలో వదిలేసింది లేదు అలాంటిది పాతిక భాగం కూడా చూళ్ళేకపోతున్నానే అని 1.5 స్పీడ్ లో పెట్టి ముగిద్దాం అని అనుకున్నా కానీ అర్ధ భాగం చూసేప్పటికీ ఆ జుగుప్స ని తట్టుకోలేక ఆపేశాను. ఆ సినిమా పేరు "ఘోస్ట్ స్టోరీస్" , కరణ్ జోహార్, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, దిబాకర్ బెనర్జీ అనబడే నలుగురు ఉద్దండుల చేత తీయబడిన నాలుగు స్టోరీల సమాహారమే ఆ సినిమా. రెండు స్టోరీస్ చూసేప్పటికే నాకు కంపరం పుట్టుకొచ్చి ఆపేశాను, ఇక ఆ నాలుగు స్టోరీస్ చూసిన వారెవరో గానీ వారికి గొప్ప గొప్ప అవార్డ్స్ ఇవ్వచ్చు.
పోయిన ఏడాది వరకు ఈ హిందీ సినిమాలు నాకు నచ్చడం లేదంటే నేను outdated అయ్యానేమో అని అనిపించింది కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమా, బాలీవుడ్ ప్రేక్షకులకే ఎక్కడం లేదంటే హమ్మయ్య! కాస్తో కూస్తో ఇంకా నేను outdated కాలేదేమో సినిమాలని ఆస్వాదించగలిగే టేస్ట్ మన దగ్గర మిగిలే ఉంది అనుకున్నా (మన అంటే నేనే, మా ఎన్టీవోడి పద ప్రయోగం అంతే, నన్ను నేనే గౌరవంగా పిలుచుకొని, గర్వంతో భుజం తట్టుకొని అభినందించుకుంటున్నాను)
పదేళ్ళ క్రితం బాలీవుడ్ సినిమా హిట్టవ్వాలంటే షారుఖ్ అయినా ఉండాలి లేదా సెక్స్ అయినా ఉండాలి అనేవారు, తర్వాత షారుఖ్ కూడా ఆ లిస్ట్ లోంచి వెళ్ళిపోయి సెక్స్ ఒక్కటే మిగిలింది. యాభై శాతం పైన సినిమాల్లో కథలు అక్రమ సంబంధాల చుట్టూ లేదంటే సహ జీవనం అనబడే విచ్చలవిడి జీవితాల చుట్టే తిరుగుతుంటాయి. మా తెలుగు సినిమాలే మేలబ్బా, ఇంకా అంత ఎత్తుకు ఎదగనందుకు. ఇంకా అవే రొటీన్ సినిమాలైనా ఏ చెట్టు లేని చోట ఆముదము చెట్టు లాగా వెలిగిపోతున్నాయి.
చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ కాస్త డిమాండ్ లో ఉన్నప్పుడు "ఆ టాలీవుడ్ లో కథంతా హీరో చుట్టే తిరుగుతుంది, అందుకే మేము తెలుగు సినిమాల్లో నటించం" అని పెద్ద స్టేట్మెంట్స్ పడేస్తుంటారు అక్కడికి వారేదో అక్కడ గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేస్తున్నట్లు.
"దేశంలో ఉండే ఎన్నో సమస్యలతో పాటు ఈ హిందీ సినిమా ఇండస్ట్రీ ఇలా దరిద్రంగా తయారవ్వడానికి కారణం ఆ గాంధీ గారు కదూ, నెహ్రూ గారిని కాకుండా పటేల్ గారిని ప్రధానిని చేసి ఉంటే అసలు ఇలా జరిగేదా" అని సభాముఖంగా ప్రశ్నిస్తూ సెలవు తీసుకుంటున్నాను.
హిందీ లో కూడా మంచి సినిమాలు ఉన్నాయండి.
రిప్లయితొలగించండిఈ మధ్య వచ్చిన రిషీకపూర్ ఆఖరి సినిమా "శర్మాజి నంకీన్ చూడండి, బాగుంటుంది.
ఆయన మరణించాక పరేష్ రావెల్ గారితో ఆ పాత్రలో నటింపచేసి ఆ సినిమా పూర్తి చేశారని విన్నాను కానీ సినిమా ఇంకా చూడలేదు బోనగిరి గారు, సజెస్ట్ చేసినందుకు ధన్యవాదాలు, చూస్తాను.
తొలగించండి