18, అక్టోబర్ 2019, శుక్రవారం

పూరీ జగన్నాథ్, నీకో దండం సామీ!

ఒక్కో సారి మన టైం బాలేనప్పుడు, కోరి తలనొప్పి తెచ్చుకునే పనులు చేస్తుంటాం. అలాంటి ఒక బాడ్ టైం లో మొన్నొక రోజు 'ఇస్మార్ట్ శంకర్' అనబడే హిట్ సినిమా చూశా.  

ఇంట్రడక్షన్ సీన్ లోనే ఒక పది మంది పోలీసుల బొక్కలు ఇరగ్గొడుతూ మధ్య మధ్య లో తెచ్చి పెట్టుకున్న తెలంగాణా స్లాంగ్ తో మన చెవులకు తూట్లు పొడుస్తాడు ఇస్మార్ట్ శంకర్ అనబడే మన ఎనర్జిటిక్ హీరో రామ్

గిట్ల ఫైట్ అవ్వంగానే ఒక పాట షురూ, ఆ తర్వాత హీరోయిన్ ఇంట్రడక్షన్ మళ్ళీ తెచ్చి పెట్టుకున్న తెలంగాణా స్లాంగ్ తో ఈవిడ కూడా మన చెవులకు తూట్లు పొడుస్తూ. 

ఒక రెండు సీన్స్ అయిపోగానే నిన్ను రేప్ జేస్తా అంటూ హీరోయిన్ యెంట బడి ఆమె ఇంట్లోకి దూరి చండాలం చేస్తడు మన ఇస్మార్ట్ శంకర్. అప్పటికే హీరోయిన్ పరిగెత్తుతూ పోలీస్ లకి ఫోన్ చేస్తది ఎవడో నన్ను తరుముతోండు అని. ఇగ పోలీసులు వచ్చి హీరోయిన్ ఇంటి తలుపు కొట్టగానే  'ఇంగ మీకు ఈడ పని లేదు, ఈడు నాకు శానా నచ్చిండు, మీరు ఎల్లిపొండి' అంటది హీరోయిన్ గుంట. 

ఇంత అద్భుతమైన లవ్ స్టోరీ చూశాక పూరి జగన్నాధ్ క్రియేటివిటీ కి స్టన్ అవకుండా ఉండలేం మరి. ఇంగేమ్ జెయ్యలేం, ఈ జనరేషన్ ల లవ్ ఇంతే ఫాస్ట్ గ షురూ అవుతాది అని మనం అనుకోవాలె. 

ఇంగ ఆ తర్వాత రెండు మూడు గన్ ఫైర్స్ జరుగుతయ్ అందుల హీరోయిన్ ఛస్తది. హీరోని పోలీసులు జైలుకి పట్టుకెళ్తారు, నన్నెవరు జైలుకు పంపించిండ్రో ఆళ్లనొదల అని హీరోతో అనిపించి సినిమాకి పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ అంటూ కలరింగ్ ఇస్తాడు.  

మళ్ళీ రెండు మూడు గన్ ఫైర్స్, ఒక సిబిఐ ఆఫీసర్ జస్తడు , హీరో గాయపడ్తడు. ఇంగ ఇప్పుడు 'క్రిమినల్' అనే ఇంగ్లీష్ సినిమా నుంచి కొట్టుకొచ్చిన Face/off కాన్సెప్ట్ లాగా Brain/off  కాన్సెప్ట్ ఇందులో ఇరికించి సినిమాకి సైన్స్ ఫిక్షన్ లాంటి కలరింగ్ ఇస్తాడు. 

ఇక్కడ CBI డిపార్ట్మెంట్ హెడ్ అయిన షాయాజీ షిండే 'ఆడి బ్రెయిన్ తీసి ఈడికి పెట్టెయ్' అంటాడు రెండో హీరోయిన్ తో.  అదేదో వాడి హ్యాట్ తీసి వీడికి పెట్టు లేదంటే వాడి కిడ్నీ తీసి వీడికి పెట్టు అన్నంత సింపుల్ గా. (ఏ మాటకామాట చెప్పుకోవాలి నాకెందుకో ఈ షాయాజీ షిండే తెలుగులో చెప్పే డైలాగ్స్ వింటే తెలుగు మీద ఉండే ఆ కాస్త అభిమానం కూడా చచ్చిపోతుంది.)

ఇంక ఆ బ్రెయిన్ మార్చేశాక మనోడు అపరిచితుడు టైపులో అటూ ఇటూ మారిపోతుంటాడు కాసేపు ఇంగ్లీష్, కాసేపు తెలంగాణా లాంగ్వేజ్ మాట్లాడుతూ. (మీరు నన్నో వింత జీవిని చూసినట్లు చూస్తారని తెలుసు గానీ ఆ అపరిచితుడు సినిమా కూడా నాకు నచ్చలేదు అది వేరే విషయం) 

మళ్ళీ కొన్ని గన్ ఫైర్స్ జరిగాక అసలైన సస్పెన్స్ (అసలైన విలన్ ఎవరో సినిమా మొదట్లోనే మనకు తెలిసిపోతుంది అనుకోండి)   క్లైమాక్స్ లో బయట పెడతారు. ఆ తర్వాత ఒక భీభత్సమైన ఫైట్, అది అయిపోగానే శుభం కార్డు పడే ఉంటుంది అనుకుంటా. (T.V స్విచ్ ఆఫ్ చేశాను అప్పటికే ఓపిక నశించి) 

ఈ సినిమాలో ఏదో నచ్చే ఉంటుంది కాబట్టే జనాలకు బాగా నచ్చి హిట్ అయిందనుకుంటా. లేదంటే ఇంతకు ముందు పూరి జగన్ తీసిన సినిమాల మీద ఇది కాస్త బాగుంది ఉండచ్చు కాబోలు. 

ఏది ఏమైతేనేం ఇంత మందికి నచ్చిన ఈ సినిమా మరి నాకెందుకు నచ్చలేదు? మీలో ఎవరికైనా నచ్చింటే కాస్త మీ మైండ్ నాకు అరువివ్వండి అది నేను పెట్టుకొని సినిమా చూస్తా. అప్పుడు నచ్చుతుందేమో. 

ఇదే వారం లో చల్తే చల్తే, వినరా సోదరా వీర కుమారా అనే రెండు తెలుగు సినిమాలు చూశాను. ఈ సినిమాలు బాగున్నాయి అని చెప్పను కానీ పైన చెప్పిన సినిమా కంటే కొంతలో కొంత బెటర్. కాకపోతే ఇవి రిలీజ్ అయ్యాయి అని కూడా చాలా మందికి తెలీదు కాబట్టి  ఎంతమంది థియేటర్ కెళ్ళి చూస్తారు అనేదే డౌట్ అందుకే ఇవి యు ట్యూబ్ సినిమాలుగానే మిగిలి పోతున్నాయి. 


మాములుగా హిందీ సినిమాలు అంటే నాకు పెద్దగా నచ్చవు కాకపోతే ఈ మధ్య కాలంలో చూసిన సినిమాల్లో 'మిషన్ మంగళ్' నచ్చింది.  

P.S: నేను కూడా కాస్త తెచ్చి పెట్టుకున్న తెలంగాణా భాష ఉపయోగించాను, బాగా తప్పులుంటాయి వీలయితే సరిచేయండి లేదంటే మన్నించండి. 

30 కామెంట్‌లు:

 1. అప్రైసల్ పరంపరలో ఇంకో పిట్టకథ.

  సుబ్బారావు భార్య చపాతీ డైరెక్టర్ అభిమాని. అనిల్ రెండు "ఇస్మార్ట్ కంకర్" సినిమా టికెట్లు కొని ఆవిడకు (dear Bhabhiji, with best compliments from Anil అని రాసిమరీ) పంపించాడు. బొమ్మ చూస్తున్నంత సేపూ సుబ్బారావు కంకర్ రాళ్లు నముల్తున్నట్టు ఇబ్బంది పడి మరుసటి రోజు ఆఫీసుకు రాగానే అనిల్, నా కాబిన్ రా అని పిల్చాడు. అనిల్ రాగానే "జన్మలో ఇంకోసారి నీ అప్రైసల్ విషయంలో ఎక్కువతక్కువ నీల్గను, నా సొంత ఇన్సెంటివ్ తగ్గించుకొనయినా నీకు మంచి ఇంక్రిమెంట్ ఇస్తాను" అంటూ బతిమాలసాగాడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ appraisal కిటుకు బాగుంది జై గారూ, వర్కవుట్ అవ్వచ్చు

   తొలగించండి
  2. వర్కౌట్ అయితే నా కమిషన్ మరవకండి. బెడిసికొడితే మాత్రం నా పూచీ లేదు!

   తొలగించండి
 2. "Thank you Puri Jagannadh" అనుకోలేదా(అతని ప్రతి సినిమా చివర్లో తనే వేసుకున్నట్లుగా) ? అయినా ... ఏ సినిమా చూసినా ఏమున్నది గర్వకారణం ... అనుకోండి, మనశ్శాంతిగా ఉంటుంది.

  తెలంగాణా భాష బాగానే ప్రయత్నించారే? "గుంట" (ఎక్కువగా కళింగాంధ్రా మాండలికం) బదులు "పోరి" (తెలంగాణా మాండలికం) అనాలేమో? Anyway ఈ భాష విషయంలో మీకు పూర్తి certificate జై గొట్టిముక్కల గారు ఇస్తారులెండి.

  సరే, ఈ ఘన నక్షత్రాలు, సూపర్ నక్షత్రాలు, సామ్రాట్టులు, రత్నాలు, ఎక్కడికీ పోరండీ. వయసుడిగి పోయినా కూడా వీలయినంత కాలం వాళ్ళే దున్నుతారు, తరువాత వాళ్ళ సంతతి, బంధువులు ఏలుతారు. మన గతి ఇంతే.

  గత రెండు టపాల్లోను బరువైన టాపిక్కుల గురీంచి మాట్లాడుకున్నారు కదా మీరంతా. కాస్త change కోసం ... మన gross and senseless సినిమాలకన్నా మనోరంజకంగా, వినోదభరితంగా ఉండే ప్రోగ్రాం ఒకటి సూచిస్తాను. దాని పేరు "What's My Line". 1950 నుండీ 1967 వరకు 17 సంవత్సరాలు బహుళ జనాదరణ పొందుతూ అమెరికాలో సాగిన వారాంతపు అర్ధగంట టీవీ షో ట. నలుగురు ప్రముఖులతో కూడిన ఒక పానెల్ కూర్చుంటుంది. ఒక ఆహ్వానిత సామాన్య వ్యక్తి వచ్చి ఏంకర్ ప్రక్కన కూర్చుంటారు. ఆ గెస్ట్ యొక్క వృత్తి ఏమిటో ఈ పానెల్ వారు కనిపెట్టాలి. YES or NO అనే సమాధానానికి వీలున్న ప్రశ్నలు మాత్రమే వేసి అలా వచ్చిన సమాచారాన్ని ఉపయోగించుకుని చెప్పాలి. సెలెబ్రిటీ పిచ్చితో (మన టీవీలో లాగా కాకుండా) షో మొత్తం నింపెయ్యకుండా దీనిలో అధిక భాగం సాధారణ వ్యక్తులను ఇంటర్వ్యూ చెయ్యడం విశేషం. ప్రతి షోలోనూ ఒక సెలెబ్రిటీని కూడా పిలిచేవారు (ఎంతసేపూ సినిమా స్టార్లే కాక ... ఆటగాళ్ళు, రచయితలు, పెయింటర్లు, రాష్ట్ర గవర్నర్లు, సెనెటర్లు, ప్రెసిడెంట్ గారి భార్య, వైట్ హౌస్ సిబ్బందిలోని కొంతమంది ఉద్యోగులు, వగైరా వగైరా). ఇక్కడ మాత్రం పానెల్ వారు చెయ్యవలసినది ఆ సెలెబ్రిటీ ఎవరో కనిపెట్టడం. చూస్తే మీకే అర్ధమవుతుంది. ఒకసారి చూస్తే మాత్రం క్రమేపీ మొత్తం అన్ని episodes చూడకుండా వదిలిపెట్టరు. ప్రయత్నించండి. Youtube లో దొరుకుతుంది. మీకు starting కోసం ఒక (1962) షో లింక్ ఇక్కడ ఇచ్చాను. ఈ ఎపిసోడ్ లో Sir Edmund Hillary (టెంజింగ్ నార్కే తో కలిసి ఎవరెస్ట్ ఎక్కిన మొదటి వ్యక్తి). ఒక ఎపిసోడ్ తెరిస్తే ప్రక్కన బార్ లో ఇతర ఎపిసోడ్స్ లిస్ట్ కూడా వస్తూ ఉంటుంది లెండి, లేదా సెర్చ్ చెయ్యవచ్చు.

  మీకు వారాంతం మొదలయిందిగా ... ఒకటి రెండన్నా చూడడానికి ప్రయత్నించండి (ఇంట్లో బూజులు దులపడాలు, లాన్ కత్తిరించడాలు, బట్టలు ఉతకడాలు ... వగైరా వారంతపు పనులతో బాటు ఇది కూడా అన్నమాట :) :) ).

  పవనే కాదు, ఇతర బ్లాగర్లు, పాఠకులు కూడా చూసి ఆనందించవచ్చు.

  Wish you a happy and enjoyable viewing.

  What's My Line (a TV show)

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. విన్నకోట వారూ, తెలంగాణా భాష యాసలు సినిమాలు చూస్తే రావండీ. కోటా శ్రీనివాసరావు, తనికెళ్ళ భరణి, ఉత్తేజ్ వగైరాల తలతిక్క బాగోతాలు Chicken Manchurianతో (so called Chinese cuisine that no one has heard of in China) సమానం.

   కాదూ కూడదూ బొమ్మలు చూసే నేర్చుకుంటాను అని భీష్మిస్తే మా భూమి, బతుకమ్మ లేదా మల్లేశం సినిమాలు చూడండి: పూర్తిగా authentic కాకున్నా 50% ఒకే.

   మనలో మాట: తెలంగాణా భాష కోసం కాకపోయినా మల్లేశం చూడదగ్గ చక్కని చిత్రం. ఇటీవలి కాలంలో నేను టీవీ/విమానంలో కాక థియేటర్ వెళ్లి చూసిన ఏకైక సినిమా. భారత సాంప్రదాయ బీసీ ఇంజనీరింగ్!

   తొలగించండి
 3. పూరీ జగన్నాథ్ సినిమాలలో హీరోయన్లను అవమాన కరంగా జుగప్సాకరమైన విధంగా చూపిస్తాడు. అయితే కొన్ని సీన్లు మాత్రం నిజాయితీగా తీస్తాడు.

  సాయాజి షిండే తెలుగు ఉచ్చారణ ఇబ్బంది పెట్టినా మంచి నటుడు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఈ జుగుప్సాకరంగా అనేది మన దర్శకేంద్రుడు ఆపైన ఈ.వి.వి సత్యనారాయణ గారు మొదలెట్టిన ట్రెండ్ అనుకుంటా.

   తొలగించండి
  2. అందులో సందేహమేముంది. ఒక "ఐడియా" జీవితాన్నే మార్చేస్తుంది అన్నట్లు.

   తొలగించండి
  3. అవునూ పవన్, నేనిచ్చిన What's My Line? లింక్ చూశారా అసలు? చూస్తే మీ అభిప్రాయం ఏమిటి?

   తొలగించండి
  4. వారాంతపు పనులు ఇంకా పూర్తి కాలేదు మేష్టారు☹️, అవి పూర్తి అయితే ఈ weekend లేదంటే వీక్డేస్ లో చూస్తాను. లింక్ ఇచ్చినందుకు ధన్యవాదాలు.

   తొలగించండి
 4. అయితే Chicken Manchuria authentic Chinese వంటకం కాదంటారా, జై గారూ? మీరు చైనా గినా వెళ్ళొచ్చారా ఏమిటి?

  పాపం, కోట శ్రీనివాస రావు, తనికెళ్ళ భరణి తమకు తెలంగాణా యాస మీద పట్టు ఉందని మురిసిపోతుంటారే, మీరేమిటి అలా తీసి పారేశారు? ఆ యాసను సాధన చేసుకోవడానికి కూడా ముల్కీ అయ్యుండాలి అనేట్లున్నారే మీరు మరీ :)? అవునూ, ఉత్తేజ్ ని కూడా ఆ జాబితాలో వేసేసారేమిటి మీరు, అతను ఫక్తు తెలంగాణా మనిషే కదా? ఏమిటో, మీ బెంచ్ మార్కులు, మరీ IT కంపనీల్లో మేనేజర్లు చేసే appraisal లాగా ఉన్నాయి :) :).

  seriously ... "చింతకింది మల్లేశం" సినిమా విడుదల ముందు నుండీ కూడా తప్పక చూడాలి అనుకునేవాడిని (ఇప్పటికీ కూడా). కానీ అదేవిటో prime లో గానీ, Netflix లో గాని, Youtube లో గాని దొరకడమే లేదు. నేను థియేటర్ కు వెళ్ళనని గతంలోనే చెప్పుకున్నాను కదా. ఈ చిత్రాన్ని ఎలా పట్టుకోవాలో తెలియడం లేదు. మీరేమన్నా మార్గం సూచించగలరా? or link?

  btw, అలనాటి "మాభూమి" చిత్రంలో హీరోగా నటించిన త్రిపురనేని సాయినాధ్ ఆంధ్రుడు అండోయ్ :) Just for your information, హ హ :) :). ప్రఖ్యాత కవి, సంస్కర్త, లాయర్ "కవిరాజు" త్రిపురనేని రామస్వామి గారి మనవడు. స్వస్ధలం మా ఊరేనండోయ్ :). సాయినాధ్ ఈ మధ్య "ఫిదా" చిత్రంలో హీరోయిన్ తండ్రి పాత్రలో కనిపించాడు. రామస్వామి గారి మరొక మనవడు అనిల్ అట్లూరి కూడా ఒక బ్లాగర్.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. Isn"t this a bark before a dogmatist?
   (No offence/s meant. Reality based fun)

   తొలగించండి
  2. sorry for the word 'fun' -
   may please be read as 'wit'

   తొలగించండి
  3. నరసింహా రావు గారు, జై గారు ఎంతైనా manager కదా అలానే ఉంటాయి వారి బెంచ్ మార్క్ 😀

   తొలగించండి
  4. ఇక్కడ anonymous గారు తిడుతున్నారా ఏమిటి అర్థం కాలేదు అసలే తెలుగు మీడియం చదువులు ఇక్కడ.

   తొలగించండి
  5. విన్నకోట వారూ, నేను "mainland" చైనా ఎప్పుడూ వెళ్ళలేదు కానీ ఎన్నో దేశాలలో (కొన్ని సార్లు చైనా/చైనీస్ మూలాల మిత్రులతో కలిసి వాళ్ళు రికమెండ్ చేసిన) authentic Chinese restaurants వెళ్లాను. ఎక్కడా మెనూలో చికెన్ మంచూరియా తరహా వంటకాలు చూడలేదు. అమెరికాలో భారత మూలాల వారు తమ చిన్నప్పుడు మనదేశంలో అలవాటు పడ్డ "చైనీస్ ఫుడ్" కోసం కొన్ని "Indian Chinese restaurants" (note: *not* Indo-China, this term carries a different meaning) పోషిస్తూ ఉంటారు. వాటికి మనోళ్లే తప్ప ఇంకెవరూ వెళ్ళరు.

   తెలంగాణా (లేదా ఇంకేదయినా) భాష యాసలు "ముల్కీలకే" వస్తుందని నేను అనలేదు & అనుకోను. ఎవరయినా (ముఖ్యంగా immersion methods ద్వారా) నేర్చుకుంటే బ్రహ్మాండంగా వాడగలరు. కేవలం "ఫక్తు తెలంగాణా" అయినంత మాత్రాన భాషయాసలు అబ్బాలని/అబ్బినా నిలవాలని కూడా రూలు లేదు: ఉత్తేజ్ ఒక్కడే కాదు ఇంకెందరో ఇందుకు నిదర్శన.

   త్రిపురనేని రామస్వామి చౌదరి మనవడు సాయిచంద్ & తనికెళ్ళ భరణి ఇద్దరూ నాకు వ్యక్తిగతంగా (కొద్దిగానేలెండి) తెలుసును. ఫిదా సినిమా భాషకు "తెలంగాణా సర్టిఫికెట్" ఇవ్వడం సరికాదనేదే నా అభిప్రాయం.

   IMHO బిత్తిరి సత్తి ముందు కోటా, తనికెళ్ళ, శ్రీహరి, రాం రెడ్డి, ఉత్తేజ్, సాయిచంద్ అందరూ బలాదూర్ (భాష యాసల విషయంలో)

   మల్లేశం సినిమా ఇంకా అంతర్జాలంలో వచ్చినట్టు లేదు. సమయం కుదిరితే బతుకమ్మ చూడండి. గమనిక: ఇది కొంతవరకు "ఎర్ర" సినిమా, రాజకీయాలు పక్కన బెట్టి చూడాలని మనవి.

   https://www.youtube.com/watch?v=lZcbbjFn40E

   రాయలసీమ భాష యాసలంటూ సినిమాలలో హడావుడి చేసే విషయంలో కూడా నా అభిప్రాయం దాదాపు ఇంతే. జయప్రకాష్ రెడ్డి ఒక్కడే కాస్త గుడ్డిలో మెల్ల.

   తొలగించండి
  6. Indo-China అని దేనిని అంటారో తెలుసు గానీ, ఏమిటోనండీ "చైనీస్ ఫుడ్" మన దేశంలో పెట్టెబండి వాళ్ళ దగ్గర కూడా దొరుకుతుందని వాళ్ళ పెట్టె మీద వ్రాసుకుంటారు 😀. Chinese restaurant కి వెడితే గిడితే‌ వెజ్ ఫ్రైడ్ రైస్ గానీ నూడుల్స్ గానీ మాత్రమే తినే నా
   బోటి వాడికి ఆ తతిమ్మా రకాలు తెలియవు లెండి.

   అదేమిటండీ "ఫిదా" గురించి అంత మాట అనేశారు? తెలంగాణా భాష సినిమా అంటూ ప్రియతమ కేసీయార్ గారు ప్రత్యేక షో వేయించుకుని చూసి మెచ్చుకున్నారట కూడానూ. హేవిటో మీ అంచనాలు!🙁

   "బతుకమ్మ" సినిమా చూసినదేనండి. "మల్లేశం" సినిమా చూడ్డానికి (ఆన్-లైన్ లో) వెయిటింగ్.

   తొలగించండి
  7. గురువు గారూ, కెసిఆర్ ఫిదా సినిమా చూసి ఫిదా ఐపోయి "తెలంగాణా భాష" సర్టిఫికెట్ ఇస్తే అది అతని ఇష్టం లేదా అవసరం. నాకయితే అధిక హింస/వల్గారిటీ లేవు కనుక సినిమాపరంగా ఫరవాలేదు తప్ప నేటివిటీ మాత్రం కనిపించలేదు.

   కుబుసం (ఇదీ ఎర్ర/ఎర్రి పైత్యం చిత్రమే) సినిమాలో కొన్ని డయలాగులు/పాటలు (శ్రీహరి/తనికెళ్ళ పాత్రలవి కాదు) చక్కటి అచ్చ తెలంగాణా భాషలో ఉంటాయి. ఉ. ఒక పాటలో "కంటికి దూరం కాలికి దగ్గర" అనే నానుడి వాడారు. చిత్రీకరణ అంత బాలేకపోయినా గోరేటి వెంకన్న రాసిన "పల్లె కన్నీరు పెడుతుంది" పాటలో కొంతభాగం పొందు పరచడం కూడా ఒక హైలైట్.

   https://www.youtube.com/watch?v=UZGwNmFCXxU

   తొలగించండి
 5. భాషా మాండలికాలు ఏ ప్రాంతం వైనా సరే అతిగా ఉపయోగిస్తే నాకు నచ్చదు. పత్రికలు స్థిరీకరించిన ప్రామాణిక భాష హాయిగా ఉంటుంది. ఫిదా సినిమా చూడలేక పోయాను. నేను రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడినే కానీ Lingua Franca గా మాత్రం ప్రామాణిక భాష కే నా ఓటు.

  రిప్లయితొలగించండి
 6. అవును Anonymous (18 October 2019 at 10:27) గారూ, I agree with you. కానీ ఇప్పుడదే ట్రెండ్ కదండీ. ఒకప్పుడు . చాలా యేళ్ళు .. ప్రామాణిక భాషనే సినిమాలలో వాడేవారు. తరువాత తరువాత .. ఆ, అది కృష్ణా జిల్లా సంపన్న కుటుంబాలు మాట్లాడే భాష, సహజత్వం ఉట్టిపడాలంటే ప్రాంతీయ మాండలికంలో వాడే భా‌ష సినిమాలకెక్కించాలి అనే ట్రెండ్ మొదలై, ఇప్పుడు అదే norm అయిపోయినట్లు కనిపిస్తోంది. కథల్లో కూడా అదే ధోరణీ. అది కూడా పొంతన లేకుండా. ఉదా:- ఏదో సినిమాలో కోస్తాంధ్రాకు చెందిన కుటుంబంలో ఒక పాత్ర మాత్రం తెలంగాణా మాండలికం మాట్లాడడం (కోట శ్రీనివాస రావు). రాను రాను అదొక prestige issue అయిపోయినట్లు నాకనిపిస్తుంది.

  రిప్లయితొలగించండి
 7. Thanks for agreeing with my view sir.

  విడిపోవడానికి ఎన్నో కారణాలు వెతుక్కుం టారు కానీ కలిసి ఉండడానికి ఒక్కన కారణం దొరకదు.

  భాష మాండలికం ప్రేమ మితిమీ రడం ప్రమాదకరం.

  Language has two purposes. 1) as a tool for communication 2) as carrier of literary/ regional identity.

  I feel that Hindi / English can play the role of Lingua Franca.

  Linguistic oneupmanship indulged in by Tamil Hindi Bengali .. is not good for us.

  Telugu people are somewhat liberal and open in the language issue. For us option 1 takes precedence.

  We are busy in subregional infighting though.

  రిప్లయితొలగించండి
 8. Interesting cartoon on appraisals, performance evaluation & asking for a raise:

  https://dilbert.com/strip/2019-10-18

  రిప్లయితొలగించండి
 9. ప్రతి స్లాంగ్ వెనుకా ఒక కథ ఉంటుంది. మన ప్రాంతం లో స్లాంగ్ గురించి ఎవడూ పట్టించుకోడు. ఏ యాస వాడినా ఏం అనుకోరు. కానీ పొరుగు ప్రాంతపు సంగతి అలా కాదు. రావణాసురుడి పొడుంకాయంత ముక్కున్న ఓ పెద్దమనిషి చేసిన పనికి "మా స్లాంగ్ మాగ్గావాలే" అనుకునే పోరగాళ్ళు ఎక్కువైపోతిరి. ఆ కారణంతో మార్కెట్ నిలబెట్టుకోడానికి హీరోలు స్లాంగ్ లు తెచ్చిపెట్టుకుంటున్నారు.
  ఇక పైన విన్నకోట వారుఉదహరించిన సినిమా "జయమ్ము నిశ్చయమ్మురా" అప్పట్లో తాము వినని యాసని వింటే నవ్వు వచ్చేది చాలామందికి. అందుకే కాస్త హాస్యం కోసం జంధ్యాల గారు ఆ పాత్రని సృష్టించారు. ఆ సినిమాలో తెలంగాణ యాస వినిపించిన కోట గారే "చూపులు కలసిన శుభవేళ" సినిమాలో"మాతృభాష వెగటు అయిపోయిన ముదనష్టపు జాతి మనది" అని గ్రాంధికపు తెలుగులో మనకి బాగానే బుద్ధి చెప్పారు.
  అటువంటి కోటగారి భాషా పాండిత్యం గురించి ఎవడో వచ్చి సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదంటాను నేను.

  రిప్లయితొలగించండి
 10. అన్నట్లు పవన్ గారూ దిక్కుమాలిన సినిమాలు చూసేకంటే యూట్యూబ్ లోనే జంధ్యాలగారి సినిమాలు చూడండి. మాంచి కాలక్షేపం

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. స్వచ్ఛమైన కామెడీ సినిమాలంటే ఇప్పటికీ ఆయన సినిమాలే కేరాఫ్ అడ్రస్ అని నమ్ముతాను సూర్య గారు, అవే దిక్కు సినిమా చూసి నవ్వుకోవడానికి.

   తొలగించండి
  2. జంధ్యాల కంటే కూడా s v Krishna Reddy గారి సినిమాలలో కామెడీ అద్భుతంగా ఉంటుంది. మాయలోడు, వినోదం, శుభ లగ్నం, యమలీల, కొబ్బరి బొండాం, అభిషేకం .... ఆయన ప్రతి సినిమాలోనూ కామెడీ అల్టిమేట్ గా ఉంటుంది.
   ఇవివి కూడా అప్పుల అప్పారావు , హలో బ్రదర్ కామెడీ బాగుంటుంది. అయితే రాను రాను అది మొరటుగా మార్చేశాడు.

   తొలగించండి
  3. అవును anonymous గారు, S.V గారిది ok గానీ ఈ.వి.వి. గారిది కాస్త మాస్ కామిడీ

   తొలగించండి