రాయడం నాకు ఇష్టం, కానీ బుర్రలో ఉండే ఐడియాలన్నీ ఖాళీ అయిపోయాయి. కాబట్టి ఏం రాయాలో తట్టక ఎప్పుడో విన్న కథని నా రాతల్లో మీతో పంచుకుంటున్నాను. చాలా మంది వినే ఉండచ్చు, కాకపోతే మరో సారి చదవడం వల్ల వచ్చే నష్టం ఏమీ లేదనుకుంటాను. నాకు నచ్చిన కథలన్నీ ఒక చోటికి నా మాటల్లో చేర్చాలనే నా ఈ ప్రయత్నానికి ఇది తొలి మెట్టు. ఏదో ట్రై చేశాను, ఇది నాకు సెట్టవ్వదనుకుంటే మొహమాటపడకుండా చెప్పెయ్యండి, ఇలాంటి పోస్ట్లు రాయకుండా ఉండనని చెప్పను గానీ మరింత బాగా రాయడానికి ప్రయత్నిస్తాను.
ఇవాళ రాయబోతున్న ఈ చిన్ని కథ నాది కాదు, కానీ కథనం, రాతలు మాత్రం నావే.
ఇంటింటికి తిరిగి వస్తువులమ్మే హోవార్డ్ కెల్లీ అనే ఒక కుర్రాడు, ఆ రోజు ఒక్క వస్తువు కూడా అమ్ముడుకాకపోవడంతో నిరాశగా ఉన్నాడు. మధ్యాన్నం కూడా దాటటంతో కడుపులో ఆకలి పెరిగిపోయింది, జేబు తడిమి చూసుకుంటే అందులో ఒక పెన్నీ (సెంట్ కాయిన్) మాత్రమే ఉంది. కడుపులో ఏదో ఒకటి పడితే గానీ అడుగు కూడా ముందుకు వేయలేను అనిపించింది.
పక్కన ఉండే ఇంటి డోర్ తట్టాడు. ఒక యువతి తలుపు తీసి ఇప్పుడు మేము ఏ వస్తువులు కొనదలచు కోలేదు, వెళ్ళమని అంది.
ఆకలిగా ఉంది, ఏదైనా ఆహారం ఇవ్వగలరా అని అడగబోయి తన దగ్గర ఉన్న పెన్నీకి అది రాదని మొహమాటపడి, ఒక గ్లాస్ మంచి నీళ్లివ్వగలరా అని అడిగాడు.
అలాగే అని లోపలికెళ్లిన యువతి గ్లాస్ తో తిరిగొచ్చింది.
గ్లాస్ అందుకొని చూస్తే అందులో నీళ్ల బదులు పాలు ఉండటం గమనించి ఆమె వైపు చూశాడు.
"నువ్వు ఆకలితో ఉన్నావని అర్థమవుతోంది, ఇంట్లో ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి" అంది ఆ యువతి అంతకు మించి సహాయం చేయలేని నిస్సహాయతకు సిగ్గుపడి.
అతను తన జేబు లోంచి పెన్నీ ఇవ్వబోతే, ఆవిడ పుచ్చుకోవడానికి ఒప్పుకోలేదు.
స్వచ్ఛమైన ఆ యువతి మంచితనానికి ఆ పాలే కాక, అతని కనుపాపల వెనుక ఉబికిన కన్నీళ్లూ సాక్ష్యమయ్యాయి.
ఆ యువతి కి కృతజ్ఞతలు తెలిపి బయలుదేరాడు.
పాలతో కాస్త ఆకలి బాధ తగ్గడం వల్ల, సాయంత్రం లోపు ఇంకొన్ని ఇళ్లకు తిరిగి ఏదో ఒక వస్తువు అమ్మగలననే నమ్మకం పెరిగింది దానితో పాటు మనుషుల మీద నమ్మకం కూడా.
*************************************
కొన్నేళ్ళకు, మంచి వాళ్ళకే కష్టాలు ఎదురవుతాయి అన్న అపోహను మరోసారి బలపరుస్తూ తీవ్రమైన జబ్బుతో ఆసుపత్రి పాలయ్యింది ఆ గ్లాస్ పాలు ఇచ్చిన ఆవిడ.
తనుండే ఊరిలోని హాస్పిటల్ వాళ్ళు చేతులెత్తెయ్యడంతో పక్కనుండే సిటీ లోని పెద్ద హాస్పిటల్ లో నయం చేస్తారు అనే ఆశతో అక్కడికి వెళ్ళింది.
ఆ డాక్టర్ ఆవిడకు అన్ని పరీక్షలు చేసి నయం అవడానికి కొన్ని రోజులు హాస్పిటల్ లో జాయిన్ అవ్వమన్నాడు.
అతని ట్రీట్మెంట్ ఫలించి కొన్ని రోజులకే ఆవిడ జబ్బు నయమైంది.
ఆవిడ డిశ్చార్జ్ అయ్యే రోజు రానే వచ్చింది, ఆ రోజు ఉదయం లేచి కిటికీ తలుపులు తెరవగానే బయటి నుంచి వచ్చిన గాలికి టేబుల్ మీదున్న పేపర్ యెగిరి కింద పడింది.
ఆ పేపర్ చూడగానే అర్థం అయ్యింది అది తాను చెల్లించాల్సిన బిల్ అని. అది తన తాహతుకు మించిన బిల్ అయి ఉంటుంది అని ముందే ఊహించడం వల్ల వణుకుతున్న చేతులతో ఆ బిల్ ను తెరచి చూసింది .
'మీరు ఆరోజు ఇచ్చిన గ్లాస్ పాలకు ఈ బిల్లుకు చెల్లు - డాక్టర్ హోవార్డ్ కెల్లీ' అని రాసి ఉన్న ఆ బిల్లు, చేసిన సహాయం ఊరికే పోదు అన్న నిజాన్ని మరో సారి రుజువు చేసింది.
ఆ బిల్ టేబుల్ పై ఉంచి డాక్టర్ కు కృతజ్ఞతలు తెలపడానికి రూమ్ బయటికి వెళ్ళింది ఆవిడ.
ఈ సారి కిటికీ నుంచి గాలి మళ్ళీ వీచింది కానీ కన్నీటితో తడిచి బరువెక్కిన ఆ బిల్లును కదిలించలేక పోయింది.
పైన చెప్పిన కథ Dr. Howard Kelly (1858-1943) జీవితంలో జరిగిన సంఘటన అని అంటారు కానీ నిజంగా జరిగిందో లేదో కరెక్ట్ గా తెలియదు. అందరి డాక్టర్స్ లాగానే ఇతను కూడా ఫీజులు బాగా ఛార్జ్ చేసేవారని అంటారు. కాకపోతే అతని ఫ్రెండ్ అయిన Audrey Davis ప్రకారం కొందరికి ఫ్రీ గానే ట్రీట్మెంట్ చేసేవారట.
ఇంటర్వల్ సీన్ కి బ్యాక్ గ్రౌండ్ సాంగ్.."అపురూపమైనదమ్మ ఆడ జన్మ..."
రిప్లయితొలగించండిక్లైమాక్స్ కి "రాజువయ్య... మహారాజువయ్యా.."
భలే సూర్య గారు. కరెక్ట్ సాంగ్స్ background కి
తొలగించండిఆరోగ్యశ్రీ బాగుందండీ !
రిప్లయితొలగించండిThanks నీహారిక గారు, మంచి టైటిల్ కథకి ఆరోగ్యశ్రీ
తొలగించండిఆసక్తికరమైన కథ వినిపించారు, థాంక్స్ పవన్. Inspirational story గా పనికొచ్చే కథ అనచ్చు. మీ పోస్ట్ చదివిన తరువాత గూగూల్ లో వెతికాను .... Dr Howard Kelly గురించి నేనింతకు ముందు వినుండకపోవడం వలన.
రిప్లయితొలగించండిఆయన సంపన్న కుటుంబంలో పుట్టిన వాడనీ, ఇంటింటికీ తిరిగి వస్తువులమ్ముకోవలసిన అగత్యం లేని వాడనీ, hiking, nature అంటే ఇష్టమనీ, అలా ఒకసారి hiking లో దాహం వేసి ఒక farmhouse దగ్గర ఆగి మంచినీళ్ళడిగాడనీ, నీళ్ళ బదులు ఆ ఇంటి అమ్మాయి పాలు ఇచ్చిందనీ .... కాబట్టి partly true అనీ ఒకకథ. ఈ క్రింది లింక్ చూడండి.
"Dr Howard Kelly and the Glass of Milk"
Thanks for liking మేష్టారు, కొన్ని చోట్ల అతను పూర్ అని రాశారు, నిజా నిజాలు మనకు అనవసరం అనుకుంటా. మీ investigation బాగుంది.
తొలగించండిhttps://www.truthorfiction.com/amp/oneglassofmilk/
ఈ కధ వాట్సప్ లో చదివిన గుర్తు. ఇందులో నిజా నిజాలను పక్కన పెడితే ఆహ్లాదకరమైన కధ. ఇలాంటివి చదివినపుడు మానవత్వం మీద నమ్మకం పెరుగుతుంది. ...... మహా
రిప్లయితొలగించండిమీరన్నది నిజమే సుబ్రమణ్యం గారు, మంచి కథ అనిపించే అందరికీ తెలియ జెద్దాం అని రాశాను
తొలగించండి"నిజానిజాలు మనకు అనవసరం" అనుకోలేం కదా పవన్ . బహుశః అలా అనుకోవడం వల్లనేనేమో ఈ నాడు సోషల్ మీడియా ఇంత విచ్చలవిడితనంగా తయారయింది, నిజమైన కథలకు కూడా విశ్వసనీయత దెబ్బ తినే ప్రమాదం పెరుగుతోంది, చాలా సార్లు 'ఇంటర్నెట్ జ్ఞానం' అని జనాలు కొట్టిపారెయ్యడమూ జరుగుతోంది.
రిప్లయితొలగించండినా ఇన్వెస్టిగేషన్ను మెచ్చుకున్నందుకు థాంక్స్. ఇన్వెస్టిగేషన్ వివరాలు మరి కొన్ని ఈ క్రింద .... ఎందుకంటే చర్చను సాగదీసే ఉద్దేశం లేదు గానీ , అసలే ప్రతిదానికీ నిజనిర్థారణ కమిటీలు పరిపాటయిపోతున్న ఈ కాలంలో అలా వదిలేలెయ్యం గదా 😀😀?
సరే, నా మొదటి వ్యాఖ్య యొక్క సారాంశం .... ఆ డాక్టర్ గారు తన చిన్నతనంలో కూడా పేదవాడు కాదనీ, కలిగిన కుటుంబానికి చెందిన వాడేననీ చెప్పడం వరకు మాత్రమే. వికీ లింక్ ఈ క్రింద ఇచ్చాను (వికీ కూడా పూర్తిగా నమ్మబుల్ కాదంటారనుకోండి. కానీ ఊహాగానాల కన్నా కాస్త నయం కదా 🙂). "Early life and education" అనే section చూడండి. కెల్లీ గారి కుటుంబం రాజకీయ రంగం, సివిల్ సర్వీస్, వ్యాపార రంగాల్లో రాణించిందని తెలుస్తుంది.
మీరిచ్చిన లింక్ లో కూడా ఆయన బీదవాడు అని ఆన్-లైన్ లో అంటున్నారు అని మొదటి పేరాలో eRumour అనే అన్నారు. తరువాత పేరాలో biographer Audrey Davis గారు కెల్లీ గారు డాక్టర్ గా హైకింగ్ చేసినప్పుడు జరిగిన గ్లాసుడు పాల యథార్థ సంఘటన గురించి వివరించారు. డేవిస్ గారు చెప్పిన దాని ప్రకారం కెల్లీ గారు అప్పటికే డాక్టర్. అందులోనూ University of Pennsylvania లాంటి ప్రఖ్యాత university లో చదువుకున్నవాడు, ప్రసిద్ధ Johns Hopkins Medical University వ్యవస్థాపనకు దోహదం చేసినవారులో ఒకరు.
కాబట్టి బీదవాడు కాదు అనీ, డాక్టరయిన తరువాతే ఈ పాల సంఘటన జరిగిందనీ, door-to-door salesman లాంటి బీదవాడు ఏనాడూ కాదనీ తెలుస్తోంది ☝.
మన పాత కథలలో తరచుగా "అనగనగనగా ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు" అంటారు చూశారా, అలా ఉంది కెల్లీ గారి మీద ఆన్-లైన్ rumour కథ .... అదీ గాక తరువాత కాలంలో మంచిపని చేశాడంటే పూర్వాశ్రమంలో బీదవాడు అయ్యుండాలి అన్నట్టుంది 🙂 .
అఫ్కోర్స్ గ్లాసుడు పాలు, హాస్పిటల్ బిల్ అయితే వాస్తవాలేనని అన్ని వెర్షన్స్ చెబుతున్నదే ☝️.
ఏమైనప్పటికీ బులుసు వారన్నట్లు "ఆహ్లాదకరమైన కథ" నిస్సందేహంగా 👌. నేను కూడా అన్నానుగా inspiration ఇవ్వగలిగే కథ అని. అయితే ఘనత వహించిన మా కార్పొరేట్ హాస్పిటల్స్ ఈ కథ నుండి ఏమాత్రం స్ఫూర్తి పొందుతాయి, అసలు ఈ కథను చదవనైనా చదువుతారా, చదివినా కెల్లీ ఒక వెర్రిబాగులవాడు అని నవ్వుకుంటారా ....... నాకయితే తెల్వద్ మరి 🙏
Dr Howard Kelly background
చప్పట్లు మీకు మేష్టారు, ఓపిగ్గా సేకరించిన సమాచారాన్ని పంచినందుకు.
తొలగించండిఇక స్ఫూర్తి అంటారా, కొందరు మంచి డాక్టర్స్ ఉన్నట్లు ఉన్నారు, మొన్నా మధ్య టీవీ లో చూసినట్లు గుర్తు, ఆయన చనిపోతే జనాలు ఆయన్ని చూడ్డానికి క్యూ కట్టినట్లు.
కార్పొరేట్ హాస్పిటల్స్ లో అయినా చేతికి ఎముకలేని దానం లా, వెళ్లుల్లి వెయ్యని ఆవకాయలా డబ్బుల్లేకుండా అందరికీ చెయ్యటం మొదలుపెడితే పైకథ మొదట్లోని హీరోలా మిగిలిపోతారు.అయితే కొన్నిసార్లు కార్పొరేట్ హాస్పిటల్స్ కూడా మానవత్వం చూపిస్తుంటాయి.
తొలగించండిమీరు కథ చెప్పిన తీరు బావుంది. ఇంకాఇంకా రాస్తూ వుండండి - ఊ కొడుతూ చదువుకుంటూ వుంటాం :)
రిప్లయితొలగించండిThanks for the encouragement Lalitha gaaru.
తొలగించండిపవన్ గారు, నాది లలిత గారి మాటే. మాగురువుగారు చెప్పిన్నట్టు, ఒక్కొక్కరిది ఒక్కొక్క శైలి. అందువల్ల పాఠకులకి తెలిసిన విషయమైనా, తెలియనిదైన మీశైలిలో మీరు దర్జాగా, చక్కగా వ్రాయవచ్చు. మాలాంటి వాళ్ళము ఉత్సాహపడి చదువుకొంటాము.
రిప్లయితొలగించండిమీ ప్రోత్సాహానికి ధన్యవాదాలు అన్యగామి గారు. అయితే రాస్తూ ఉంటాను.
తొలగించండి