21, జులై 2016, గురువారం

పులివెందుల నుంచి పులిలా తిరిగొచ్చాను.

ముందు రాసిన పిల్లిలా పులివెందుల వెళ్ళాను పోస్ట్ కి ఇది కొనసాగింపు.

ప్రతీ ఆదివారం పూట మా మెస్ లో బ్రేక్ ఫాస్ట్ గా పూరి పెడతారు. కాబట్టి రేప్పొద్దున ఆ పూరీ తినడం కోసమైనా ఏదో ఒక లాగా నేను బతకాలి.  ఈ ఒక్క ఆశ చాలు ఏదో ఒక ప్లాన్ ఆలోచించి దెయ్యం బారి నుంచి ఈ పూటకు తప్పించుకుంటే చాలు.

ఒక వేళ దెయ్యం నన్ను తినడానికి వస్తే ఆవు-పులి కథలోలాగా నేను కూడా పూరి తినేసి వచ్చి రేపు రాత్రి ఇక్కడే పడుకుంటాను అని మాట ఇచ్చేస్తే సరి.  ఆ మాట నిలబెట్టుకొని నా నిజాయితీని దెయ్యం మెచ్చేలా చేసుకొని ప్రాణాలు కాపాడుకోవచ్చు అని నిర్ణయించుకున్నాను.

ఇక భయం లేదు పడుకోవచ్చు దెయ్యం వచ్చి లేపితే అప్పుడు చూసుకుందాం అని పడుకున్నాను.

కాసేపటికి ... ఏం పూరీ అంటే అంత ఇష్టమా అని అడిగింది దెయ్యం నన్ను నిద్ర లేపి.

తనకెలా తెలిసిందో ఏమో నేను పూరి గురించి అనుకున్నది అని భయపడుతూనే "ఇష్టం కాదు ప్రాణం. మా క్లాస్ లో బాగుండేది కుమారి అయితే మా మెస్ లో బాగుండేది పూరి" అంతేకాదు  అసలు

ఆ పూరి ని తినని పళ్ళు
కుమారి ని చూడని కళ్ళు
దివ్యభారతి కలలోకి రాని రాత్రుళ్ళు
వర్షం వస్తే నీళ్లు కారని ఇలాంటి స్కూళ్ళు
పది కిక్కులు కొడితే కానీ స్టార్ట్ కాని వాళ్ళ నాన్నకున్న బజాజ్ లాంటి బళ్ళు
కడుపు నిండా ప్రసాదం పెట్టని గుళ్ళు
సంక్రాంతి ముగ్గుల్లో పువ్వులు పెట్టని గొబ్బిళ్ళు
గోరింటాకు లేని ఆడవాళ్ళ గోళ్ళు
కాళ్లకు సరిగ్గా సరిపోని జోళ్ళు
కండ పట్టని వొళ్ళు
అబద్దాలు చెప్పడం రాని మగాళ్ళు
షాపింగ్ అంటే ఇంట్రెస్ట్ లేని ఆడాళ్ళు
పిల్లికి కూడా భయపడే నా లాంటి వాళ్ళు

ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని మా రామ్మూర్తి ఫీలింగ్.

అసలా పూరి తినడం కోసం బ్రష్ చేసుకోకుండా ఒకసారి, బ్రష్ చేసుకొని మరో సారి, లాస్ట్ బ్యాచ్ లో ఇంకోసారి వెళ్ళేవాడిని. అసలు చిరంజీవి - రాధ, బాలకృష్ణ - విజయశాంతి కాంబినేషన్ ఎలాగో అలాగే పూరి విత్ బొంబాయి చట్నీ కాంబినేషన్ అదుర్స్. అందుకే ఆ పూరి అంటే ప్రాణం.

నువ్వు తెలుగు సినిమాలు ఎక్కువ చూసేట్లు ఉన్నావే .. నువ్వు నీ చెత్త డైలాగులు. సరే అయితే పూరి తినడం లో నాతో పోటీ పడు...నువ్వు గెలిస్తే వదిలేస్తాను అంది.

ఏదో మంత్రం వేసినట్లు పూరీలన్నీ నా ముందు ప్రత్యక్షం.

ఇక నేను దెయ్యం పోటీ పడి పూరీలు లాగించాము. కాసేపటికి ఇక నేను తినలేను అని దెయ్యం కాళ్లెత్తేసింది.(మనమైతే చేతులెత్తేసాము అంటాము కదా  అదే దెయ్యం అయితే కాళ్ళు ఎత్తేస్తుంది అని అనాలట అదే చెప్పింది నాతో..మీరు నమ్మాలి)

 నేను మాత్రం తింటూనే ఉన్నాను.

నువ్వేమైనా కుంభకర్ణుడికి కజిన్ బ్రదరా అని అడిగింది

భలే కనిపెట్టేసారే! నా గురించి తెలిసిన వాళ్ళందరూ అదే అంటారు నన్ను.  మీరు ఓడిపోయారు  కాబట్టి  ఇక నన్ను తినకూడదు అన్నాను కాస్త ధైర్యం కూడగట్టుకొని.

మీ మనుషులైనా మాట మీద నిలబడరేమో గాని మేము అలా కాదు మాట ఇచ్చామంటే ఆ మాట మీద కూర్చుంటాం.

మాట మీద కూర్చోవడమేమిటండి దెయ్యం గారూ ?

మీరు మాట మీద నిలబడతాం అంటారు కదా అదే మేమైతే మాట మీద కూర్చుంటాం అని అంటాము. అయినా పూరీలతోనే నా కడుపు నిండిపోయింది నిన్నేం తింటాను నీ తిండి యావ చూస్తే నువ్వే నన్ను తినేట్లు ఉన్నావ్... నే వెళ్తున్న పిన్నోయ్ అంది దెయ్యం ( మనం బాబోయ్ అన్నట్లు దెయ్యాలు పిన్నోయ్ అంటాయి నేను అర్థం చేసుకున్నట్లే మీరూ అర్థం చేసుకోవాలి )

పవన్ పవన్ అనే  పిలుపు వినపడింది.

వెళ్తానన్నారు ఇంకా వెళ్లలేదా అన్నాను అది నిర్ణయం మార్చుకుందేమో అన్న భయంతో.

నేను రామ్మూర్తిని... కళ్ళు తెరిచి చూడు అన్న మాట వినిపించింది

నేను కళ్ళు తెరిచి చూద్దును కదా తెల్లవారినట్లు ఉంది.  మా రామ్మూర్తి తో పాటు హాస్టల్ వార్డెన్ ఉన్నారక్కడ. అప్పుడర్థమైంది  దెయ్యం వచ్చింది కలలోకి అని.

అలా ఆ రాత్రి  ఒంటరిగా చీకటి రూం లో గడిచి పోయింది అలాగే నా భయం ఎటో ఎగిరి పోయింది. రాత్రంతా ఒంటరిగా చీకట్లో ఉన్నాను అయినా ఏమి కాలేదు కాబట్టి ఈ భయాలు గట్రా ఒట్టి ట్రాష్ అని అర్థం చేసుకున్నాను. 

పిల్లి లాంటి నన్ను పులిలా తయారుచేసింది ఆ సంఘటన. ఆ రోజుతో ఒక్క చీకటంటేనే కాదు చాలా భయాలు పరారీ. నిజ్జంగా ఇది నిజం ఆ దెయ్యం మీదొట్టు మీరు నమ్మాలి. దెయ్యాలు గియ్యాల్లాంటి భయాలు ఇప్పుడు అస్సలు లేవు.వామ్మో గమనించనేలేదు అర్ధరాత్రవుతోంది .. ఏ దెయ్యమో వచ్చి నన్ను తినెయ్యదు కదా .. వెంటనే ముసుగేసుకుని పడుకోవాలి.  ఈ దిండు కింద హనుమాన్ చాలీసా ఉండాలి..  ఏది ఎక్కడ కనపడదే....మా చంటోడికి ఇప్పుడిప్పుడే పళ్ళు వస్తున్నాయి ఏది దొరికితే అది నోట్లో పెట్టుకొని కసా బిసా నమిలేస్తున్నాడు.. ఈ హనుమాన్ చాలీసా కూడా అలాగే నమిలెయ్యలేదు కదా..  అదెక్కడుందో వెతుక్కోవాలి ... బతికుంటే మళ్ళీ ఇంకో బ్లాగ్ తో కలుస్తాను

8 కామెంట్‌లు:

 1. నెయిల్ పాలిష్ లేని ఆడవాళ్ళ గోళ్ళు
  గోరింటాకు లేని ఆడవాళ్ళ గోళ్ళు అని ఉంటే బాగుండేదండీ :)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. మీరన్నది నిజమండి నీహారిక గారు. నాకూ అనిపిస్తోంది..ఇప్పుడే మార్చేస్తాను.

   తొలగించండి