25, ఆగస్టు 2022, గురువారం

సినిమాలో కథ ఎవడికి కావాలి?

మన సినిమాలో హీరో కి సొట్ట కాలు, పేరు "బండోడు". 

టైటిల్ అదే పెడదామా? బాగా మాసీ గా ఉంది. 

ఆగండి సర్, నేను టైటిల్ ఫిక్స్ చేసుకున్నా ఆల్రెడీ. 

వెరీ గుడ్, కంటిన్యూ. 

ఒక గుడి దగ్గర చెప్పులు పెట్టుకునే స్టాల్లో పని చేస్తుంటాడు.  హీరోయిన్ కి గుడ్డి, అదే గుడి దగ్గర పూల వ్యాపారం చేస్తుంటుంది. 

ఏంటీ, తమిళ్ సినిమా తీస్తున్నామా?

కాదు తెలుగే, కాస్త మాస్ కారక్టరైజెషన్. 

ఇలా సినిమా తీస్తే తర్వాత అదే గుడి దగ్గర నేను అడుక్కుతినాలి. అయినా కుంటి, గుడ్డి ఇవన్నీ అవసరమా. 

అదే ట్రెండ్ సర్, ఏదో ఒక లోపం పెడితే ఆడియన్స్ కి కిక్కివ్వచ్చు. ఈ మధ్య కొన్ని సినిమాలు చూశాం కదా. 

సరే మిగతా కథ చెప్పు 

అవును సర్,  'చెప్పే' మన కథా వస్తువు. 

అర్థం కాలేదు. 

చెప్తాను వినండి. ఒక పెద్ద లీడర్ అయిన "అమిత్ నరేంద్ర జోడి" ఢిల్లీ నుంచి  ఏదో ఒక పని మీద  హైదరాబాద్ వచ్చి ఈ గుడికి దర్శనానికి వస్తాడు. 

అతను గుడి నుండి బయటకి రాగానే  మన బండోడు వెళ్ళి తన చేతులతోనే చెప్పులు తొడుగుతాడు. దాంతో అతను ఇంప్రెస్ అవుతాడు. 

బాగుంది, తర్వాత.. 

మన "జోడి" కార్ ఎక్కేప్పుడు ఆ కార్ లోపల నుంచి మెరుపులా ఒకడు దూకి కోడి కత్తితో పొడవబోతుంటే మన బండోడు ఉరుములా వచ్చి "జోడి" ని కాపాడతాడు. దాంతో ఆ "జోడి" మన బండోడ్ని మెచ్చి తనతో పాటే ఢిల్లీ  తీసుకుపోతాడు. 

ఇంటరెస్టింగ్ 

ఇక అక్కడి నుంచి మన హీరో ఎలా ఎదుగుతాడు అనేది మనకిష్టం వచ్చినట్లు ఏ రోజు ఎలా తడితే అలా తీసుకోవచ్చు. 

మరి గుడి దగ్గరి హీరోయిన్ 

అక్కడితో ఆ హీరోయిన్ ని వదిలేద్దాం సర్, ఢిల్లీ లో క్లబ్ లో డాన్స్ చేస్తూ మరో హీరోయిన్ ని దింపుదాం. హీరోయిన్స్ మన ఇష్టం సర్, ముగ్గురు నలుగురు హీరోయిన్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ హీరో ఒక్కడే ఉండాలి. 

అంతేనంటావా? 

కావాలంటే ఆ హీరోయిన్ ని కూడా ఢిల్లీ రప్పించి ఇద్దరు హీరోయిన్ లని పెట్టి ఫారిన్ లో 

"అటు మాస్, ఇటు క్లాస్ .. మధ్యలో నేను ఊర మాస్

ఇటు పచ్చడి అటు పిజ్జా .. నంజుకోరా తనివి తీరా

ఇటు ఐస్క్రీమ్ అటు పుల్లైసు .. చప్పరించేయ్ చెలికాడా

అటు స్లమ్ము ఇటు స్లిమ్ము ఇక చూపిస్తా నా దమ్ము"

అని ఒక మంచి ఊపున్న సాంగ్ క్లైమాక్స్ ముందు ప్లేస్ చేద్దాం.  

ఇప్పుడు డబల్ ఓకే. ఇంకా కావాలంటే ఆ "జోడి" ఒకప్పుడు అదే గుడి దగ్గర టెంకాయలు అమ్మేవాడని అక్కడే హీరో తల్లిని తండ్రిని చంపి వాళ్ళ "టెంకాయల" కొట్టును కొట్టేశాడని ఒక రివెంజ్ కథ కూడా అల్లుకోవచ్చు. 

గ్రేట్ సర్. టైటిల్ 'చప్పల్' అని పెడదాం. 

హిందీ పేరులా ఉంది??

అవును సర్. దేశమంతా అదే టైటిల్ తో ప్రచారం చేసుకొని పాన్ ఇండియా మూవీ అందాం.  ఒక నార్త్ ఇండియన్ పిల్లని హీరోయిన్ గా పెడదాం ఎలాగూ. ఆ లీడర్ క్యారక్టర్ ని ఒక నార్త్ ఇండియన్ ఆర్టిస్ట్ తో చేయించి, అతని పక్క ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులని కన్నడ, తమిళ్, మలయాళం నుంచి తీసుకొచ్చి అవసరం ఉన్నా లేకున్నాఇరికిద్దాం పాన్ ఇండియా మూవీ అయిపోతుంది. 

ఇంప్రెస్డ్.  రేపే ప్రెస్ మీట్ పెట్టి మన సినిమా 'చప్పల్' అనౌన్స్ చేద్దాం. 

తోక ముక్క: ఈ విధంగా డబ్బు మూటల్తో వచ్చిన నిర్మాతకి ఏదో ఒక కథ చెప్పేసి కొద్ది మంది దర్శకులు కథ లేకుండా కాకరకాయ మాత్రమే పెట్టి సినిమా తీస్తున్నట్లు ఉన్నారు. నాకూ అలాంటి నిర్మాత దొరికితే బాగుండు, బోలెడు కథలు రాయగలను నేను కూడా డబ్బులిస్తే మరింత శ్రద్ధగా.                                         


6 కామెంట్‌లు:

  1. “Pan India” సినిమాల గురించి మీ కాన్సెప్ట్ అదిరిపోయింది 👌.
    అసలు మన తెలుగు సినిమా రంగం ఏనాడో “కిళ్ళీ” ఇండియా లెవెల్ కు మన సినిమాలను తీసుకెళ్ళిపోయింది. ఎప్పుడైతే బోంబే భామల్ని / తెలుగేతర దక్షిణాది సుందరీలను హీరేయిన్ గాను, బీహారీ / ఇతర హిందీలను విలన్ల గాను పెట్టడం మొదలెట్టారో (నటుడు కోట శ్రీనివాసరావు గారి విమర్శ ఇదే కదా and rightly so) ఆనాడే తెలుగు సినిమాలు “కిళ్ళీ” సినిమాలయి పోయాయి అనచ్చు. అప్పుడే డబ్బింగ్ చేసి హిందీవాళ్ళ మీదకి వదిలితే ఉర్రూతలూగించి ఉండేవి. ఇప్పుడొస్తున్న పిల్లకాకులు ఏవో గొప్పలు చెప్పుకుంటున్నారు అంతే, పబ్లిసిటీ సాధనాలు ఎక్కువయ్యాయి గదా.

    మీరు చెప్పిన సినిమా కథ, టైటిల్ కూడా అదిరింది. సినిమాగా తీస్తే బాగా “పండుతుంది”. ఇప్పుడొస్తున్మ వాటికేమీ తీసిపోదు.

    // “ఏంటీ, తమిళ్ సినిమా తీస్తున్నామా?” // …. హ్హ హ్హ హ్హ 😁.

    అసలు నేను గతంలో కూడాచెప్పినట్లు …. మిమ్మల్ని సినిమారంగం పిలుస్తోంది, రండి కదలి రండి 👍🙂. మీదే ఆలస్యం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ధన్యవాదాలు మేష్టారు.

      నిజం చెప్పొద్దూ, నిన్నొక సినిమా చూశాక ఇలాంటివైతే బొచ్చెడు సినిమాలు తీయలేమా అనిపించింది మేష్టారు. హీరోలు, దర్శకులు 'taken for granted' మెంటాలిటీ నుంచి బయట పడేదాకా మంచి సినిమాలు రావేమో అనిపిస్తుంది.

      మీరన్నట్లు ఇవాళో నిన్నో ఒక కిళ్లీ ఇండియా లెవెల్ సినిమా (బాగుంది పదప్రయోగం) రిలీజ్ అయి జనాలని థియేటర్ బయటకి పరుగులు పెట్టిస్తున్నట్లు ఉంది.

      తొలగించండి
    2. కోటగారే కాకుండా, బాలు గారు కూడా వాపోయారు (తెలుగేతర గాయకులు తెలుగులో పాడుతున్నారని). కాని వారి వాదన ఎంతమాత్రం సమంజసం కాదంటాను. (ఉదాహరణకి) మనం ఒక తెలుగువాడు మైక్రోసాఫ్ట్‌ని ఏలుతున్నాడని గర్వంగా చెప్పుకుంటాం, కాని ఒక తెలుగేతర భారతీయుడు మన గడ్డ మీద జెండా పాతితే మన కళాకారులకి అన్యాయం జరిగిపోతోందని గోల చేస్తాం. ఇదెక్కడి న్యామం? తెలుగేతర నటులు/గాయకులలో కోట/బాలుగార్ల కంటే గొప్పవారులేరా?

      తొలగించండి
    3. మీరన్న దాంట్లో నిజం ఉంది కాంత్ గారు. కాకపోతే ఉచ్ఛారణా దోషాలు ఉండటం, ముఖం మీద ఎటువంటి ఎక్స్ప్రెషన్స్ చూపలేని పర భాషా నటులతోనే ఇబ్బంది.

      కోటగారి నటనకి (బాలు గారి పాటకు కూడా )నేను గొప్ప అభిమానిని కానీ ఆయన షాయాజీ షిండే లాంటి నటులు మాట్లాడే తెలుగు మీద విమర్శలు చేశారు కోట గారు . కాకపొతే కోట గారు పర భాషా సినిమాల్లో నటించకుండా ఉండి ఆ విమర్శలు చేసి ఉంటే పర్లేదు, కానీ కోట గారు హిందీ, తమిళ్ సినిమాల్లో నటించినప్పుడు అక్కడి సగటు అభిమాని ఎప్పుడో ఒకసారి మనలా అనుకోని ఉండచ్చు.

      తొలగించండి
  2. ఇప్పుడు ప్రేక్షకులకి కూడ కథ అక్కర్లేదు. డజను కామెడీ సీన్స్, అర డజను పాటలు, ఫైట్స్ ఉంటే చాలు. అవి కూడా సరిగ్గా తీయలేకపోతున్నారు.

    రిప్లయితొలగించండి