నేను చిన్నప్పుడు మా పక్కింట్లో ఉండే ఒక అన్నతో చిరంజీవి సినిమాకని వెళ్తే, టికెట్స్ దొరక్క మరేదో సినిమాకి వెళ్ళాము. సినిమా మొదలయి అరగంట దాటుతోంది
'హీరో లేడా ఈ సినిమాలో' అని అడిగా?
ఉన్నాడురా?
మరి ఇంత వరకు కనపడలేదే సినిమాలో.
ఇందాకే కదరా ఒక ఫైటింగ్ చేశాడు.
అతనా? హీరో లా అనిపించట్లేదే, ఆయనేం హీరో?
తమిళ్ హీరో రా
కృష్ణ, శోభన్బాబు లాగా ఉంటారనుకున్నానే హీరో అంటే. కనీసం చిరంజీవి, కృష్ణంరాజు లా ఉన్నా ఓకే. ఇతనెవరు?
విజయ్ కాంత్ అని
రజనీ కాంత్ తమ్ముడా?
కాదు, ఇతను వేరే.
మనిషి అందంగా లేకపోయినా అతని వాయిస్ భలే ఉంది అనుకున్నా.
ఇంకోసారి మోహన్ లాల్ సినిమాకి వెళ్ళినప్పుడు అరే, ఇతని వాయిస్ కూడా భలే ఉందే అనుకున్నా.
ఈ సారి శివాజీ గణేశన్ కుమారుడు ప్రభు వంతు. ఇతని వాయిస్ కూడా బాగుందే, మన తెలుగు వాళ్ళు కాకపోయినా తెలుగు భలే మాట్లాడుతున్నారు వీళ్ళంతా. సుమన్, రాజశేఖర్ కూడా తమిళ్ సినిమా నుంచే వచ్చారు. కానీ వీళ్లందరి వాయిస్ కూడా భలే ఉంటుందే అనుకున్నా.
ఆ తర్వాతెప్పుడో ఇంట్లోకి టివి వచ్చి, కేబుల్ కనెక్షన్ ఇంట్లోకి జొరబడి వారంలో నాలుగైదు సినిమాలు చూశాక కానీ తెలీలేదు ఆ వాయిస్ లు చాలా వరకు ఒక లాగే ఉంటున్నాయి అని. సితార, జ్యోతిచిత్ర లాంటి సినిమా వారపత్రికలు చదివాక తెలిసింది వీరందరి వెనుక డబ్బింగ్ ఆర్టిస్ట్స్ ఉంటారని, అలాంటి వారిలో సాయి కుమార్, ఘంటశాల రత్న కుమార్ లాంటి వారు ముందంజలో ఉన్నారని. అంతవరకూ పాటలు మాత్రమే వెనుక నుండి పాడుతారు అని తెలుసు కానీ మాటలు కూడా వేరొకరు మాట్లాడుతారని తెలిసింది. అలాగే సినిమాకి ఒక డైరెక్టర్, డాన్స్ డైరెక్టర్, మాటలు, పాటలు రాసేవాళ్ళు ఉంటారని. హీరో అని పిలవబడే సదరు పెద్దమనిషి ఒట్టి తోలుబొమ్మ మాత్రమే అని అప్పుడు తెలిసింది. వెనుక నుంచి ఎంతోమంది కలిసి శ్రమించి వాళ్ళు ఎలా ఆడిస్తే వీళ్ళు తెర మీద అలా ఆడతారని.
పోయిన వారం ఘంటశాల గారి తనయుడు, ప్రముఖ డబ్బింగ్ ఆర్టిస్ట్ 'ఘంటశాల రత్న కుమార్' గారు మరణించారని తెలిసింది. తండ్రిలా గాయకుడిగా రాణించలేకపోయినా డబ్బింగ్ వృత్తి లో తనదైన ముద్రవేసిన వారికిదే నా నివాళి.
డబ్బింగ్ లేకుండా వాళ్ళే మాట్లాడితే ఇదిగో ఇలా ఉంటుంది👇
రిప్లయితొలగించండికోయంబత్తూరు తెలుగు
అది తమిళ్ తెలుగో, తెలుగు తమిలో లేక తెగులో తెలియట్లేదు మేష్టారు.
తొలగించండి