22, ఆగస్టు 2022, సోమవారం

చిరంజీవన్నయ్య

వెండి తెరపై నటుడిగా నా కంటే ముందు పుట్టడం వల్ల అన్నయ్య అయ్యాడు. నా వయసు పెరుగుతున్నట్లే అన్నయ్య ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. నా ఆటల్లో పాటల్లో అన్నయ్య ఒక భాగం అయిపోయాడు, అందుకేనేమో ఆ బాండింగ్ ఇప్పటికీ ఇలా నిలిచిపోయింది. 

ఒకపక్క ఎన్టీఆర్-ఏయన్నార్ లాంటి మహామహులు, మరో పక్క కృష్ణ -శోభన్-కృష్ణంరాజు లాంటి సీనియర్లు , తన తర్వాత వచ్చిన బాలకృష్ణ-నాగార్జున-వెంకటేష్ లాంటి జూనియర్స్ తో పోటీ పడి వారందరి జనరేషన్ మధ్య ఒక వారధిగా ఉండగలిగారంటే యెంత కష్టపడి ఉంటారు. ఇక పడిన కష్టం చాలనుకున్నారో ఏమో ఆ కష్టపడేతత్వాన్ని రాజకీయాల్లో కంటిన్యూ చేయలేక మొదట్లోనే కాడి వదిలేసి వెళ్ళడం మాత్రం ఒక మాయని మచ్చ. 

ఒక చిరంజీవి అభిమాని గా నేను చాలా ఎక్కువ ఆశిస్తాను, అదే నాకు వచ్చిన ప్రాబ్లెమ్. నా వరకైతే టాలెంట్ విషయం లో "కమల్ హాసన్ + రజని కాంత్ = చిరంజీవి" . అబ్బ ఛా! వీడు మరీ ఎక్కువ  అతి చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు గానీ, నటన పరంగా కమల్ కు, స్టైల్స్ విషయం లో రజనీ కి చిరంజీవి సరితూగగలడు అని నా గట్టి నమ్మకం. 

అప్పట్లో మణిరత్నం, శంకర్ లాంటి డైరెక్టర్స్, వాళ్ళకు తోడు రెహమాన్ లాంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మన తెలుగులో తగలక కాస్త రేసులో వెనుకబడ్డాడు. పైగా మన తెలుగు వాళ్ళు తమిళ్ సినిమా వాళ్ళని ఆదరించినంతగా అక్కడివారు మన వాళ్ళని ఆదరించరు అని నా అభిప్రాయం. 

కమల్ హాసన్ కి ఉన్న నేషనల్ వైడ్ క్రేజ్ ని మణిరత్నం నాయకుడు, శంకర్ భారతీయుడు మరింత పెంచాయి. అలాగే రజనీ క్రేజ్ ని మణిరత్నం 'దళపతి', శంకర్ 'శివాజీ', 'రోబో సీరీస్' సినిమాలు పెంచాయి. 'Bigger Than Bachhan' అనే క్రేజ్ ఉన్న రోజుల్లోనే చిరంజీవికి  ఇప్పటి రాజమౌళి లాంటి వాడు దొరికిఉంటే ఆ క్రేజ్ రెట్టింపు అయ్యేది. 

కథల ఎంపికలో, తనకు తగిన సినిమాలు చేయడంలో చిరంజీవి పొరపాట్లు కూడా ఉండి ఉండచ్చు.  దానికి తోడు కాస్త ధైర్యం చేసి ముందడుగు వేసినప్పుడల్లా 'రుద్రవీణ', 'స్వయం కృషి', 'ఆపద్బాంధవుడు' , 'డాడీ' లాంటి సినిమాలు దెబ్బతిన్నాయి. 'డాడీ' సినిమాలో కూతురిని కాపాడుకోలేక జైలులో నిస్సహాయుడుగా కూర్చోవడం నచ్చక కడప లో ఒక థియేటర్ లో ఫాన్స్ ఆ థియేటర్ ని పీకి పందిరి వేశారు. అప్పుడెప్పుడో ఖైదీ లోనే పోలీసులని ఉతికి ఆరేసిన మా హీరో ఇప్పుడు లాకప్ లో ఏడవడం ఏమిటి అని. సరే అదంతా ఆయన స్వయంకృతాపరాధమే. 'రోగి పాలు కావాలన్నాడు, డాక్టర్ అవే తాగు బాబూ' అన్నాడు అన్నట్లు కెరీర్ మొత్తం లో అన్నీ అలాంటి సినిమాలే చేసాడు ఫ్యాన్స్ కోసం అంటూ.  

కమల్ హాసన్ పాత సినిమాలు ఇప్పటికీ ఎవరు గ్రీన్ అనిపిస్తాయి. అడ్డంగా ఇరవై ముప్పై మందిని చితక్కొట్టే మాస్ సన్నివేశాలు ఆయన సినిమాలో అరుదు. మొదట్లో ఉట్టి మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు చేసిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కెరీర్ దెబ్బతింది. కానీ మొదట్లో కుదురుకోవడానికి కాస్త టైం పట్టినా రొడ్డకొట్టుడు సినిమాలు చేయని అమీర్ ఖాన్ కెరీర్ మంచి బూమ్ లో ఉంది ఈ మధ్య వచ్చిన రెండు ప్లాప్స్ తప్ప. 

అన్నయ్య కెరీర్ వయసు కంటే తక్కువ వయసున్న నేను ఆయనకు చెప్పగలిగే స్థాయిలో  లేను కానీ ఒక అభిమానిగా 'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు' లాంటివి పక్కన బెట్టి తన వయసుకు తగ్గ సినిమాలు చేసి అలరిస్తారని కోరుకుంటున్నాను. 

Belated happy birthday wishes చిరంజీవి అన్నయ్య. 

చిన్న జ్ఞాపకం: ఖైదీ సినిమా మొదట వేరే హీరో చేయాల్సి ఉండేది అనే మాట నిజం. కానీ అది మా దగ్గరికి వచ్చేప్పటికి - "రగులుతోంది మొగలిపొద" పాటలో బెండు అప్పారావు (క్షమించాలి ఆయన ఫాన్స్ నన్ను. యెంత చిరంజీవి ఫ్యాన్ అయినా నాకెందుకో ఆయనంటే ఇప్పటికీ బాగా అభిమానం, అప్పట్లో ఆయనను కొందరు అలా యెగతాళి చేసేవారు కానీ ఇలాంటి సిల్లీ విషయాలను అస్సలు పట్టించుకోని సాహసి ఆయన) డాన్స్ అస్సలు చేయలేకపోయాడని అందుకే ఆయన్ని తీసేసి పల్లెటూరి రైతు పాత్రని స్టూడెంట్ పాత్రగా మార్చి చిరంజీవి ని పెట్టి తీశారనే విధంగా మారిపోయింది రాజు గారి నోట్లో తాటి చెట్టు  మొలిచిందట అనే సామెత లాగా.  

మీ సొట్ట కాళ్ళోడు యెంత గంతులేసినా మా హీరో లాగా డైలాగ్స్ చెప్పలేడు అనేవాళ్ళు అవతలి హీరో ఫాన్స్.  

అవన్నీ ఇప్పుడు తలచుకుంటే భలే నవ్వొస్తుంది. 

10 కామెంట్‌లు:

  1. చిరంజీవి పాలిటిక్సులోకి వెళ్ళి తిరిగొచ్చాక విజయ్ సినిమాని కాపీ కొట్టిన "ఖైదీ 786" తప్ప ఒక్కటి కూడా ఆడలేదు.

    అదరగొట్టేస్తానని ఆర్భాటపు డయలాగులు చెప్పి జండా పీకేసి వచ్చిన ఫెయిల్యూర్ అభిమానులే మర్చిపోలేకపోతున్నారు - పాలిటిక్సులోకి హీరోలా వెళ్ళి జీరోలా తిరిగొచ్చిన చిరుని తెరమీద హీరోలా చూడటం ఫ్యాన్సుకే ఇబ్బందిగా ఉన్నట్టుంది పాపం!

    ఆచార్యలోకి కొడుకుని తీసుకు రావడం తనమీద తనకే నమ్మకం లేని దుస్థితి అని చాలామంది గెస్ చేశారు.ముఖం కూడా ముదిరిపోయింది, అమితాబ్ వరవడిలో ముసలి వేషాలకి దిగితే ఎలా ఉంటుంది?

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మంచి కథను నమ్మి తీస్తే ఎవరి సపోర్ట్ పెద్దగా లేకుండానే వసూళ్ళ వర్షం కురిపించచ్చు అని కమల్ "విక్రమ్" సినిమాతో ప్రూవ్ చేశారు. డైరెక్టర్ టాలెంట్ మెండుగా ఉందనుకోండి.

      కాబట్టి మంచి కథ, డైరెక్షన్ కుదిరితే ఈ ఎక్స్ట్రా ప్యాడింగ్స్ అవసరమే లేదని నా అభిప్రాయం హరిబాబు గారు.

      తొలగించండి
  2. మీ బాసుడి పుట్టినరోజున (ఆగస్ట్ 22) తెలుగు బ్లాగుల్లో మీరే మొదటి పోస్ట్ వ్రాస్తారేమో అని అంచనా వేశాను. కానీ ఒక రోజు లేట్. అమెరికా నుంచి గిరిధర్ పొట్టేపాళెం గారు తన బ్లాగులో నిన్ననే “పునాదిరాళ్ళు” పోస్ట్ చేసేశారు

    https://soul-on-canvas.blogspot.com/2022/08/blog-post.html?m=1

    తెలుగు సినిమాలకు కొత్త ట్రెండ్ సృష్టించాడనీ, అప్పటి కొన్ని కంచుకోటల్ని బద్దలు కొట్టగలిగాడనీ నాకూ అభిమానమే (కానీ చొక్కాలు చింపుకునే అభిమానం ఏ నటుడి పట్లా నాకు లేదు 🙂). ఆ కాలానికి అదేమీ అంత తేలికైన పని కాదు. ఐనా కష్టపడి సాధించాడు. అందుకు హాట్సాఫ్.

    ఆ ట్రెండ్ తరవాతి కాలంలో ఇతర నటుల చేతుల్లో వెర్రితలలు వేసింది, వేస్తోంది, అది వేరే సంగతి (అది చిరంజీవి తప్పు కాదు లెండి).

    తరవాత తరవాత మరీ మాస్ మీదే దృష్టి పెట్టాడనిపిస్తుంది. “మాసే బాసూ, మనల్ని ఇవాళ ఈ లెవెల్లో నిలబెట్టింది”, నేను ఏ ఊరు వెళ్ళి ఏ ఇంటి తలుపు తడితే నాకు పట్టెడన్నం దొరకదు గనక … లాంటి మాస్ డైలాగులతో తన దారి మాస్ దారే అని భావించుకున్నట్లున్నాడు, ఆ మార్గాన్నే ప్రయాణించాడు, విజయాలందుకున్నాడు, సినిమా రంగాన్నే శాసించగల “లెవెల్” కు చేరుకున్నాడు. . అయినప్పటికీ మంచి నటనా ప్రతిభ, కృషి కలవాడు సందేహం లేదు, కానీ మీరన్నట్లు “అమ్మడూ లెటజ్ డూ కుమ్ముడూ” అనవలసిన అగత్యం లేదు అని నా అభిప్రాయం. ఇప్పటికీ “47 రోజులు”, “విజేత”, “ఆపద్బాంధవుడు”, “స్నేహం కోసం”, “మంజునాథ” చిరంజీవి నటించిన సినిమాల్లో అత్యుత్తమవైనవిగా నేను భావిస్తాను.

    నిలదొక్కుకోవడానికీ, తరువాత స్థానాన్ని పదిలపరుచుకోవడానికీ మాస్ ని నమ్ముకున్నాడేమో గానీ ఇక ఇప్పుడు వయసుకు తగ్గ పాత్రలు వెయ్యవయ్యా స్వామీ అంటే వాటిల్లో కూడా మాస్ ఎలిమెంట్స్ నింపుతుంటాడు. అఫ్-కోర్స్ ఏమైనప్పటికీ తెలుగు సినిమా గమనాన్ని ఒక మలుపు తిప్పిన ఘనుడు.

    అంతటి “ఘన” స్టార్ నూరు జన్మదినాలు జరుపుకోవాలని శుభాకాంక్షలు.

    బ్లడ్ బ్యాంక్ తో బాటు ఇతర సేవా కార్యక్రమాలు కూడా చేస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. శతకోటి ఫాన్స్ లో నేనొకడ్ని అంతే మేష్టారూ. మీరు చెబితే నమ్ముతారో లేదో కానీ స్కూల్ డేస్ లో కాలేజ్ డేస్ లో మా క్లాస్ లో 75% చిరంజీవి ఫాన్స్ ఉండేవారు. తక్కిన పాతిక శాతం షేర్ మిగతా హీరోలది. అలా ఉండేది ఆయన హవా.

      గిరిధర్ గారు పై 75% లోనే ఉన్నారని అనుకుంటున్నాను. ఆయన రాసింది అక్షరాలా నిజం. హీరో అంటే ఇలా కదా ఉండాలి అనే ట్రెండ్ తీసుకొచ్చింది ఆయనే మా జనరేషన్ లో.

      విజేత సినిమా ఇప్పటికీ నా ఫేవెరెట్. 35 ఏళ్ళు గడచినా ఇప్పటికీ ఆ సినిమా చూడాలని అనిపిస్తుంది. ఈ విషయంలో కమల్ గారు ముందు ఉంటారని నా అభిప్రాయం.ఆయన నటించిన చాలా సినిమాలు ఇంకో పదేళ్ళ తర్వాత కూడా చూడచ్చు.

      మునుపు పిల్లలను కరాటే, స్విమ్మింగ్ క్లాసెస్ కే తీసుకెళ్ళేవాడిని, ఈ మధ్య వారంలో రెండు రోజులు నేనే టెన్నిస్ నేర్పిస్తున్నాను, అప్పుడప్పుడూ బాస్కెట్ బాల్ ఆడించడానికి తీసుకెళ్తున్నాను కాబట్టి టైం చిక్కడం లేదు మేష్టారు రాయడానికి. అందుకే కాస్త ఆలశ్యం.

      తొలగించండి
  3. "కమల్ హాసన్ + రజిని కాంత్ : చిరంజీవి"
    అని డైరెక్టర్ బాలచందర్ గారు అన్నట్లుగా
    నాకు ఎక్కడో చదివిన గుర్తు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అయితే నా అభిప్రాయం తప్పు కాదని గట్టిగా నమ్మొచ్చు. థాంక్స్ అజ్ఞాత గారు.

      తొలగించండి
  4. ఆలస్యం అయితే మరేం ఫరవాలేదు. పిల్లల పనుల కన్నా బ్లాగ్ ముఖ్యం కాదు.
    అయితే మీకు టెన్నిస్ వచ్చన్నమాట. వెరీ గుడ్. తప్పక మీ పిల్లలకు నేర్పించండి. అసలు ఆస్ట్రేలియా వాళ్ళంటేనే టెన్నిస్, క్రికెట్. 👍🙂

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. jack of all trades but master of none అన్నట్లు అన్నీ వచ్చు కానీ మరీ గొప్పగా అయితే కాదు మేష్టారు.

      వీకెండ్ లో వీలయితే టేబుల్ టెన్నిస్, ఫుట్ బాల్, క్రికెట్ లాంటివి ఆడిస్తుంటాను. టీవీ లకి, టాబ్స్ కి అతుక్కుపోనీక వారిని కాస్త physical activities లో భాగం చెయ్యాలని నా ప్రయత్నం అంతేగానీ పోటీలు గట్రా లాంటి ఆశలు లేవు మేష్టారు.

      40+ లో ఉన్నాను కదా, కాస్త నా బాడీకి కూడా శారీరిక శ్రమ కల్గించడం కోసమే ఈ ప్రయత్నాలన్నీ.

      తొలగించండి
  5. చిరంజీవి రాజకయాల్లోకి వెళ్ళడం వల్ల పది సంవత్సరాలు సినిమాలు చేయలేకపోయాడు. ఆ లోటు తీర్చుకోవడానికి ఇప్పుడు వరుసగా సినిమాలు చేస్తున్నాడు. అయితే 67 ఏళ్ల వయసులో ఐటెం డాన్సులు చేయడం యువకుడి వేషాలు వేయడం బాగా లేదు. ప్రత్యేక పాత్రలు హుందాగా ఉండే వయసుకు సరిపడే రోల్స్ చేస్తే బాగుంటుంది.

    రిప్లయితొలగించండి