మా ఇంట్లో పెద్దగా చదివించలేదు గానీ లేదంటే నా రేంజే వేరుగా ఉండేది అని ఎవరైనా అనడం మన చెవిన పడుతూ ఉంటుంది అప్పుడప్పుడూ. ఇది ఒక రకంగా వారి చేతకానితనాన్ని కప్పిపుచ్చుకోవడం కోసమే అని ఈ పోస్ట్ చదివాక మీకు అనిపించచ్చు.
నోరు తిరగని పేరు గల Nusret Gökçe అనే కుర్రాడు మైన్స్ లో పనిచేసే ఒక లేబరర్ కొడుకు. ఇల్లు గడవాలి అంటే ప్రతీ రోజు ఆ మైన్స్ లో దిగాల్సిందే ఆ దిగువ తరగతి కుటుంబీకుడు. కానీ అతని కొడుకైన Nusret Gökçe బ్రతకాలంటే అక్కడే ఆ మైన్స్ లో దిగాల్సిందే అని మైన్స్ లోతు ల్లోకి దిగలేదు , ఎత్తుకు ఎదగాలనుకున్నాడు ఎదిగి చూపించాడు.
'పేదవాడిగా పుట్టడం నీ తప్పు కాదు, పేదవాడిగా చావడం మాత్రం నీ తప్పు, నీ చేతగాని తనమే" అంటారు కదా అలా చేతగాని వాడిలా మిగిలిపోలేదు.
ఒక అట్టడుగు స్థాయి నుంచి ఉన్నత స్థాయికి చేరుకున్న ఎంతోమంది గురించి మీరు వినే ఉంటారు లేదా చదివి ఉంటారు. అలాంటి కోవలోకి చెందిన వ్యక్తే ఈ Nusret Gökçe. మరీ చరిత్ర సృష్టించేటంతటి ఉన్నత స్థాయికి చేరుకోక పోయి ఉండచ్చు, కానీ ఉన్న స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఎదగాలి అనుకునే వాళ్ళకి ఇతని కథ ఒక పాఠమే.
పుట్టింది టర్కీ లో, ఒక పేద కుటుంబలో. స్కూల్ లో చదవడానికి డబ్బులు లేక 6 వ తరగతితోనే చదువు ఆపేయాల్సి వచ్చింది. అతని పేదరికం అతన్ని చదువుకు దూరం చేయగలిగిందేమో గానీ, అతని కష్టించే గుణం ఉన్నత స్థాయికి ఎదిగేలా చేసింది.
స్కూల్లో చదువే ఆర్థికస్తోమత లేక కుటుంబం గడవడం కోసం ఒక కసాయి కొట్లో అలాగే ఒక హోటల్ లో పనికి కుదిరాడు. అక్కడే తనకి వంట మీద మక్కువ ఏర్పడింది. ఆ తర్వాత వివిధ దేశాలు తిరిగి అక్కడి రెస్టారెంట్స్ లో పనిచేసి వివిధ రకాల వంటలు నేర్చుకొని తన దేశానికి తిరిగొచ్చి ఆ అనుభవంతో తన మొదటి రెస్టారెంట్ ని మొదలెట్టాడు. ఆ తర్వాత తన వ్యాపార సామ్రాజ్యాన్ని దుబాయ్ తో పాటు అమెరికా లాంటి వివిధ దేశాలకి విస్తరించాడు.
వంట చేసేటప్పుడు అతని చేష్టలు అలాగే వంట పూర్తయ్యాక సాల్ట్ ని ఆ వంట మీద చల్లే అతని స్టైల్ కి అభిమానులు ఉన్నారు (మన రజినీ కాంత్ నోట్లో సిగరెట్ విసురుకునే విధానానికి ఉన్నట్లు). ఆ సాల్ట్ చల్లే ఒక ప్రత్యేకమైన అతని స్టైల్ వల్ల Salt Bae అనే పేరుతో ఫేమస్ అయ్యాడు. Salt Bae అని మీరు గూగుల్ లో టైపు చేస్తే దానికి సంబంధించిన వీడియోస్ చూడొచ్చు.
పేరు ప్రఖ్యాతలు పొందిన ప్రతీ వారి జీవితంలో ఉన్నట్లే ఇతనూ విమర్శలు ఎదుర్కున్నాడు గానీ అవేమీ అతని ఎదుగుదలని ఆపలేకపోయాయి. ఫుడ్ బాగా కాస్ట్లీ అనీ మరీ అంత రుచిగా ఏమి ఉండదు అని ప్రఖ్యాత మ్యాగజైన్స్ లో విమర్శించారు అలాగే కస్టమర్స్ తమకు ఇచ్చే టిప్స్ లో అతను వాటా అడుగుతాడని అతని రెస్టారెంట్ లో పని చేసిన కొందరు వెయిటర్స్ ఆరోపణలు చేశారు, వాటి కోసం కోర్ట్ మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది గానీ అవేమీ అతని బిజినెస్ ని దెబ్బతీయలేదు.
కథ ఇక్కడే ముగిసిపోలేదు, శ్రీమంతుడు సినిమాలో లాగా తన ఊరికి ఏదైనా చెయ్యాలనుకొని తనలా తన ఊరిలో ఇంకెవ్వరూ చదువుకు దూరం కాకూడదని స్వంత డబ్బులతో స్కూల్ కట్టించాడు.
చివరికి దీని నుంచి మనం నేర్చుకునేది ఏమైనా ఉందా అంటే, ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది కాకపోతే దాన్ని మనమే ప్రపంచానికి చూపెట్టాలి ఆ కళను ప్రదర్శించే ప్లాట్ఫారంని మనం వెదుక్కోవాలి లేదంటే నిర్మించుకోవాలి. వంట చేయడం అనేది కూడా ఒక కళే, దాన్ని సరైన చోట ప్రదర్శించబట్టే అతను విజేత అయ్యాడు. ఇలాంటి విజేతలు ఎక్కడో విదేశాల్లో కాదు మన ఊర్లోనే ఉంటారు, మనం వారిని చూసి స్ఫూర్తి పొందాలి.
baavundi
రిప్లయితొలగించండిThanks Sri గారు.
తొలగించండి