18, జులై 2016, సోమవారం

పిల్లిలా పులివెందుల వెళ్ళాను.

చిన్నప్పుడు విపరీతమైన భయం నాకు. ప్రతి దానికి భయపడేవాడిని. అంటే ఇప్పుడు భయాలు లేవని కాదు. ఇప్పటికీ ఉన్నాయి.

ఈ రోజు సోమవారం కదా ఆఫీస్ కు వెళ్లాలని భయం. అప్పుడు స్కూల్ కి వెళ్లాలని ఇప్పుడు ఆఫీస్ కి వెళ్లాలని అంతే తేడా.

ప్రసాదం కోసం గుళ్లో క్యూ లో నుల్చున్నప్పుడు నా వంతు వచ్చేసరికి అది అయిపోతుందని భయం.

చిరంజీవి సినిమా ప్లాప్ అయినప్పుడల్లా మా కళాధర్ గాడు నన్ను బండబూతులు తిట్టుకుంటాడని భయం. దీని గురించి ఇంకో పోస్ట్ లో మాట్లాడుకుందాం.

నేను మ్యాచ్ చూసినప్పుడల్లా సచిన్ సరిగ్గా ఆడకుండానే ఔట్ అవుతాడని చుట్టూ ఉన్న అందరూ నేను మ్యాచ్ చూసినందుకే అలా అయిందని తిడతారని భయం.

మా అమ్మ నన్ను సినిమాకు తీసుకెళతానంటే భయం. పుట్టింటి పట్టుచీర, కలికాలం, సంసారం ఒక చదరంగం లాంటి ఫైటింగ్స్ లేని ఏడుపుగొట్టు సినిమాలకు తీసుకెళ్తుందని.

నాన్న వెనుక బైక్ మీద కూర్చున్నప్పుడు ఏదన్నా వెహికిల్ క్రాస్ చేసి వెళ్ళినప్పుడు వచ్చే ఆ సౌండ్ కు ఉలిక్కిపడేంత భయం.  

సినిమాల్లో హీరో ఫైట్ చేస్తున్నప్పుడు వర్షం పడిందంటే ఆ హీరోను వెనుక నుంచి ఎవరో ఒకరు పొడిచేస్తారు అనే ఒక భయం ఉండేది..కాబట్టి భయపడి ఆ ఫైట్ అయ్యేదాకా కళ్ళు మూసుకునే వాడిని.

ఎవరైనా స్కూల్ లో పిల్లలు కొడితే భయంతో తిరిగి వాళ్ళను ఏమి అనలేక ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చేవాడిని. ఆ తర్వాత మా చెల్లెలు వెళ్లి వాళ్ళను ఒక దుమ్ము దులిపి వచ్చేది అది వేరే విషయం.

పులివెందులకు చదువుకోవడానికి వెళ్లే ముందు, అక్కడ చదువుకుంటున్నప్పుడు కూడా ఇలా ఎన్నో భయాలతో పిరికి వాడిలా  పిల్లిలా ప్రతీ దానికి భయపడేవాణ్ణి ఆఖరికి పిల్లికి కూడా.

అలాగే చీకటంటే మాత్రం చిన్నప్పుడు చాలా భయం. దాని గురించే ఈ పోస్ట్.

పులివెందుల లో చదివేప్పుడు సంవత్సరం అంతా గడిచి  ఏడవ తరగతి పరీక్షలు దగ్గర పడ్డాయి. అందుకోసం నైట్ స్టడీస్ అని చెప్పి స్కూల్లో ఆరుబయట లైట్స్ కింద కూర్చోబెట్టి సాయంకాలం ఏడు నుంచి రాత్రి పది దాకా చదివించేవారు. 

ఒక రోజు నైట్ స్టడీ లో చదివి చదివి బ్రెయిన్ హీట్ ఎక్కి అరికాలు నొప్పి గా ఉందని మా టీచర్ కి చెప్తే సరే హాస్టల్ రూం కి వెళ్లి పడుకో అన్నాడు. 

మరి హాస్టల్ రూం ఏమో కొంచెం దూరం .. ఒక్కడిని వెళ్లాలంటే భయం అందుకని నైట్ స్టడీ ఇంకా రెండు గంటల సేపు ఉంది కదా ఈ లోపు లేయొచ్చులే అనే ఓవర్ కాన్ఫిడెన్స్ తో (నేను పడుకుంటే కుంభకర్ణుడికి కజిన్ బ్రదర్ ని అని తెలిసీ) పక్కనే ఉన్న క్లాస్ రూం లోకి వెళ్లి పడుకున్నాను.

నక్క అరుపులకో మరి కుక్క అరుపులకో కాసేపటికి అంటే ఒక నాలుగైదు గంటల తర్వాత అనుకుంటాను మెలకువ వచ్చింది ..చుట్టూ చీకటి అసలేమీ కనపడి చావలేదు .. "రామ్మూర్తీ" అని పిలిచాను. వాడే ఎక్కువగా నా పక్కన పడుకునేవాడు హాస్టల్ లో.  నా సౌండ్ నాకే రీసౌండ్ లా వినపడింది కానీ రెస్పాన్స్ లేదు.

అప్పటికి గానీ బుర్రలో లైట్ వెలిగి నేనెక్కడ పడుకున్నానో గుర్తు రాలేదు. క్లాస్ రూం లో లైట్ వెలిగిద్దామనుకున్నాను కానీ స్విచ్ రూం బయట ఉందనే విషయం గుర్తొచ్చింది. 

రూం బయట ఉన్న టాప్ ఎవడో సరిగా ఆఫ్ చేసినట్లు లేడు. టాప్ లోంచి నీళ్లు కింద పడ్డప్పుడల్లా టప్ టప్ అని వచ్చే శబ్దం నా భయాన్ని రెట్టింపు చేస్తోంది.

ఆ మధ్యే రక్త జ్వాల అనే దిక్కుమాలిన దెయ్యం సినిమా చూసాను సారీ విన్నాను. (మళ్ళీ మా రామ్మూర్తి ఏదో ఒకటి అంటాడు నేను హారర్ సినిమా చూసాను అంటే ). ఆ సినిమా లో కట్ అయిన ఒక చెయ్యి వచ్చి అందరిని చంపేస్తూ ఉంటుంది అది కాస్త దారి తప్పి ఇక్కడికి వస్తుందేమో అని భయం. 

ఆ చెయ్యి కాకపోయినా ఖచ్చితంగా యే దెయ్యమో ఈ చీకట్లో వచ్చి నన్ను బ్రేక్ ఫాస్ట్/లంచ్/డిన్నర్ గానో తినేస్తుంది అని అనుకున్నాను. దెయ్యాల తిండి అని అంటూ ఉంటారు కదా అది నేను ఇవాళ ప్రత్యక్షంగా చూస్తూ చచ్చిపోతానేమో అనుకున్నాను. 

నిన్న వేసుకున్న పాంట్ జేబులో నాలుగు న్యూట్రిన్ చాక్లేట్లు అలాగే ఉండిపోయాయి. ఆ గోపి గాడు రెండు నెలల కింద నా దగ్గర తీసుకున్న రెండు నిమ్మొప్పుల బాకీ  అలాగే ఉండిపోయింది. మ్యాథ్స్ బుక్ లో ఉండే నెమలి ఈకను ఆ కిషోర్ గాడు ఎప్పుడూ అడుగుతూ ఉండేవాడు వాడికి ఇచ్చినా బాగుండేది మంచి వాడిగా అన్నా మిగిలి పోయేవాడిని వాడి దృష్టిలో.  ఇంటి దగ్గర ఆడిన గోళీల ఆటలలో గెలిచి నేను సంపాదించుకున్న బుట్టెడు గోళీలు, రెండు బొంగరాలు గూట్లో అలాగే ఉండిపోయాయి. ఈ నెల చందమామ ఇంకా చదవనే లేదు. ఇక అన్నిటి కన్నా ముఖ్యమైన నా ఆస్థి  ట్రంక్ పెట్టెలో అడుగున  ఉండే మూడు దివ్య భారతి పేపర్ కట్టింగ్ లు, రెండు సిల్క్ స్మిత పేపర్ కట్టింగ్ లు. నేను పోతే అవి ఎవడు సొంతం చేసుకుంటాడో అనే బెంగ ఒక వైపు. 

ఇక నా ప్రాణాలు అప్పుడో ఇప్పుడో పోతాయనే అనుకున్నాను. సరిగ్గా అప్పుడు గుర్తొచ్చింది ఆ రోజు శని వారం రాత్రి అని తెల్లారితే ఆదివారం అని.

పోస్ట్ పెద్దదవుతోంది కాబట్టి మిగిలినది తరువాతి పోస్ట్ లో రాస్తాను. 
9 కామెంట్‌లు:

 1. Ha ha nice one..
  BTW which school in pulivendula? Sheshareddy school? Which year?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామెంట్స్ రాసినందుకు థాంక్స్ అండీ.
   అవునండి బండి శేషారెడ్డి గారి స్కూల్. 1991-1992 year 7th క్లాస్.

   తొలగించండి
  2. Oh ok..గుట్ట మీద ఉండేదా అప్పుడు మీ స్కూల్? తర్వాత ప్రభాకర్ సార్ తీసుకున్నారు కదా?

   తొలగించండి
  3. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

   తొలగించండి
 2. మూడు దివ్య భారతి పేపర్ కట్టింగ్ లు, రెండు సిల్క్ స్మిత పేపర్ కట్టింగ్ లు. నేను పోతే అవి ఎవడు సొంతం చేసుకుంటాడో అనే బెంగ ఒక వైపు :)))))))

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామెంట్స్ రాసినందుకు థాంక్స్ అండీ నీహారిక గారు.

   తొలగించండి
 3. రీడబిలిటి పుష్కలంగా ఉంది. మీకు రాస్తూ ఉండాల్సిన బాధ్యత ఉంది.👍

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కామెంట్స్ రాసినందుకు థాంక్స్ గురువు గారు. మీకు నేను ఏకలవ్య శిష్యుడినండి. మీరు రాసే పోస్ట్ లలో కొస మెరుపులు బాగా ఇష్టం. తప్పకుండా ఫాలో అయ్యే వాళ్లలో నేనొకడిని.

   తొలగించండి