27, డిసెంబర్ 2018, గురువారం

అభిమానం వెర్రి తలలు వేస్తోందా?

నిన్నటి నుంచి వాట్సాప్ లో ఒక మెసేజ్ తెగ తిరుగుతోంది, 'వినయ విధేయ రామ' సినిమా ఆడియో ఫంక్షన్ కి వెళ్లిన అభిమానులకు తగినన్ని పాసులు ఇవ్వకపోవడం వల్ల, ఎక్కడెక్కడి నుంచో హైదరాబాదు చేరుకున్న అభిమానులు నిరుత్సాహం తో నిరాశ చెందారు  అని.

అది చదివాక ఎవరికైనా మనసులో అనిపించే ఒకే ఒక మాట 'బుర్ర తక్కువ వెధవల్లారా, వాడెవడో హీరో ఆడియో ఫంక్షన్ కు మీరు ఎగేసుకొని వెల్లడమేమిట్రా' అని. 

అభిమానం ఉండచ్చు ఎంతవరకు అంటే మహా అయితే మొదటి రోజు సినిమా చూసే వరకు, లేదంటే ఏ హీరో అయినా మీ ఊరు వస్తే అతన్ని చూడటానికి వెళ్లడం వరకు.

సినిమా అభిమానులు:

నేను టెన్త్ చదువుతున్నప్పుడు నా మిత్రుడు ఒకడు ఉండేవాడు, ఆడు అరివీర భయంకర కరడు గట్టిన చిరంజీవి అభిమాని. రాత్రి పూట ఫాన్స్ షో చూసొచ్చి రెండున్నర గంటల సినిమాని ఐదు గంటల సేపు చెప్పేవాడు. రిక్షావోడు సినిమా కూడా పెద్ద హిట్టు అని వాదించే అతి మూర్ఖపు అభిమాని. 

అల్లాంటివాడు అభిమాన సంఘం అదీ ఇదీ అని చెప్పి వాడి చదువంతా నాశనం చేసుకున్నాడు. తర్వాత వాళ్ళ నాన్నవాడికో బట్టల కొట్టు పెట్టిస్తే మళ్ళీ అభిమానం అనే పేరుతో 'స్నేహం కోసం' సినిమాని థియేటర్ లో నూరురోజులు ఆడించడానికి వీడి జేబులోంచి డబ్బు ఖర్చు పెట్టి అప్పుల పాలై జీవితం అంతా నాశనం చేసుకున్నాడు.  

ఇతననే కాదు ఇంకొంత మంది అభిమానం అనే వెర్రితో సినిమా హీరోల బ్యానర్ లు కట్టడాలు, పాలాభిషేకాలు, ఒకే సినిమాను థియేటర్ లో పది సార్లు చూడటం లాంటివి చేసి వాళ్ళ సమయాన్ని, డబ్బునే కాక జీవితాలను కూడా నాశనం చేసుకుంటారు. 

ఇంకొంచెం ఓల్డ్ జనరేషన్ అభిమానులు అయితే దూడ పేడ వేయడం ఆలస్యం, దాన్ని గోడ మీదున్న ఆపోజిట్ పార్టీ హీరో పోస్టర్ మీదకు చేర్చేసేవారు.  అదో రకం వెర్రి.

వరదలు, భూకంపాలు లాంటి విపత్తులు సంభవించినప్పుడు, ఈ అభిమానులు స్పందించి చేతనైనంత సహాయం చేస్తుంటారు. ఈ విషయంలో వీరిని అభినందించాల్సిందే. 

రాజకీయ  అభిమానులు:

రాష్ట్రం లో ఇంకే సమస్య ఉన్నా పట్టని 'కత్తి మహేష్, శ్రీరెడ్డి, రాం గోపాల్ వర్మ'  లాంటి మేధావి వర్గం (!!?)  అప్పుడప్పుడూ పవన్ కళ్యాణ్ మీద విరుచుకుపడుతుంటారు.  

ఇంట్లో వారికుండే సమస్యలు తీర్చుకోవడం చేతకాని వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ ఫాన్స్ అని పేరెట్టేసుకొని బండ బూతులు తిడుతుంటారు ఆ విమర్శకులని. 

ఆ మేధావులు (?) అతన్నితిడుతున్నారు అంటే వాళ్ళ లెక్కలు వాళ్ళకుంటాయి.  తిడుతున్నా ఈయన మౌనంగా ఉన్నాడు అంటే బయట పడకూడని బొక్కలు బయట పడచ్చని. మధ్యలో బకరా గాళ్ళయ్యేది పవన్ కళ్యాణ్ ఫాన్స్ అని పేరెట్టేసుకున్న ఈ  వెర్రి వాళ్ళే.

కొంత మంది రాజకీయ అభిమానులేమో ఎప్పుడూ అవతల పార్టీ వాళ్ళను విమర్శించడమే ధ్యేయంగా పెట్టుకుంటారు. ఇంకొందరు అభిమానులు ఇతరుల మీద విషం చిమ్మకుండా ఆ విషం ఏదో వాళ్ళే తాగేస్తారు.  అతనెవరో మూర్ఖుడు మొన్న ఎలక్షన్స్ ముందు కెసిఆర్ గెలవాలని నాలిక కోసుకున్నాడు, అప్పుడెప్పుడో ఇంకోడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు, వీళ్ళిద్దరూ ఈ కింది కాటగిరీ లోకి వస్తారేమో నాకు తెలీదు, మీరే చదివి నిర్ణయించుకోండి. 

అభిమానులు కాని అభిమానులు:

కొన్నేళ్ళ క్రితం మా ఫ్రెండ్ వాళ్ళ అన్నయ్య ఆత్మహత్య చేసుకున్నాడని తెలిసింది. ఏమిటి విషయం అంటే రాజ శేఖర్ రెడ్డి గారి మరణాన్ని జీర్ణించుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు అని అన్నారు.

కొన్ని నెలల తర్వాత మా ఫ్రెండ్ ని కలిసినప్పుడు ఇదే విషయమై అడిగాను. అయినా మీ అన్నయ్యకు పాలిటిక్స్ అంటే అంత ఇష్టం ఉన్నట్లు ఎప్పుడూ అనిపించలేదురా, అలాంటి వాడు ఇలా ఎలా చేసాడురా అని. 

"కుటుంబ సమస్యల్లో నలిగి ఆత్మహత్య చేసుకున్నాడు, కాకపొతే ఇంట్లో పెద్ద వాళ్ళు, ఊర్లో ఉండే పెద్ద మనుషులు కలిసి  మా అన్నని రాజ శేఖర్ రెడ్డి  గారి అభిమానిని చేసి ఆత్మహత్యని రాజ శేఖర్ రెడ్డి గారి ఖాతాలో వేసారు ఇంటి పరువు పోకుండా" అన్నాడు.

'ఊ పె కు హ' బ్యాచ్ అభిమానులు 

వాళ్ళ నాయకుడేదో ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు వాడి పుట్టిన రోజుకు, తద్దినానికి, వర్ధంతికి పెద్ద పెద్ద హోర్డింగ్స్ ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తుంటారు. వీళ్ళను 'ఊ పె కు హ' బ్యాచ్ అభిమానులు అనొచ్చు.  ఊర్లో పెళ్ళికి కుక్కల హడావిడి టైపు. 

ఆ మధ్య హోర్డింగ్స్, కటౌట్స్ విషయమై  ప్రభాస్ ఫాన్స్ కి పవన్ కళ్యాణ్ ఫాన్స్ కి గొడవలు జరిగాయి అని విన్నాము కదా ఆ అభిమానులంతా కూడా ఈ బ్యాచ్ కిందకే వస్తారు.

ఈ సొల్లు అంతా రాసాక చివరిగా నే చెప్పొచ్చేదేమిటంటే "మీ జీవితానికి మీరే హీరో అవ్వండి, వేరెవరినో మీ జీవితంలో హీరోని చెయ్యకండి" అని. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి