10, నవంబర్ 2019, ఆదివారం

ఈ మధ్య చూసిన వాటిల్లో నాకు నచ్చిన రెండు తెలుగు సినిమాలు

నువ్వెక్కాల్సిన రైలు జీవిత కాలం లేటు అన్నట్లు, నేను సినిమా చూసి వాటి గురించి రాసేది ఒక ఏడాది లేటు.

నాకు మా చెడ్డ  అలవాటు ఉంది. ఏదైనా మంచి సినిమా చూసినప్పుడు ఆ సినిమా గురించి ఎవరికో ఒకరికి చెప్పాలి అని అనిపిస్తుంది, అందుకే ఈ బ్లాగ్ ని ఎన్నుకున్నాను. చూసినవి కొత్త వో పాతవో వాటి గురించి నాలుగు ముక్కలు మీతో పంచుకుంటే అదో తుత్తి నాకు.

రంగస్థలం, జెర్సీ అనే రెండు మంచి తెలుగు సినిమాలు చూశాను, ఇలాంటి మంచి మంచి సినిమాలు వస్తూ ఉంటే అస్సలు తమిళ్ సినిమాల వైపు వెళ్ళాలి అనిపించదు. 

దర్శకుడు బోయపాటి ఒక ఇంటర్వ్యూ లో ఇలా అన్నాడు, "విలన్ ను హీరో కొట్టాలి అనుకున్నప్పుడు కొడితే ఎమోషన్ పండదు, ఇప్పుడు హీరో కొడితే బాగుండు అని ప్రేక్షకులకు అనిపించాలి అప్పుడే ఎమోషన్ పండుతుంది, అలానే ఉంటాయి నా సినిమాలో ఫైటింగ్స్ అన్నీ అని", కానీ వినయ విధేయ రామ లో లెక్క తప్పింది. ఆ  సినిమా నిండా ఫైట్స్ ఉన్నాయి, కానీ ఎక్కడా మనం ఇన్వాల్వ్ అవ్వము, అవ్వాలని అనిపించదు. 

కానీ రంగస్థలం లో సుకుమార్ ఆ involvement  ఎలా ఉంటుందో చూపించాడు. అందులో ఉండేది 3 ఫైట్స్ అనుకుంటా. మూడూ కూడా ఎమోషన్ క్యారీ చేసేవే.

మొదటిది జాతరలో సమంతాను వాడెవడో ఏదో అని ఏడిపించాడని

రెండోది వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ గురించి తప్పుగా మాట్లాడారని

మూడోది వాళ్ళ అన్నను కాపాడుకోవడం కోసం చీకట్లో ఫైట్

ఈ మూడు ఫైట్స్ విషయం లో ఇంకా కొట్టేయ్ వాణ్ని అని ప్రేక్షకుడు అనుకుంటూ ఇన్వాల్వ్ అవుతాడు, నా విషయంలో అలానే జరిగింది. చిన్నప్పుడు ఫైటింగ్ సీన్స్ అంటే నచ్చేవి కానీ, తర్వాత అంతగా నచ్చేవి కావు. 

చాలా రోజుల తర్వాత ఒక అచ్చమైన స్వచ్ఛమైన పల్లెటూరి తెలుగు సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. రామ్ చరణ్ యాక్షన్ ను మగధీర తర్వాత అంతో ఇంతో ఆస్వాదించగలిగింది ఇందులోనే. ఘన శక్తి నక్షత్రం అని వాళ్ళకు వాళ్ళు పేరు తగిలించుకున్నందుకు మొదటి సారి మన్నించెయ్యచ్చు.  

సినిమా పరిభాషలోని 'పే ఆఫ్' బాగా క్యారీ అయింది ఈ సినిమా విషయంలో. ఉదాహరణకు 'ప్రెసిడెంట్ గారు' అనేదే నా పేరు, నా అసలు పేరు ఈ ఊరెప్పుడో మరచిపోయింది అంటాడు జగపతి బాబు గర్వంగా. 

నెక్స్ట్ సీన్ లోనే  "ఫణీంద్ర భూపతి గారు" అని వెటకారంగా పేరు పెట్టి పిలిచి గాలి తీసేస్తాడు రామ్ చరణ్.

కాకపోతే అంత గొప్పగా చూపిస్తూ వస్తున్న జగపతి బాబు కారెక్టర్ ను చివరికి ఆటలో అరటిపండును చెయ్యడాన్ని జీర్ణించుకోవడం కష్టమే.  

చాలా రోజుల తర్వాత నాకు నచ్చిన తెలుగు సినిమా ఇది, నచ్చనిది అంటూ ఏమీ లేదా ఈ మూవీ లో అంటే ఉంది, అదే ఐటెం సాంగ్, అలాగే ఎన్నో పాత సినిమాల్లో చూసిన కథే. ఈ తరం కుర్రకారు చూసి ఉండరు కానీ 'ఈ తరం ఫిల్మ్స్' బానర్ మీద ముత్యాల సుబ్బయ్య దర్శకత్వం లో పాతికేళ్ళ కిందట వచ్చిన 'ఎర్ర మందారం' సినిమా చూడండి బాగుంటుంది.

ఎప్పుడూ నలగని బట్టలు వేసుకునే మహేష్ బాబు ఈ సినిమాలో యాక్ట్ చేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి.... జస్ట్ ఫర్ ఫన్.


ఇదే కాదు, ఈ మధ్య కాలం లో నచ్చిన మరో సినిమా జెర్సీ. కాకపోతే పైన చెప్పుకున్న "ఘన శక్తి నక్షత్రం" లాంటి మాస్ హీరో లేడు, అలాగే అర్జున్ రెడ్డి లాంటి యూత్ ని అట్ట్రాక్ట్ చేసే సినిమా కాదు పైగా కేవలం "సహజ నక్షత్రం" సినిమా కాబట్టి కమర్షియల్ గా 100 కోట్ల చిత్రం కాకపోవచ్చు కానీ ఇలాంటి సినిమాలను కలెక్షన్ లెక్కలతో కొలవకూడదు.

కొడుకు జెర్సీ అడిగినప్పుడు, పదరా కోటి సర్కిల్ లో ప్లాట్ఫారం మీద 50 రూపాయలు పెడితే ఒరిజినల్ లాంటిదే వస్తుంది అని ఫ్రెండ్ సలహా ఇచ్చినప్పుడు, "తన వయసుకు తెలియకపోవచ్చు కానీ, నా మనసుకు అర్థమవుతుంది ఏం ఇచ్చానో" అంటాడు నాని. ఇలాంటి మంచి మంచి డైలాగులు చాలా ఉన్నాయి సినిమాలో.

చాలా మంచి ఎమోషన్ సీన్స్ ఉంటాయి, ప్రత్యేకంగా చెప్పుకోవాల్సింది, రైలు కూత కోసం వెయిట్ చేసి తన సంతోషాన్ని గట్టిగా అరుస్తూ అనుభవిస్తాడు చూడండి అది. ఇలాంటిదే ఒక చిన్న బిట్ తొలిప్రేమ సినిమాలో ఉంటుంది, పవన్ కళ్యాణ్ చెట్టు చాటుకి వెళ్ళి డాన్స్ చెయ్యడం. 

నానితో పాటు ఈ సినిమా డైరెక్టర్ అయిన గౌతమ్ గారి గురించి చెప్పకపోతే అర్థమే లేదు ఈ పోస్ట్ కి. చాలా బాగా తీశాడు మూవీ ని, ఇదే కాదు ఇతని మొదటి సినిమా 'మళ్ళీ రావా' కూడా బాగుంటుంది అందులోని అక్కినేని ఆణిముత్యాన్ని లెక్కలోకి తీసుకోకపోతే. ఈ గౌతమ్ గారు కలెక్షన్ అనే సుడిగుండంలోకి వెళ్ళాలని ఆలోచించకుండా ఉంటే మరిన్ని మంచి సినిమాలు ఆశించచ్చు ఇతని నుంచి.

ఇలాంటి క్రికెట్ బ్యాక్ డ్రాప్ తోనే మజిలీ అని మరో సినిమా అదే టైంలోనే రిలీజ్ అయింది, ఆ సినిమా కూడా బాగుంది అన్నారు కానీ అందులోని మరో అక్కినేని ఆణిముత్యానికి బెదిరి ఆ సినిమా చూడాలనే మూడ్ రాలేదు.

P.S: మొన్నా మధ్య కామెంట్స్ లో మెగా స్టార్ ను విన్నకోట నరసింహారావు గారు "ఘన నక్షత్రం" అని అనువదించారు , నేను ఇంకాస్త ముందుకెళ్లి మెగా పవర్ స్టార్ ను "ఘన శక్తి నక్షత్రం" అని నానిని 'సహజ నక్షత్రం' అని మెన్షన్ చేశాను..... జస్ట్ ఫర్ ఫన్.

9 కామెంట్‌లు:

  1. // "ఘన శక్తి నక్షత్రం" //

    హ్హ హ్హ హ్హ, నేను చెప్పిన దాని మీద మరింత improve చేసినట్లున్నారే,పవన్ 😃👍.

    రిప్లయితొలగించండి
  2. మహేశ్ బాబు ఏ పాత్ర వేసినా తెర మీద చూస్తే, మహేశ్ బాబే కనిపిస్తాడు. ఆ పాత్ర కనిపించదు. నలగని బట్టలతో మల్లెపూవు లాగా ఫ్రెష్ గా ఉంటాడు.
    ఏదో గొనిగినట్టు మాట్లాడతాడు. కామెడీ పాత్ర అయితే ఓవరాక్టింగ్ చేస్తాడు.డాన్సు కీళ్లు బిగుసుకు పోయినట్టు ఉంటుంది.
    పాలకోవా స్టార్ అనే పేరు సూటవుతుంది.

    రంగస్థలం సినిమా కాస్ట్యూమ్స్, ఆర్ట్ డైరక్షన్, రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డ్ ఇచ్చి ఉంటే బాగుండేది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరిచ్చిన 'పాలకోవా స్టార్' ని ఫిక్స్ చేసుకుందాం బాగుంది.

      తొలగించండి
    2. ఇక జాతీయ అవార్డులు అంటారా అవెప్పుడో కరప్ట్ అయిపోయాయి. అప్పుడెప్పుడో మగధీర టైం లో అనుకుంటా రామ్ చరణ్ కి కాకుండా దాసరి కి ఉత్తమ నటుడి కింద నంది అవార్డు ఇస్తే కాస్త రగడ జరిగినట్లుంది. మేస్త్రి అనే సినిమాలో దాసరి గారు అంత గొప్పగా ఏం నటించాడో తెలుసుకోవాలి అనుకున్నా కానీ ఆ సినిమా చూసే ధైర్యం చెయ్యలేదు.

      తొలగించండి
  3. నాని నటన ఒకే కానీ సంభాషణలు పలికే తీరు బాగుండదు. అస్పష్టంగా వేగంగా మాటలు మింగేస్తాడు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. డైలాగులు చెప్పే తీరు ఏమో గానీ వాయిస్ బానే ఉంటుంది.

      తొలగించండి
  4. పైన రెండు నచ్చాయంటే, మీరు మజిలీ చూడవచ్చు. సినిమాలో నక్షత్రాలు లేరు అనుకోని చూస్తే ఇంకా బావుంటుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మీరు రెకమండ్ చేస్తున్నారంటే బానే ఉంటుంది, చూస్తాను అన్యగామి గారు.

      తొలగించండి