14, అక్టోబర్ 2019, సోమవారం

మరి ఇక్కడ శాలరీ పెరగడానికి దారేది?

ఈ పోస్ట్ 'అప్రైసల్ వద్దు, వస్తున్నదే ముద్దు' అనే పోస్ట్ కి కొనసాగింపు & ముగింపు.

అలా నిరాశతో నిస్పృహతో  కూడిన మొహం వేసుకొని మెహర్ రమేష్ లా బయటికి వచ్చిన నాకు  కాఫీ టైం కంటే బాగా ఆలస్యంగా, లంచ్ టైం కంటే కాస్త ముందుగా ఆఫీస్ కి వస్తున్న రాజేష్ ఎదురయ్యాడు.

అది చూసి "హేయ్  రాజేష్, ఇంత ఆలస్యంగానా ఆఫీస్ కి వచ్చేది"  అన్నాడు సుబ్బారావ్ ఒక చీమను తన కాలికింద నలిపేసి ఇంకో నల్లిని కూడా నలిపేయాలన్న కసితో. 

"కుక్క ఉంది" డోంట్ కేర్ అన్నట్లు రాజేష్ రిప్లై  ఇచ్చాడు. 

"వాట్?" కోపంగా సుబ్బారావ్

మా కాంపౌండ్ లో కుక్క ఉంది, దాన్ని కట్టేయ్యలేదు. ఓనర్స్ దాన్ని కట్టేశాక బయల్దేరా లేటయింది.

"మరి ఆ జుట్టేంది" మళ్ళీ ఎటాక్ మొదలెట్టాడు సుబ్బా రావ్ 

"మొక్కు ఉంది"

"వాట్?"  మళ్ళీ కోపంగా సుబ్బారావ్

తిరుపతి వెళ్ళాలి, అందుకే జుట్టు కటింగ్ చేయించుకోలేదు 

ఆ చిరిగిన బట్టలేంటి ఆఫీస్ కి?

పంది కొక్కు ఉంది

వాట్? అన్నాడు మళ్ళీ, అప్పటికే నిప్పుల మీద పెట్టిన వంకాయలాగా మాడిపోయింది సుబ్బారావ్ మొహం.

పంది కొక్కు ఇంట్లో బట్టలను కొరికేస్తోంది. 

అయితే ఓకే, అని మేనేజర్ వెళ్ళిపోయాడు ఏం అనలేక. 

కుక్కుంది, మొక్కుంది, పంది కొక్కుంది అంటూ మాట్లాడావ్ సుబ్బారావు తో, "ఏముందని నీ దగ్గర అంత  ధైర్యం?" అని అడిగా రాజేష్ ని.

ధైరం ఉంది, బ్రహ్మాస్త్రం  లాంటి  P.R ఉందనే ధైర్యం ఉంది అందుకే అన్నాడు. అదిసరే గానీ  ఏమైంది నీ అప్రైసల్ అంది అడిగాడు. 

మళ్ళీ దెబ్బేశాడు, ఎన్ని హిట్లు పడి, యెంత టాలెంట్ ఉన్నా మార్కెట్ పెరగని నాని లాగా అయిపొయింది నా బతుకు అన్నాను. 

గొడవ పడక పోయావా?

అదీ అయింది, నీకు దిక్కున్న చోట చెప్పుకో అన్నట్లు మాట్లాడాడు.

సరే, నీకు జ్ఞానోదయం కలిగిస్తాను విను అని మొదలెట్టాడు ... 

ఇక్కడ ఎగిరెగిరి దంచినా ఎగరకుండా దంచినా, అసలు దంచకపోయినా అదే కూలి దక్కుతుంది.  

అంతే కాదు, వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా మన ప్లేట్, కడుపు రెండూ నిండిపోతాయి.

నువ్వెంత పని చేసినా, సంవత్సరం చివరలో నీ పనిలో ఏదో ఒక బొక్క వెతుకుతారు. వాళ్లకు నువ్వు నచ్చకపోతే పొమ్మని ఎవరూ చెప్పరు పొగ పెడతారు అంతే. 

మార్కెట్ కి వెళ్ళినప్పుడు నీకొక్కడికే కూరగాయలు తెచ్చుకుంటే సరిపోదు వాటితో పాటు ఆపిల్స్, అరటి పండ్లు లాంటివి తెచ్చి ఎక్కడ సమర్పించాలో అక్కడ సమర్పించుకోవాలి. 

సూపర్ మార్కెట్ లో నీ బ్యాగులొక్కటి మోస్తూ తిరిగితే మోక్షం రాదు, సూర్యుడి చుట్టూ భూమి ఒక కక్షలో తిరుగుతూ ఉంటుంది చూశావా అలా తిరిగిన వారికే మోక్షం. 

లేదు ఈ తిప్పలన్నీ పడలేను అంటావా అయితే అన్ని రోగాలకు జిందా తిలిస్మాత్ లాంటి ఒకటే మందు ఉంది, అదే PR. ఆ బ్రహ్మాస్త్రం చేతిలో ఉంటే ఇంత తిప్పలు పడాల్సిన అవసరం లేదు. 

సరే! అప్పుడెప్పుడో  స్థిర యోగ హోమం మెదలెట్టానన్నావ్. ఎంతవరకు వచ్చింది?

నడుస్తోంది. చివరి స్టేజి దగ్గర  ఉంది.  కుదిరితే క్రిస్మస్ కు, లేదంటే సంక్రాంతికో అప్పటికీ కాదంటే ఉగాదికో నాకూ బ్రహ్మాస్త్రం వస్తుంది. అప్పుడు చూపిస్తా నా తడాఖా, పెద్దగా కష్టపడకపోయినా అందం ఒక్కటి అడ్డు పెట్టుకొని హిట్ మీద హిట్ కొడుతున్న మహేష్ బాబు లాగా మార్కెట్ పెంచుకుంటా.

ఆల్ ది బెస్ట్ అని రాజేష్ లంచ్ కి వెళ్ళాడు డబ్బా పట్టుకొని.  

P.S: మేనేజర్ మనోభావాలను దెబ్బదీశానని నా మీద కోర్ట్ కేసులేమి పెట్టకండి, అసలే జీతాలు పెరగక ఇబ్బందుల్లో ఉన్నాను. మా సుబ్బారావ్ కి తెలుగు రాదు కాబట్టి నా బ్లాగు చదవడు అని ధైర్యంగా రాసేశా, మీరు మాత్రం ఇలాంటివి రాయాలంటే ఆలోచించండి.

18 కామెంట్‌లు:

  1. కస్టమర్ సపోర్ట్ కంటే PR కూడా పెద్ద బ్రహ్మాస్త్రం.

    ఉ. మేనేజర్ సుబ్బారావు, పీడిత ప్రోగ్రామర్ పేరు అనిల్, క్లయంట్ POC పీటర్. పీటర్ GUI పిచ్చోడు, సుబ్బారావుకు డేటాబేస్ స్ట్రక్చర్లు, object/class libraries, సిస్టమ్స్ ఆర్కిటెక్చర్ వగైరాలు కొట్టిన పిండే కానీ పిక్సెల్ అనగానే తెల్లమొహం వేసే రకం. నెలకో సారి జాయింటు రివ్యూలు జరుగుతాయి.

    ప్రారంభ/తన్నుకునే సమావేశంలో (opening meeting or kick-off) అనిల్ పై విషయాలన్నీ పసికట్టాడు. తనకూ పొట్టకోస్తే GUI అంటే కూరా పండా తేడా తెలీదు. "30 రోజులలో వాడకదారు స్నేహం (user friendliness) ద్వారా ఇతరులను బుట్టలో వేయడం ఎట్లా" అనే పొస్తకం కిందికి దింపేసి (download) బట్టీ పట్టేసాడు.

    నారాయణ/చైతన్య పూర్వ విద్యార్ధి కావడం మూలాన కాన్సెప్ట్ అర్ధం కావడం ముఖ్యం కాదని, కొన్ని బీగం పదాలు (keywords) తరుచూ వాడితే బ్రహ్మాండమయిన ఇంప్రెషన్ కొట్టేయొచ్చని ఎరిగిన అనిల్ కోడింగ్ మానేసి ఆ పనిలో పడ్డాడు.

    నెల గడిచి ఎంతో ఆత్రుతతో వేచి చూస్తున్న ప్రధమ ఉమ్మడి ప్రగతి నివేదన & విశ్లేషణ సదస్సు (joint progress reporting & review meeting) వచ్చేసింది. సుబ్బారావు తన ప్రారంభ ఉపన్యాసంలో సాంకేతికంగా తామెంత పొడిచేసామో గొప్పలు చెప్పుకుంటూ ఘంటన్నర ప్రసంగం దంచాడు. మధ్యమధ్యలో ప్రతి ఏడూ బ్రహ్మాండమయిన అప్రైసల్ కొట్టేసే తన బామ్మర్ది & ఫెవరిట్ ప్రోగ్రామర్ వైపు చూసి వాడికీ కొంత మాట్లాడే అవకాశం (my colleague Sala will explain this in greater detail) ఇస్తా వచ్చాడు. మొత్తానికి డెమో అదిరిపోయింది.

    పీటర్ బుర్రకి ఒక్క ముక్కా అర్ధం కావడం లేదు. దిక్కులు చూస్తూ కాఫీ కప్పుతో ఆడుకుంటున్నాడు. ఆఫ్టరాల్ వెండర్, ఈ వెధవ డబ్బారేకుల సుబ్బారావు గాడి బోడి డామినేషన్ ఏంటా అని కుళ్ళుకుంటున్నాడు.

    ఎట్టకేలకు పవర్ పాయింటు ముగిసింది, సుబ్బారావు కాలర్ ఎగరేసుకుంటూ "ఏమయినా ప్రశ్నలున్నాయా" అనడిగాడు. అప్పటికే సగం జుట్టు పీకేసుకున్న పీటర్ ఒళ్ళు మండి "ఫలానా పిక్సెల్ రంగు బాలేదు, ఇంకో చోట కింద పడేసే డబ్బా (drop down box) చూడ్డానికి అసహ్యంగా ఉంది" లాంటి నాలుగు చచ్చు వాఖ్యలు కసిగా విసిరాడు.

    ఇదంతా రామాయణంలో పిడకల వేట అని భావించిన సుబ్బారావు & అతని బామ్మర్ది "ఠాట్ అదంతా ఈ భాషలో (programing language) కుదరదు" అని వాదించడం మొదలెట్టారు. పీటర్ ససేమిరా, ఇదే మా ప్రాజెక్ట్ ప్రధాన ఉద్దేశ్యం, మీరు చెప్పే మిగిలిన సోది మాకు ముఖ్యం కాదంటూ గళం విప్పాడు. వాదప్రతివాదాలతో మీటింగ్ వేడి పెరిగింది.

    అప్పటిదాకా ఆసక్తితో వింటున్నప్పటికీ నోరు మెదపకుండా కూచున్న అనిల్ అదను పట్టేసాడు. "నాదొక చిన్న సలహా" అనేసరికి కొట్టుకున్న వాళ్ళందరూ అనిల్ వైపు చూసారు. "As my manager said, this is impossible in the business & database layers but it can be implemented in the GUI layer" అని ఉబోస పడేసాడు.

    ఇక చూసుకోండి నా సామిరంగా! ఇంకో రెండు సమావేశాలు ముగిసేవరకు పీటర్ "అనిల్ మీ టీములోనే అత్యుత్తముడు, అతను ఉంటేనే మీకు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఇస్తాము" అనే స్థాయికి మారాడు. కక్కాలేక మింగాలేక సుబ్బారావు & సాలా బాబు కుక్కిన పేను తరహాలో సతమతమయిపోయారు.

    అటునుంచి నరుక్కొచ్చిన అనిల్ లాంటి వారికి ఈ కథ అంకితం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Correction:

      "కస్టమర్ సపోర్ట్ *PR కంటే* కూడా పెద్ద బ్రహ్మాస్త్రం"

      తొలగించండి
    2. జై గారు, మీ అనిల్ కథ బాగుంది.


      ఇక్కడ క్లయింట్ సపోర్ట్ అంతో ఇంతో ఉంది కాబట్టే గత ఏడున్నర ఏళ్ళుగా నెట్టుకొస్తున్నాను కాకపోతే P.R ఉంటే ఇంకాస్త బెనిఫిట్స్ ఉంటాయి, అందుకే ఈ తాపత్రయం.


      ఇక క్లయింట్ విషయానికి వస్తే, కొంతమంది వెండార్స్ చేసుకున్న అగ్రిమెంట్ ప్రకారం ఒక రిసోర్స్ ని క్లయింట్ మ్యాక్సిమం 2 ఇయర్స్ మాత్రమే హోల్డ్ చేసి పెట్టుకోగలుగుతుంది, ఆ పైన క్లయింట్ అదే రిసోర్స్ కావాలని డిమాండ్ చేయలేరు.

      తొలగించండి
    3. ఒక రిసోర్సు ఎంతకాలం హోల్డ్ చేయవచ్చనే అంశంపై పరిమితులు ఉన్నాయా? కొత్త విషయం తెలిసింది.

      అయినా ఫరవాలేదు. పీటర్ ఉద్యోగం మారడా, అతగాడి చుట్టాలు/నేస్తాలు ఇతర క్లయంటులలో పని చేయరా.

      అనిల్ కథ ఒక ఉదాహరణ మాత్రమే. కస్టమర్ POC పీటర్ బదులు అప్పర్ మేనేజిమెంట్ తాలూకా సౌరవ్ గంగూలీ అయినా ఇదే తరహా "మూడు ముక్కలాట" ఆడొచ్చు.

      GUI కూడా మనకు తెలీదనుకోండి దిగులు పడబళ్లా. పీటర్ రగ్బీ ఫుట్బాల్, సౌరవ్ గంగూలీ ఫిష్ కబాబ్ ఎదో ఒక అంశం దొరక్కపోదు. ఎక్కడో ఒకచోట సుబ్బారావు తడబడే విషయాన్ని ఔపాసన పట్టేసి దాన్ని వ్యూహాత్మకంగా మలుచుకోవడం ఉత్తమం.

      తొలగించండి
    4. టెంపరరీ వీసా మీద ఉన్నప్పుడు ఒక కంపెనీ నుంచి ఇంకో కంపెనీ కి మారడమన్నది చాలా కష్టమైన ప్రాసెస్ జై గారు. మొదట ఆ కంపెనీ ఇండియన్ కంపెనీ కానప్పుడు mostly వాళ్ళు accept చెయ్యరు, ఎందుకంటే వీసా expire అయితే మళ్ళీ extension ప్రాసెస్ ఇదంతా వాళ్లకు తలనొప్పి కాబట్టి చాలా కంపెనీల్లో H.R డిపార్ట్మెంట్ లో ఆ సెక్షన్ ఉండదు , ఒక వేళ ఉన్నా ఆ resource కి సంబంధించిన LMT (Labour market testing) ప్రాసెస్ అంతా చేయాలి. గత రెండేళ్లలో చాలా రూల్స్ వచ్చాయి. ఇంత తలనొప్పి పెట్టుకోవడం ఎందుకని టెంపరరీ వీసా ఉండే వాళ్ళను బయటి కంపెనీలు ఎంటర్టైన్ చేయడం లేదు. కాబట్టి POC పీటర్ ఎటు వెళితే అటు లాక్కెళ్ళే ఛాన్సెస్ శూన్యం.

      తొలగించండి
    5. పవన్ గారూ, అప్పుడెప్పుడో కొద్దీ నెలలు మాత్రమే బాడీ షాపింగ్ (తెలుగులో తర్జుమా చేస్తే వినడానికి దారుణంగా ఉంటుంది కనుక అనువాదం వద్దులెండి!) చేసాను, అదీ అమెరికా మార్కెట్టులో. నాకీ ఆస్ట్రేలియా వీసాల తతంగం గురించి తెలీదు కానీ కంపెనీలు మారడంలో తలా ప్రాణం తోకకొస్తుందని మాత్రం అర్ధం అయింది. కాకపొతే నేను చెప్పింది అనిల్ క్లయంట్/ప్రాజెక్ట్ మారడం గురించి. ఎన్నో సినారియోలలో మచ్చుకు రెండు:

      Scenario # 1: పీటర్ ఉద్యోగం మారాడు, ఆ కంపెనీ కూడా మన క్లయంటే. కొత్త POC పీటర్ గారిని పరిచయం చేస్తాను రండంటూ ప్రస్తుత తెల్లప్ప మన ప్రాజెక్ట్ వారిని పిలిచాడు. సుబ్బారావు తన పైబాసు సౌరవ్ గంగూలీ తోబాటు తన ఫెవరిట్ బామ్మర్ది & అనిల్ ఇద్దరినీ వెంబడి పెట్టుకొని పొలోమని దిగిపోయాడు. పీటర్ సౌరవ్ & సుబ్బారావు లను హలో అని పొడిగా పలకరించి అనిలుడిని మాత్రం దాదాపు వాటేసుకున్నంత ఆత్మీయతతో హడావుడి చేసాడు. కాఫీ బ్రేకు మొత్తం పీటర్ & అనిల్ నిన్నటి రగ్బీ మాచీలో అదృష్టం కొద్దీ పీటర్ ఫెవరిట్ టీము చివరాఖరి నిముషంలో గెలవడం గురించే ఖబుర్లు చెప్పుకోవడంతో సుబ్బారావు మొఖం మాడ్చుకున్నాడు.

      Scenario # 2: అనిల్ కొత్త ప్రాజెక్ట్ మొదలెట్టాడు. ఈ క్లయంట్ POC డేవిడ్ అనేవాడు పీటర్ షడ్డకుడు, లంగోటి దోస్తు లేదా ఇంకేదో అనుబంధీకుడు. ఓపెనింగ్ మీటింగ్ కోసం సుబ్బారావు తన పైబాసు సౌరవ్ గంగూలీ తోబాటు తన ఫెవరిట్ బామ్మర్ది & అనిల్ ఇద్దరినీ వెంబడి పెట్టుకొని పొలోమని దిగిపోయాడు. డేవిడ్ "అనిల్, బాగున్నావా? నీ గురించి పీటర్ ఎప్పుడూ గొప్పగా చెప్తాడు" అని మీటింగ్ మొదలెట్టుతాడు. సుబ్బారావు ముఖారవిందంలో ఆముదం తాగిన ఫీలింగ్ స్పష్టంగా అగుబడుతుంది.

      తొలగించండి
    6. బాగున్నాయ్ మీ examples జై గారు. మీరన్నట్లు బాడీ షాపింగ్ ని తెలుగు లోకి తర్జుమా చేయకపోవడమే మంచిది.

      తొలగించండి
  2. చూస్తుంటే పవనయ్యకి మాతృభూమి మీద మమకారం సేమ్యా పాయసంలో వేసుకునే కారమంతైనా లేనట్లుందే! అస్సలు వెనక్కొచ్చే ఉద్దేశం లేదు అభిమాన్యుడిలా!

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ఏం చేస్తాం సూర్య గారూ, ఇక్కడికి వచ్చిన కొత్తలో రెండు ఓట్లు ఇండియా కె పడేవి కానీ ఇప్పుడు మా ఫ్యామిలీలో మెజారిటీ ఓట్లు అనగా 3 ఓట్లు ఆస్ట్రేలియా కే పడ్డాయి, నా ఒక్కడి ఓటేఇండియా కు పడింది, కాబట్టి మెజారిటీ ని గౌరవించాల్సి వచ్చింది.

      తొలగించండి
    2. సూర్య గారూ, సినిమాలు బ్రహ్మాండంగా నడిస్తేనే ఆర్ధిక వ్యవస్థ బాగుపడుతుందని ఇటీవల ఆయనెవరో మంత్రి గారు సెలవిచ్చారు(ట).

      పవన్ గారు భౌతికంగా ఆస్ట్రేలియాలో ఉన్నా ఆయన గుండె మాత్రం ఎప్పుడూ భారత సినిమాల (ముఖ్యంగా నాయకోత్తముల) గురించే కొట్టుకుంటుంది. ఎంత చెత్త సినిమా అయినా, హీరో ఎంత బండోడయినా, హీరోయిన్ ఎంత వెగటు మేకప్పు వేసుకున్నా, పాటలు ఎంత కర్ణకథోరంగా ఉన్నా, డయలాగులు ఎంత రోతగా ఉన్నా దేశప్రేమ కోసం అన్నిటినీ భరించి ఆర్ధిక మాంద్యాన్ని పారదోలడానికి తన వంతు సాయం చేస్తున్న ఆయన నిజంగా ధన్యజీవి.

      సొంతదేశంలో ఉన్నా ఎప్పుడూ సినిమాలు చూడని (నా లాంటి) మూర్ఖులకు పవన్ త్యాగం కనువిప్పు కలిగించాలని దాదాసాహెబ్ ఫాల్కే ఆత్మ ఘోషిస్తుంది(ట)!

      తొలగించండి
    3. నాయకోత్తములు అన్నది మా మెగా స్టార్ గురించి కాదు కదా?

      తొలగించండి
    4. పవన్ గారూ, నేను "నాయకోత్తములు" అన్న పదం వాడింది హీరో అనే మీనింగుతోటేనండీ. మెగాస్టార్ నుండి సంపూర్ణేష్ బాబు వరకు ఎవరయినా నాయకోత్తములే.

      తొలగించండి
    5. అయితే వాకే జై గారు, నాయకుడు అంటే రాజకీయనాయకుడేమో అనుకోని మా చిరంజీవిని అన్నారేమో అని ఇక్కడ బ్లడ్ బాయిల్ అయింది. 😊


      కాకపోతే సంపూర్ణేష్ బాబు ఫాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు హర్ట్ అయ్యే అవకాశం ఉంది. మెగా స్టార్ట్ నుంచి సంపూర్ణేష్ బాబు వరకు అంటే .. మా సంపూర్ణేష్ బాబు బాబు రేంజ్ అతి తక్కువా అని.

      తొలగించండి
    6. అనాలోచితంగా సంపూర్ణేష్ బాబు అభిమానుల మనోభావాలు నొప్పిస్తే క్షమాపణలు. వయసు, బరువు, చేసిన బొమ్మల సంఖ్య ఇలాంటి విషయాలను వేటిని తీసుకున్నా సంపూర్ణేష్ బాబు కాస్త తక్కువే ఉంటాడనే విషయం తప్ప హీరోల రేంజ్ గురించి మాట్లాడేంత రేంజ్ నాకు లేదని సవినయంగా మనవి.

      తొలగించండి
  3. ఇంతకీ మీరు బ్లాగులు రాస్తున్న విషయం మీ బాసుడికి తెలుసా? తెలిస్తే "బ్లాగులు రాసి రెండు చేతులా సంపాదిస్తున్నవాడివి నీకెందుకోయ్ జీతం గురించిన ఆరాటం" అని అన్నా అనొచ్చు!☺️

    రిప్లయితొలగించండి