1, అక్టోబర్ 2021, శుక్రవారం

ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 4

ఆస్ట్రేలియా సీరీస్ లో ఒకటవ , రెండవ మరియు  మూడవ భాగాలకి ఇది కొనసాగింపు. 

ఆ రోజు సాయంత్రం ఆఫీస్ నుంచి బయటికి రాగానే చీకటి పడిపోయింది, టైం చూస్తే 5:30. మొదటి రోజు ఆఫీసులో పెద్ద పనిలేదు కాబట్టి ఒక గంట ముందే బయలుదేరేవాన్ని. క్రాంతి ఫోన్ చేసి 5:30 వరకు వెయిట్ చేయగలవా నేనూ వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం రూమ్ కి అన్నాడు. 

ఇదేంట్రా అబ్బాయ్, ఇంత చీకటి పడింది అన్నాను క్రాంతి తో ఆఫీస్ నుండి బయటికి రాగానే. 

ఇంకా చలికాలం స్టార్ట్ అవలేదు కాబట్టి ఈ మాత్రం.. లేదంటే సాయంకాలం నాలుగుకే చీకటి పడుద్ది. 

మధ్యాహ్నం లంచ్ కి వచ్చినప్పుడు అన్ని షాప్స్ తెరచి ఉంచారు, ఇదేంటి ఇప్పుడు ఒకటి రెండు తప్ప అన్నీ మూసేశారు? 

అవును ఇక్కడ సాయంత్రం 5 కే మూసేస్తారు, ఆ తెరచి ఉన్న షాప్స్ కూడా మన ఇండియన్స్ పెట్టుకున్న షాప్స్ అయి ఉంటాయి. 

ఆఖరికి మెడికల్ షాప్ లు కూడానా. 

అవును,కెమిస్ట్ warehouse లాంటి పెద్దవి తప్ప చిన్న మెడికల్ షాప్స్ ఐదుకే మూసేస్తారు. 

ఇలా తొందరగా చీకటి పడ్డం వల్ల ఇక్కడా సాయంకాలం మిస్ అవ్వవల్సిందేనా? బెంగుళూరు లో ఉన్నప్పుడు ఆఫీస్ నుంచి బయటకి వచ్చేప్పటికి సాయంత్రం ఏడో లేదా ఎనిమిదో అయ్యేది. ఒక వేళ లక్కీగా మేనేజర్ ఆఫీస్ కి రాకపోతే సాయంత్రం ఆరుకే బయటపడినా ఆ ట్రాఫిక్ ని ఈదుకొని ఇంటికి చేరడానికి 7:30 అయ్యేది. అలా బెంగుళూరు లో ఎన్ని లెక్కలేనన్ని సాయంత్రాలు మిస్ అయ్యానో ఆ విషయం తలచుకుంటే ఇప్పటికీ బాధగా ఉంటుంది. అయితే కనీసం ఇక్కడ ఎండలు బాగా తక్కువన్నమాట అన్నాను చుట్టూ చూసి అప్పటికే పూర్తి చీకటి పడిపోవడంతో. 

అలా అనుకునే నేనొచ్చిన మొదటి వారమే ఎగేసుకొని బీచ్ కి వెళ్ళి తిరిగొస్తే మా రూమ్ లో వాళ్ళు నా మాడిపోయిన మొహాన్ని గుర్తుపట్టక రూమ్ లోకి రానివ్వలేదు. ఇక్కడి ఎండలతో స్కిన్ కాన్సర్ వచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి బాడీకి సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేయకుండా ఎండాకాలంలో బయటికి వెళ్ళకు.  సరే గానీ మన ఆఫీసులు ఉండే ఏరియా లో ఇండియన్ హోటల్స్ లేవు కదా మధ్యాహ్నం ఏం తిన్నావ్ అన్నాడు. 

మనకు రైస్ ఐటెం తప్ప పిజ్జా, బర్గర్, పాస్తా లాంటివి నచ్చవు కాబట్టి థాయ్ రెస్టారెంట్ ఉంటే అక్కడ క్రాబ్ మీట్ ఫ్రైడ్ రైస్ తిన్నాను. టేస్ట్ చాలా బాగుంది అన్నాను 

టేస్ట్ప బాగుంటుంది గానీ పర్సు కి చిల్లెట్టి ఉంటారే?

అవును, 22 డాలర్లు ఛార్జ్ చేశారు. ఇలాగైతే ఇక్కడ డబ్బులు మిగిల్చి బెంగుళూరు లో ఒక ఫ్లాట్ కొనుక్కోవడం కాదు కదా ఇంకా అప్పులు చెయ్యాల్సి వస్తుంది. కాబట్టి రేపటి నుంచి నేను కూడా నీ లాగే డబ్బా తెచ్చుకోవాల్సిందే అన్నాను. 

సరే, మొన్న నా ఫేవరిట్ హీరో పవన్ కళ్యాణ్  గబ్బర్ సింగ్ సినిమా రిలీజ్ అయింది. వెళదామా నీ కిష్టమైతే అన్నాడు. 

నీది తెనాలే, నాది తెనాలే అని చంకలు గుద్దుకొని వెళదాం అని చెప్పి 'అవును ఇక్కడికి కొత్త  తెలుగు సినిమాలన్నీ తెస్తారా ?' అని అడిగాను. 

అన్నీ కాదు కానీ పెద్ద హీరోల సినిమాలు తెస్తారు కానీ ఇక్కడ సినిమాలు చూడాలంటే బెంగుళూరు లో ఫ్లాట్ కొనుకునే నీ కోరిక ను వాయిదా  వేస్తూనే ఉండాలి, ఎందుకంటే టికెట్ రేట్ 25-30 డాలర్ల దాకా ఉంటుంది బాగా కాస్ట్లీ అన్నాడు. 

సరే మరి రాత్రి భోజనం?

ఆ థియేటర్ ఉండే ఏరియా లో మన పారడైజ్ బిర్యాని రెస్టారెంట్ ఉంది. కాబట్టి ఇబ్బంది లేదు అన్నాడు. 

సరే సినిమా చూసొచ్చాక రెస్టారెంట్ కి వెళదాం అన్నాను, పవన్ కళ్యాణ్ సినిమా ఎప్పుడెప్పుడు చూద్దామా అన్న ఉత్సాహంలో.  

ఇదేం బెంగళూరో, హైదరాబాదో  కాదు అప్పటికి రెస్టారెంట్ తెరిచుంచడానికి 

అదేంటి రెస్టారెంట్ కూడా పది లోపలే  మూసేస్తారా? 

అవును ఇప్పడు కొంచెం బెటర్, మన ఇండియన్స్ ఇక్కడికి చొరబడ్డాక ఈ మాత్రం లేట్ గా అయినా షాప్స్ తెరచి ఉంచుతున్నారు. లేదంటే వీళ్ళ early to bed early to rise పాలసీ వల్ల హోటల్స్ కూడా ఎనిమిదికే మూసేవారు. 

రెస్టారెంట్ కి వెళ్ళి మెనూ చూసి ఇదేంటి, బిర్యాని 15 డాలర్లా? అన్నాను. 

చెప్పానుగా నువ్వనుకున్నంత ఈజీ కాదు ఇక్కడ డబ్బులు మిగిలించడం. ఇక్కడ అన్నీ ఎక్స్ట్రీమ్ రేట్స్. రెంట్స్ మరీ ఎక్కువ, ఆ రెంట్స్ కట్టుకునే బదులు ఊరి బయట టెంట్స్ వేసుకుని బతకడం బెస్ట్. 

కనీసం అదైనా ఫ్రీ అన్నమాట. 

అంతలేదు, దానికీ డబ్బు కట్టాల్సిందే. సిడ్నీ బాగా కాస్ట్లీ సిటీ. అంతేకాదు ఈ దేశంలో లో టాక్స్ బాగా ఎక్కువ. ఇక్కడ సంపాదించిన డబ్బు నీళ్ళను మన రెండు చేతులతో పట్టుకున్నట్లే ఉంటుంది. సంపాదన చేతుల నిండుగా ఉన్నట్లు ఉంటుంది గానీ మన నోటి దాకా వచ్చేలోగా సగంటాక్సుల రూపంలో కారిపోతుంది అని ముందే హెచ్చరించాడు. 

అక్కడ బిర్యాని తిని తర్వాత గబ్బర్ సింగ్ సినిమా చూసి రూమ్ కి వెళ్ళేపాటికి  టవల్ కి, బాత్రూం గోడలకి , సింకులో ఎక్కడపడితే అక్కడ ఎర్రటి మరకలు ....రక్తం లాగా. 

24, సెప్టెంబర్ 2021, శుక్రవారం

ది గ్రేట్ ఇండియన్ కిచెన్ టులెట్

బ్లాక్ బస్టర్ కథల కోసమయితే బ్యాంకాక్ బీచ్ ల దాకా వెళ్ళాలేమో తెలీదు గానీ ఒక డీసెంట్ సినిమా తీయడానికైతే  ఎక్కడికీ పోవలసిన అవసరం లేదు. మన జీవితంలో జరిగిన విషయాలో లేదంటే మన పక్కింట్లో చూసిన విషయాలో ఒక్కసారి నెమరేసుకొని ఒక చక్కటి కథని అల్లుకొని సినిమా తీయొచ్చని నేను ఈ వారం చూసిన టులెట్, ది గ్రేట్ ఇండియన్ కిచెన్ సినిమాలు గుర్తు చేస్తాయి. 

మనం ఇల్లు మారే ప్రతీసారి పడే ఇబ్బందుల్ని లేదంటే ఉన్న ఫలంగా ఇంకో నెల రోజుల్లో బాడిగ ఇంటిని ఖాళీ చెయ్యమని ఇంటి ఓనర్ ఆజ్ఞ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంకో కొంప ఎలా  వెతుక్కోవాలిరా భగవంతుడా అని మనకు ఎన్నోసార్లు అనిపించే ఉంటుంది. ఆ ఒక్క నెల టైం లో మన ఆర్ధిక స్థోమతకు సరిపడే ఇల్లు దొరకబుచ్చుకునేపాటికి తల ప్రాణం తోకకి వస్తుంది. ముఖ్యంగా 10 లేదంటే 12 నెలల అడ్వాన్స్ కట్టాలి అంటే మాత్రం భలే కష్టం. మీరు ఇళ్ళు ఖాళీ చేసిన తర్వాతే అడ్వాన్స్ ఇచ్చేది అని కనికరం లేని కొందరు ఇళ్ళ ఓనర్స్ మెలిక పెడతారు, మీరు అడ్వాన్స్ పూర్తిగా చెల్లిస్తే గానీ ఇంట్లో అడుగుపెట్టడానికి వీల్లేదు అని ఆ కొత్త ఇంటి ఓనర్ కండీషన్ పెడతాయి. 

ఇలాంటివే ఒక 12-15 ఏళ్ళ క్రితం రెండు సంఘటనలు జరిగాయి నా జీవితంలో - ఒకటేమో బ్యాంకు స్టేట్మెంట్ ఇస్తే గానీ పాస్పోర్ట్ అప్లికేషన్ తీసుకోము అంటారు పాస్పోర్ట్ ఆఫీసులో, అడ్రస్ ప్రూఫ్ కోసం పాస్పోర్ట్ ఇస్తేనే బ్యాంకు అకౌంట్ ఓపెన్ చేస్తాం అని బ్యాంకు లో అనేవారు. రెండోదేమో  జాబ్ కావాలంటే ఎక్సపీరియెన్స్ అడిగేవారు, ఆ ఎక్సపీరియెన్స్ రావాలంటే ఎవరో ఒకరు ముందు మనకు జాబ్ ఇవ్వాలి. ఇలాంటి సిట్యుయేషన్స్ ని 'క్యాచ్ 22' అంటారనుకుంటాను ఇంగ్లీషులో. 

అయినా పది పన్నెండు నెలల అడ్వాన్స్ ఇచ్చేటంత ఎక్స్ట్రా డబ్బు మధ్యతరగతి వాళ్ళ దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది? ఇక ఆ తిప్పలు మరీ దారుణం, నేనైతే ఆఫీసులో అడ్వాన్స్ కోసం అప్లై చేసుకోవడం లాంటి తిప్పలు పడాల్సి వచ్చేది. ఇక ఆ నెల దాటినా ఇల్లు దొరక్కపోతే, దొరికినా లాస్ట్ మినిట్ లో ఆ కొత్త ఇంటి ఓనర్ మొండి చెయ్యి చూపిస్తే పరిస్థితి ఎలా ఉంటుంది అనేది దాదాపు ప్రతీ మధ్యతరగతి వ్యక్తీ అనుభవించే ఉంటాడు. కేవలం ఇలాంటి సన్నివేశాలతోనే సినిమాని తీసి మెప్పించారు టులెట్ అనబడే తమిళ్ సినిమాలో. 

ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే దాకా ఇంటి పనులతో, వంటింటి పనులతో సతమతమయ్యే ఇల్లాలి బాధలను చూపించిన సినిమా ది గ్రేట్ ఇండియన్ కిచెన్. అక్కడక్కడా వంటలు ఎలా వండాలో గిన్నెలు ఎలా తోమాలో నేర్పించే ప్రోగ్రాం లా ఈ సినిమా సీన్స్ అనిపిస్తాయి గానీ సినిమా అంతా చూసాక ఆ సీన్స్ అంత సేపు పెట్టడం వల్లే మనం ఆ హీరోయిన్ పాత్రను  అంతగా  ఓన్ చేసుకోగలిగాము అనిపిస్తుంది. ఓల్డ్ జెనరేషన్ లో మరీ దారుణంగా రోజంతా అలానే కష్టపడేవారు.  అలాగని ఈ జెనెరేషన్ లో స్త్రీలు కష్టపడటంలేదు అని కాదు నా అభిప్రాయం.  ఇప్పుడు కూడా అంతే కష్టపడుతున్నారు కాకపోతే భర్తల్లో కాస్త మార్పు వచ్చి వారు తమ భార్యలకి కాస్త చేదోడు వాదోడుగా ఉంటున్నారని నా అభిప్రాయం. 

ఇక న్యూస్ పేపర్ లో వచ్చే వార్తలని చూసి కూడా ఒక కథను అల్లేసుకోవచ్చని నిరూపించిన సినిమా మలయాళంలో వచ్చిన 'హెలెన్' అనే సినిమా.

ఇవేమో ఈ నెలో, పోయిన నెలో రిలీజ్ అయినా సినిమాలు కాదు. నేను చూడ్డం బాగా ఆలస్యమైంది అంతే. అయినా నేనే చూశానంటే ఈ పాటికే చాలా మంది చూసి ఉంటారు గానీ, చూడని వారు ఎవరైనా ఉంటే ఈ వీకెండ్ లో వీటితో కాలక్షేపం చెయ్యొచ్చు.