13, జులై 2016, బుధవారం

కాష్మోరా లో లాగా చేతబడి చేస్తే


పులివెందులలో చదివే రోజుల్లో హాస్టల్ లో రెండు వారాలకోసారి సినిమా వేసేవారు.

ఒకసారి నారి నారి నడుమ మురారి వేశారు. బాలకృష్ణ సినిమా కదా ఫైటింగులు బాగానే ఉంటాయి అనుకున్నాము.

సినిమా చూస్తే నీరసం వచ్చేసింది ఒక్క ఫైటింగ్ కూడా లేదు దాంట్లో.

ఆ తర్వాత మరో రెండు వారాలకి అల్లుడుగారు సినిమా వేశారు.

మళ్ళీ నీరసం వచ్చేసింది ఆ సినిమాలోనూ ఒక్క ఫైటింగ్ లేదు.

అసలు ఇలాంటి ఫైటింగ్ లేని సినిమాలే కదా దూరదర్శన్ లో వేసేది...ఇక్కడ కూడా అవేనా అని కోపమొచ్చింది.

ఎవరైనా సినిమా చూసి వచ్చామని చెబితే ఎన్ని ఫైట్స్ ఉన్నాయి అని అడిగేవాళ్ళము అంత ఇష్టం ఫైటింగ్ సినిమాలంటే. అసలు ఫైటింగ్ లేని సినిమాలు సినిమాలే కాదని అనుకునే వయసు అది.

ఇలాంటి సినిమాలు వేస్తున్నందుకు స్కూల్ మానేజ్మెంట్  మీద అంటే రెడ్డి గారి మీద కోపం వచ్చింది. నేను మా రామ్మూర్తి కలిసి విప్లవ శంఖం పూరించి మా డిమాండ్స్ ను ఆయన ముందు ఉంచాము.
  1. నారి నారి నడుమ మురారి, అల్లుడుగారు లాంటి ఫైటింగులు లేని చెత్త సినిమాలు (అవే మంచి సినిమాలు అని తర్వాత అర్థమైంది) ఇకపైన వేయకూడదు. ధర్మక్షేత్రం, అసెంబ్లీ రౌడీ లాంటి సినిమాలు వేయాలి. (గమనిక: మోహన్ బాబు మీదో బాలకృష్ణ మీదో మాకెలాంటి ప్రేమ లేదు ఉన్నదంతా దివ్య భారతి మీదనే )
  2. మంచి సినిమాలు వేసినప్పుడు(వీటిలో చాలా వరకు చెత్త సినిమాలు అని తర్వాత అర్థం అయింది) సిల్క్ స్మిత పాట కట్ చేయడం లాంటివి చేయకూడదు. 
  3. రెండు వారాల కొకసారి కాకుండా ప్రతి వారం వీలైతే ప్రతి రోజూ సినిమా వేయడం 

ఆ తర్వాత ఎం జరిగి ఉంటుందో మీ ఊహకే వదిలేస్తున్నాను.

నేను, రామ్మూర్తి రహస్య సమావేశం ఏర్పాటు చేసుకున్నాము.

మామూలుగా చెబితే ఈయన వినే రకం కాదు. ఏదో ఒకటి చేయాలి.

మన డిమాండ్స్ ఒప్పుకోవాలంటే ఆయన కొడుకుని కిడ్నాప్ చేస్తే సరి అన్నాను...అదేదో సినిమాలో రావు గోపాల్ రావు చేసిన పనిని గుర్తుకు తెచ్చుకొని.

వాడు ఉండేది అమెరికా లో అట. 

అయితేనేం  మొన్ననేను బెంగళూరుకే  వెళ్ళొచ్చాడు అమెరికా వెళ్ళి రాలేనా

నా ఖర్మ .. నీ లాంటివాడితో ఫ్రెండ్షిప్ చేయడం

సరే సరే .. మొన్న మీ బాబాయి వచ్చి బయటికి తీసుకెళ్లినప్పుడు మనిద్దరం కాష్మోరా సినిమా చూసాము కదా  ఆ సినిమా లో లాగా చేతబడి చేస్తే

చూసాము అనొద్దు. నువ్వు చూసావు నేను విన్నాను అని చెప్పు.

అదేంట్రా అలా అంటావ్

నీ బొంద.. ప్రతి దానికి భయం అంటావ్.. కళ్ళు మూసుకుంటావ్.. సినిమా అంతా కళ్ళు మూసుకునే ఉన్నావ్ గా ఎక్కడ చూసి చచ్చావ్ వినడం తప్ప.

సరేలే ఆ సినిమా లో లాగా చేతబడి చేస్తే

నిమ్మప్పులు కొనడానికే డబ్బులు లేవిక్కడ..ఇక ఆ నిమ్మకాయలు, ముగ్గులు, మంత్రగాడిని ఎక్కడి నుంచి తెస్తాం.

అన్నిటికీ అన్నీ చెప్తావ్ .. నువ్వేదైనా సలహా ఇవ్వొచ్చుగా.

అంత తెలివే ఉంటే నీతో ఫ్రెండ్షిప్ ఎందుకు చేస్తాను?

అలా సరైన ఆలోచనలు లేక/రాక మా డిమాండ్ లను మేము నెరవేర్చుకోలేక పోయాము.





2 కామెంట్‌లు:

  1. Fighting cinema lante entha piccho gurtuku vastundi.DD lo Vaaraniki oke oka movie ayina, adi A.N.R movie ayite Fights undavani chusevaanni kadu. Ha ha....,Annamayya cinema lo kuda fights expect chesina yekaika vyakti ni nene ayyunta. Ippudu remind chesukunte funny ga undi.

    Nice post.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కామెంట్స్ రాసినందుకు థాంక్స్ చంద్ర.
      అన్నమయ్య సినిమాలో ఫైటింగ్స్ హహ్హహ్హ.
      మా ఇంట్లో వాళ్ళు నాగార్జున సినిమా గీతాంజలి కి తీసుకెళితే సినిమా అయిపోయాక ఒక్క ఫైటింగ్ కూడా లేదు చెత్త సినిమా అని మా ఇంట్లో వాళ్ళతో అన్నట్లు గుర్తు.

      తొలగించండి