23, జనవరి 2019, బుధవారం

మా ఊరిలో ముగ్గుల పోటీలు

మొన్న మీ వాడికి పిల్లను చూడ్డానికి కొండాపురం పోయిన్నారు కదా, సంభంధం ఏమన్నా ఖాయం అయిందా?

లేదు వదినా,  ఆయమ్మి వాళ్ళ అమ్మ నాకు నచ్చలేదు. 

ఆవిడ పద్దతి నచ్చలేదా?

కాదు, ఆవిడ చీర కట్టుకున్న పద్దతి నచ్చలేదు. చీరకి, జాకెట్ కి కలర్ మ్యాచ్ అవలేదు, అందుకే ఆ సంభంధం వద్దనుకున్నాము.

మరి నిన్న చూసొచ్చిన ఆ పొద్దుటూరి సంబంధం?

ఖాయం అయ్యేట్లే వుందొదినా.

పిల్ల వాళ్ళకు ఆస్తి అదీ ఉందా?

ఆళ్ళ నాన్న మంచి ఉద్యోగంలో ఉన్నాడు, ఒక్కటే పిల్ల. పైగా ఆయప్ప, రెండు ప్లేట్ల మీద కూడా ఆయమ్మి పేరే రాయిచ్చాడు.

దానిదేముందిలే వదినా, మా ఇంట్లో అన్ని ప్లేట్ల మీద మా యబ్బి పేరే రాయించాం.

ప్లేట్లంటే తినే ప్లేట్లు కాదు వదినా. 

మరి, పూజకు పెట్టుకునే బంగారు ప్లేట్లేమిటి వదినా?

ఆ ప్లేట్లు కాదు, మొన్న మీరు తాడిపత్రి లో పాతిక లచ్చలెట్టి కొన్లా ఆ ప్లేట్లు. 

ప్లాట్ అను మరి. 

అదేలే, నాకు నోరు యాడ తిరుగుద్ది. అది సరే గానీ పోయిన వారం సంక్రాంతి ముగ్గుల పోటీలో గొడవ పడ్డావంట

అవును, నాకేమో 5 వ ప్రైజ్ వచ్చింది, మేము అయ్యవార్లం, ముక్కలు తినము కదా? అందుకే 4 వ ప్రైజ్ అడిగా, దానికి గొడవ అయింది అంతే
మా స్వంత ఊరు అయిన తాళ్ల ప్రొద్దుటూరు లో ముగ్గుల పోటీలు జరిగాయని తెలిసి దాని మీద ఒక పోస్ట్ రాయాలనుకొని రాసేసాను. 

"కడప జిల్లా , తాళ్ల ప్రొద్దుటూరు గ్రామంలో సంక్రాంతి సంధర్బంగా జరిగిన సంబరాలలో భాగంగా ముగ్గుల పోటీలు జరిగాయి. మహిళలు ఉత్సాహంగా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. ముఖ్య అతిధి గా ఫలానా వ్యక్తి విచ్చేశారు" అని రాస్తే చదవడానికి ఎవరికి ఇంటరెస్ట్ ఉంటుంది. ఆ విషయాలు న్యూస్ పేపర్ లో చదవడానికే ఇంట్రస్ట్ ఉండదు, ఏదో ఆ ఊరి వాళ్ళకో మహా అయితే ఆ జిల్లా వాళ్ళకో చదవాలనిపిస్తుంది. మరి నా బ్లాగ్ దాకా ఎందుకు? 

అందుకే నా స్టయిల్ లో (ఏడ్చావులే ) ఒక ఫన్నీకోటింగ్ ఇచ్చాను. 

ఏదో సరాదాకు రాసింది మాత్రమే, ఎవరినీ హర్ట్ చేయాలని కాదు. 

ఆ పోటీ నుంచి మచ్చుకో ముగ్గు, మెచ్చుకోగలితే మెచ్చుకోండి ఈ ముగ్గేసిన మా ఊరి మహిళను. 


తాళ్ల ప్రొద్దుటూరా? అదెందుకు తెలీదు, పొద్దుటూరే కదా "సెకండ్ ముంబై" అని కూడా అంటారు మాకు తెలుసు అనుకుంటున్నారేమో, కాదండీ "తాళ్ల ప్రొద్దుటూరు" అని ఒక పల్లె ఉంది అదే నా స్వంత ఊరు. 

18 కామెంట్‌లు:

 1. ముగ్గేసిన మీ వూరి మహిళకు చప్పట్లు! ముక్కల బహుమతి వద్దన్న మీ బ్లాగ్ కథలోని అయ్యవార్లమ్మకి బోల్డన్ని చప్పట్లు! కథ చెప్పి నవ్వించిన మీకు ఇంకా బో….ల్డన్ని చప్పట్లు!

  రిప్లయితొలగించండి
 2. మీ సీమ మాండలికం బాగుందండి. సినిమాల్లో జయప్రకాష్ రెడ్డి సీమడైలాగులు వినడమే. మొన్న సంక్రాంతికి శర్కరి గారు తన బ్లాగులో నెల్లూరు మాండలికం వాడి ఉర్రూతలూగించేశారు. ఇప్పుడు మీరు.

  నాకు నిజంగా తెలియక అడుగుతున్నాను ... మీరు పోస్ట్ చేసిన pamphlet లో చెప్పినట్లు చికెన్ ఫ్రై చెయ్యడానికి ప్రత్యేక బాణలి ఉంటుందా? ఫ్రైయింగ్ పాన్ (pan 🙂. కిళ్ళీ కాదు ... మీ పోస్ట్ లో "ప్లేట్" లాగా 😀) అంటే ఫ్రైయింగ్ పానే (pan) కదా. సైజులు, ఆకారాలు, లోతు, అంచు(గట్టు) తేడా ఉంటుందేమో? గ్రిల్ చెయ్యడానికి ఒకరకం ఉంటుందని తెలుసు. అంతే కానీ ... చికెన్ ఫ్రైకి ఒకటి, మటన్ ఫ్రైకి ఒకటి, బంగాళాదుంపల వేపుడుకి ఒకటి వేరే వేరే ఉంటాయా? ఎంత వండుకోవాలి అన్నదాన్నిబట్టి చిన్నదో, పెద్దదో పాన్ (pan) వాడతారు కదా. అయినా ఏమో లెండి, నాది ఆ డిపార్టుమెంటు కాదు, నావి ఆ ఆహారపుటలవాట్లూ కావు, కాబట్టి అంతగా తెలియదు 🙁.

  అలాగే 4వ బహుమతి "పప్పుకుకర్" అన్నారు. దీనికి కూడా ప్రత్యేక కుకర్లు ఉంటాయాండి? నాకు తెలిసినవి వంట (ప్రెషర్) కుకర్, మిల్క్ కుకర్, తరువాత రోజుల్లో వచ్చిన ఎలక్ట్రిక్ రైస్ కుకర్ మాత్రమే. ఇప్పుడు రకరకాలు వస్తున్నాయేమో మరి. ఆలోచిస్తే, మామూలు ప్రెషర్ కుకరే చిన్నసైజులో ఉంటుందేమో బహుశః 🤔. దానికి "పప్పుకుకర్" అని నామకరణం చేసేశారేమో (టీవీ ఏంకరిణులా?)?Again నా డిపార్టుమెంటు కాదు. పోనీండి, pamphlet తయారు చేసింది మీరు కాదుగా, కాబట్టి నా కామెంట్లను ఈనాటి యువత ఊతపదంలో చెప్పినట్లు "లైట్" తీస్కోండి 😀.

  ముగ్గు బాగుంది 👌. ముగ్గులో కోళ్ళు కూడా ఉన్నాయండోయ్ 😀.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. చదివి మెచ్చినందుకు ధన్యవాదాలు నరసింహారావు గారు. నాకు తెలిసి అలా సెపరేట్ గా ఉండవనుకుంటానండి. వాళ్ళు అలా రాసేసినట్లున్నారు, దాంతో నాకూ పోస్ట్ రాయడానికి మేటర్ దొరికింది. :)

   మీరన్నట్లు వాళ్ళే వెరైటీ గా నామకరణం చేసినట్లు ఉన్నారు.

   తొలగించండి
  2. 🦁 garu,

   చికెన్ ఫ్రై చేయడానికి ఒకటి చేపల ఫ్రై చేయడానికి మరొకటి విడి విడిగా పాన్ లు ఉంటాయండి. మా ఇళ్ళకు కూడా బ్రాహ్మణులు వచ్చి భోజనం చేయాలి కదండీ :)

   తొలగించండి
  3. మీరన్న రెండో పాన్ ... చేపల ఫ్రైకా, కూరగాయ ముక్కల వేపుడుకా ??🤔
   Anyway so very nice of you. అలాగే మరి ... మాంసాహారపు వంటకాలకు వాడే పాన్(లు), శాకాహారపు వంటకాలకు వాడే పాన్ ... వేరే వేరే రంగుల్లో ఉన్నవి వాడేట్లు చూసుకుంటున్నారా ... హ్హ హ్హ హ్హ 😀 ?

   తొలగించండి
 3. ఈ సం రం నేను కూడా ముగ్గుల పోటీలో పాల్గొన్నాను. ఒక గులాబీ మొక్క కన్సొలేషన్ బహుమతిగా ఇచ్చారు. మొదటి మూడూ రాలేదు. మీరు పోస్ట్ చేసిన ముగ్గు బాగుంది.కోళ్ళు మరీనూ....

  రిప్లయితొలగించండి
 4. >>>ఆవిడ చీర కట్టుకున్న పద్దతి నచ్చలేదు. చీరకి, జాకెట్ కి కలర్ మ్యాచ్ అవలేదు, అందుకే ఆ సంభంధం వద్దనుకున్నాము.>>

  పెళ్ళి కూతురు నాన్న నచ్చక మా అబ్బాయికి సంబంధం కుదరటం లేదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇది నిజంగానే జరిగింది నీహారిక గారు మాకు తెలిసిన వాళ్లింట్లో, పెళ్ళికూతురు అమ్మ చీర, బ్లౌజ్ మాచింగ్ కాలేదని.

   తొలగించండి
 5. పెళ్ళి విషయంలో ఏ కుటుంబం ఇష్టాలు ఆ కుటుంబానివనుకోండి. అయినా నాన్న బాగున్నాడా లేదా, అమ్మ మాచింగ్ చీరా జాకెట్ వేసుకుందా లేదా ... ఇవా మరీనూ?

  నేనొక ఉ.బో.స. ఇస్తున్నాను. పెళ్ళిచూపులకు వెళ్ళినప్పుడు ఇల్లు పరికించండి ఎంత శుభ్రంగా, పొందికగా పెట్టుకున్నారు అనే దృష్టితో. మిమ్మల్ని కూర్చోబెట్టిన హాలో, రూమో సర్దేసి ఉంచుతారు లెండి. అది కాదు, ఓవరాల్ గా చూడండి. దీనికో మార్గం ఉంది .... ఆడవాళ్ళకే చాతనవుతుంది. కాసేపయిన తరువాత ... వదిన గారూ మీ ఇల్లు చూపించరా ... అని అడగండి. ఆవిడ ఏం చెయ్యలేక మిమ్మల్ని ఇల్లంతా తిప్పి చూపిస్తారు (అని ఆశిద్దాం). అప్పుడు గమనించండి. అన్ని గదులూ చూడాలి, ముఖ్యంగా వంటింటిని. శుభ్రత విషయాల్లో సాధారణంగా తల్లినే ఫాలో అయిపోతుంటుంది అమ్మాయి. అందువల్ల తతిమ్మా సంగతులతో పాటు ఇది కూడా ఒక ఫాక్టరే (factor) ... అరేంజిడ్ మారేజెస్లో. All the best.

  మీ అబ్బాయికి ఒక సంబంధం చెప్పమంటారా? మీ వాళ్ళే. అమ్మాయి సాఫ్ట్-వేర్ ఉద్యోగిని.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. కోడలిని తెచ్చుకునేటపుడు తండ్రిని, అల్లుడిని తెచ్చుకునేటపుడు తల్లిని చూడాలటండీ(పాపం! నన్ను చూస్తే మావాడికి పెళ్ళవుతుందా అనిపిస్తుంది)
   ఈ పెళ్ళిసంబంధాల వల్ల కొత్త కొత్త సంగతులు తెలుస్తున్నాయి. మావారు బ్రాహ్మల అమ్మాయిని కూడా చూస్తున్నారు. బ్రాహ్మణులకి ధారణ శక్తి, కళల పట్ల ఆరాధన ఉంటాయనిట ! లలిత గారిలా మా శాఖకి చెందిన తండ్రి , బ్రాహ్మణ తల్లి కలిగి ఉన్న సంబంధం కూడా చూసారు.

   తొలగించండి
 6. ఆహా, మీ వర్గశతృవుల మీద మీవారికి మాత్రం సదభిప్రాయమే ఉన్నట్లుందే 👏.

  సరే, కోడలిని తెచ్చుకునేటప్పుడు ... తల్లిదండ్రులని చూడాల్సిందే అయితే ... ఆ అమ్మాయి సోదరులను (ఉంటే) ముఖ్యంగా గమనించాలి. రూపురేఖల కన్నా ప్రయోజకత్వం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ అమ్మాయినే మీవాడికి ఇచ్చి చేస్తే రేపు వారిద్దరికీ పుట్టే పిల్లలకు మేనమామ(ల) పోలికలు, బుద్ధులు అబ్బే అవకాశాలు మెండు కదా. అలాగే మీరు అల్లుడిని తెచ్చుకునే ప్రయత్నంలో అతని అక్కచెల్లెళ్లను (ఉంటే) చూడాలి (ఫ్యూచర్ మేనత్తలు కదా. పోలికలు రావచ్చు). అయినా ఇవన్నీ నా ఉబోసలు లెండి. మనం అనికున్నట్లు జరుగుతాయా? ఏదో మన ప్రయత్నం మనం చెయ్యడమే. ఏమైనప్పటికీ మన సమాజంలో పెళ్ళి ఇంకా ఒక లాటరీలాగానే ఉంది. Anyway all the best 👍.

  అన్నట్లు మీరన్న ఆ లలిత గారెవరండీ?

  వెంటనే జవాబు ఇవ్వలేకపోయాను ... టీవీ మీద ఆస్ట్రేలియన్ ఓపెన్ టెన్నిస్ మాచ్ వస్తుంటే చూస్తూ కూర్చుండి పోయాను .... మన పవన్ కుమారుడి ఊళ్ళోనే జరుగుతోంది. చివరికి సెమీఫైనల్లో యకోవిచ్ అనే రాక్షసుడు తన ఫ్రెంచ్ ప్రత్యర్థిని పాపం massacre చేస్తుంటే చూసి బాధ .. పడి .. లేచి, ఈ వ్యాఖ్య వ్రాస్తున్నాను. కాబట్టి ఆలశ్యం 🙁.

  రిప్లయితొలగించండి
 7. >>> ఆ లలిత గారెవరండీ?>>>>

  త్వామనురజామి చదువుతున్నారు కానీ శ్రద్ధగా చదవడం లేదన్నమాట ! మీకన్నా నేనే మంచి పాఠకురాలిని అన్నమాట ....గుర్తింపులేని జీవితం అయిపోయింది.

  రిప్లయితొలగించండి
 8. ఓహ్, ఐ సీ. వారా?
  మీరే “పాఠక సూపర్ స్టార్” 📚⭐️ లెండి.

  🦁

  రిప్లయితొలగించండి