ఎన్టీఆర్, చిరంజీవి కాలంలోని పాత తెలుగు సినిమాల్లో అరిగిపోయిన ఫార్ములా తో (తల్లికి మందులు లేక మోసం చేయడం లాంటి) మొదలవుతుంది హీరో ఎలా మోసగాడిగా మారాల్సి వచ్చింది అనేది సినిమాలో కూడా. ఆ కాలంలో అంటే హీరో మంచివాడు అనే జస్టిఫికేషన్ ఇవ్వాలి కాబట్టి ఇలాంటి సీన్స్ ఒక నాలుగైదు పెట్టాలి, ఈ కాలంలో అలాంటివి అవసరం లేదు.
తర్వాత యధావిధిగా అన్ని తెలుగు మాస్ సినిమాలో లాగా స్టార్టింగ్ లో హీరో ఒక ఫైట్ చెయ్యాలి కాబట్టి అదీ చేయించి కథ మొదలెడతారు. ఇంతోటి సినిమా తీయడానికి మనోళ్ళు సరిపోరు అన్నట్లు జెఫ్రీ అనే ఒక హాలీవుడ్ డైరెక్టర్ ని తెచ్చారు. (అక్కడ బేరాలు లేక ఇక్కడికి వచ్చిన చోటా మోటా డైరెక్టరేమో తెలీదు, తెలుసుకోవాలనే ఇంట్రస్ట్ లేదు)
కాజల్, సునీల్ శెట్టి తో పాటు హీరో కూడా ఫేడ్ అవుట్ అయిన వారే కాబట్టి కాస్టింగ్ పరంగా పెద్దగా ఖర్చు కూడా అయి ఉండదు, బాహుబలి లాంటి పీరియాడిక్ సినిమా కాదు, KGF లాంటి భారీ చేజింగ్ సీన్స్ ఉన్న సినిమా యెంత మాత్రం కాదు, మరి ఈ మాత్రం సినిమాకా 50 కోట్లు ఖర్చు అయిందన్నారు? ఓ పాతిక కోట్లు ఎక్కువ చెప్పారేమో అనిపించింది. దీనికి థియేటర్స్ నుంచి కలెక్షన్స్ 2 కోట్లు మాత్రమే వచ్చాయని టాక్, మరి మంచు వారికి పెద్ద స్థాయిలోనే నష్టం వచ్చి ఉండాలి.
అప్పట్లో సచిన్ అని ఒక బడా వ్యాపారవేత్త కొడుకు సంవత్సరానికి ఒక తెలుగు సినిమా వదిలేవాడు, వాళ్ళ నాన్నే ఆ ఖర్చు భరించేవాడేమో మరి. అలాగే మోహన్ బాబు పిల్లలు కూడా వాళ్ళ నాన్న సంపాదించిన డబ్బుతో సంవత్సరానికి తలా ఒకటి తీస్తుంటారేమో. ఈ ఫామిలీ అనే కాదు సినిమా ఇండస్ట్రీ లో అన్ని హీరో ల ఫామిలీస్ ఇంతేగా. సరేలే మనదేం పోయింది అమెజాన్ కి, నెట్ ఫ్లిక్స్ కి చందా కట్టుకోవడమే కదా.
సినిమాలో అంత పెద్ద స్కాం చాలా సింపుల్ గా చేసినట్లు చూపిస్తారు కానీ నమ్మబుద్ది వెయ్యదు, కాకపోతే 2016 లో షాగీ రవీందర్ అనబడే 24 ఏళ్ళ యువకుడు చేసిన మీరా రోడ్ కాల్ సెంటర్ స్కాం ని బేస్ చేసుకొని తీసిన సినిమా కాబట్టి నమ్మాల్సిందే.
ఆస్టేలియా లో కూడా ఇలాంటి స్కామ్స్ జరుగుతుంటాయి. నాకు తెలిసిన ఒక వ్యక్తి నమ్మేసి 2000 డాలర్లు కూడా కట్టేసాడు. F. M ల్లో టీవీ ల్లో కూడా ఇల్లాంటి ఫేక్ కాల్స్ నమ్మొద్దని అనౌన్స్ చేసింది గవర్నమెంట్ అంటే మీరే అర్థం చేసుకోండి యెంత మంది బకరాలు అయి ఉంటారో.
అసలు విషయం ఏమిటంటే ఇక్కడి కొచ్చిన కొందరు స్థానికులు, విదేశీయులు చేస్తున్న జాబ్ తో పాటు సైడ్ బిజినెస్ చేసి రెండు చేతులా సంపాదిస్తుంటారు, ఆ సైడ్ బిజినెస్ అంతా కార్డు payments ద్వారా కాకుండా క్యాష్ రూపంలో జరుగుతుంటుంది. దీని వల్ల వాళ్ళు ఆ సైడ్ బిజినెస్ వల్ల సంపాదించిన దానికి టాక్స్ కట్టరు, సో ఆ భయం అలాగే ఉండిపోతుంది దాన్ని ఈ స్కాం చేసే వాళ్ళు కాష్ చేసుకుంటారు. వాళ్ళు పది మంది మీద వల చేస్తే అందులో ఇద్దరు ముగ్గురు చిక్కుకుంటారు.
ఉదాహరణకి, ఒక మూడేళ్ళ క్రితం అనుకుంటా, నాకు ఇలాగే ఒక కాల్ వచ్చింది. నువ్వు కార్ రివర్స్ చేస్తూ మరొక కారుని గుద్దావు, ఆ విషయం ఓల్డ్ సీసీ కెమెరా రికార్డ్స్ డిలీట్ చేస్తున్నప్పుడు బయట పడింది కాబట్టి ఆ డామేజ్ కి డబ్బులు కట్టు అన్నారు. అది స్కాం అని నాకు అర్థం అయింది ఎందుకంటే నాకు అప్పటికి డ్రైవింగ్ రాదు కాబట్టి, కానీ వేరొకరైతే ఆ వల లో చిక్కుకునే ఛాన్స్ ఉంది. స్కాం చేసే వాళ్ళు కూడా పోతే వెంట్రుక వస్తే కొండ అని అనుకునే మొదలుపెడతారు.
క్లుప్తంగా జరిగినదేమిటంటే షాగీ అనే యువకుడు కాల్ సెంటర్ ఓపెన్ చేసి యువతీ యువకులను రిక్రూట్ చేసుకొని వారికి ట్రైనింగ్ ఇచ్చి అమెరికన్లకు ఫోన్ చేయించి పోయిన ఏడాది మీరు లేదా మీ ఆడిటర్ టాక్స్ పూర్తిగా కట్టలేదు, ఇంకా ఇంత అమౌంట్ కట్టాల్సి ఉంది ఈ రోజు లోగా కట్టకపోతే రేపు ఉదయాన్నే FBI వాళ్ళు మీ డోర్ తలుపు తట్టాల్సి వస్తుంది జాగ్రత్త అనే హెచ్చరికతో కూడిన బెదిరింపు కాల్స్ చేస్తుంటారు. అలా రోజుకో 100 రాళ్ళు విసిరితే ఒక పది రాళ్ళు తగులుతూ ఉండేవి. ఆ కాల్ సెంటర్ లో పని చేసేవారికి జీతంగా 15000 రూపాయల దాకా ఇస్తూ డీల్ క్లోజ్ చేసి మనీ రాబట్టిన వారికి ఇన్సెంటివ్స్ కూడా ఇచ్చేవారు. అలా స్కాం ద్వారా 380 మిలియన్ డాలర్ల దాకా గుంజారట. ఆ తర్వాత స్కాం బయట పడ్డప్పుడు ఆటను దుబాయ్ పారిపోయి తర్వాత పోలీసులకి చిక్కి కొన్ని నెలలకు బయటికి వచ్చి దర్జాగా బతుకుతున్నాడని గూగులమ్మ చెబుతోంది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి