20, జులై 2021, మంగళవారం

మనం ఊహించనిది జరిగేదే జీవితం అంటే!

ఒరేయ్ గోవిందం, తాజ్ మహల్ గురించి నీకేం తెలుసో చెప్పరా?

ఆ బ్రాండ్ పొడి తో చాయ్ చేస్తే ఘుమ ఘుమలాడిపోతది సార్. 

ఖర్మ రా, పోనీ ఇండియా గేట్ గురించి 

ఆ బ్రాండ్ బియ్యంతో తో బిర్యాని చేస్తే ఘుమ ఘుమలాడిపోతది సార్. 

పోనీ చార్మినార్ గురించి చెప్పు 

అది తెలీనోడు ఎవడుంటాడు సార్, మనకు బాగా పరిచయం దాంతో.  

ఇప్పుడు దారిలోకి వచ్చావ్, చెప్పు  

ధారాళమైన పొగ, తక్కువ ఖర్చులో దొరికే సిగరెట్ సార్. 

పోనీ కనీసం, గాంధీ జయంతి గురించి చెప్పు?

గాంధీ గురించి తెలియదు గానీ జయంతి అంటే మా పక్కింట్లో ఉండే ఆంటీ. 

మన దేశ ఐకాన్స్ తెలీదు, జాతి పిత గురించి తెలీదు, ఎందుకు పనికొస్తావురా నువ్వు. రేపు వచ్చేప్పుడు మీ అయ్య సిగ్నేచర్ తీసుకురా. 

మరుసటి రోజు ఆ టీచర్ క్లాస్ లోకి రాగానే టేబుల్ మీద 



అంతే, అగ్గి  మీద గుగ్గిలం అయ్యాడు ఆ టీచర్, ఇలాంటి మూర్ఖుడిని చదివించడం డబ్బు దండగ అని ఆ కుర్రాడి పేరెంట్స్ కి నచ్చ జెప్పి స్కూల్ నుంచి పంపించేశాడు.  తెలివితక్కువ గోవిందం స్కూల్ నుంచి వెళ్లిపోవడంతో మిగతా స్టూడెంట్స్ అందరూ సంతోషించారు. 

                                                                     ***************

చూస్తుండగానే 20 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆ 20 సంవత్సరాలు తాను స్కూల్ నుంచి పంపించేసిన గోవిందం గురించి మధన పడుతూనే ఉన్నాడు. ప్రతీ ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉండి ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ లేకపోతేనేం మాథ్స్ లోనే సైన్స్ లోనే తనకు పట్టు ఉండి ఉండచ్చు, ఆ దిశగా నేను అతన్ని ప్రోత్సహించి ఉంటే అతను ఖచ్చితంగా గొప్పోడు అయ్యేవాడు అనుకునేవాడు. 

                                                                   ***************

"పోయిన నెల COVID తో హాస్పిటల్ లో చేరిన మిమ్మల్ని కాపాడలేమని ఈ సిటీలో ఉండే డాక్టర్స్ అందరూ చేతులెత్తేస్తే ఈ ఒక్క డాక్టర్ గారే ముందుకొచ్చారు. మీరిలా తిరిగి కళ్ళు తెరవగలుగుతున్నారంటే దానికి కారణం ఈయనే  నాన్నా" అని అప్పుడే రూమ్ లోకి ఎంటర్ అవుతున్న డాక్టర్ ని చూపించాడు కొడుకు.  

మెల్లగా కళ్ళు తెరిచి, అద్దాలు పెట్టుకొని ఆ డాక్టర్ కి దండం పెట్టబోయాడు మన కథలోని స్కూల్  మేష్టారు. 

మేస్టారూ, మీరు నాకు దండం పెట్టడమేమిటి అని ఆయన చేతులు పట్టుకునే లోపే శ్వాస తీసుకోవడానికి ఆ పెద్దాయన ఇబ్బంది పడుతున్నారని అర్థం చేసుకున్నాడు డాక్టర్. ఉన్నట్టుండి ఏమైపోయింది అనుకొని జరిగిందేమిటో అర్థం చేసుకొని  వెంటనే రియాక్ట్ అయి మేష్టారు ని మరోసారి కాపాడాడు ఆ డాక్టర్. 

ఆ డాక్టర్ ఎవరో కాదు, చిన్నప్పుడు ఇదే మేష్టారు స్కూల్ నుంచి మూర్ఖుడని ముద్ర వేసి పంపిన మన హీరో గోవిందం అనుకుంటే, మీ ఆలోచనలకు అడ్డుకట్ట వెయ్యండి. తెలుగు సినిమాలు యెక్కువ చూడటం , ఇన్స్పిరేషన్ ఇచ్చే ఇన్సిడెంట్సో లేక మోటివేషన్ కి పనికొచ్చే కథలో ఎక్కువ చదివితే ఇలాగే తయారవుతారు.  

అసలు జరిగిందేమిటంటే, మన హీరో గోవిందం ఆ రూమ్ క్లీన్ చెయ్యడానికి వచ్చి ఖాళీ సాకెట్ ఏదీ దొరక్క, వెంటిలేటర్ ప్లగ్ పీకేసి అందులో వ్యాక్యూమ్ క్లీనర్ ప్లగ్ పెట్టి ఆ రూమ్ క్లీనింగ్ మొదలెట్టాడు.  

3 కామెంట్‌లు:

  1. ఆఁయ్, మా దేశంలో సినిమా కథలు అలాగే ఉంటాయండీ. ఫాన్సండీ ఫాన్స్ ఈలలు వేసి పువ్వులు విసరాలి కదా మరి. మీరు ఎగతాళి చేస్తే గనక ఫాన్స్ అసోసియేషన్లకు చెబుతా గుర్తుంచుకోండి 🙂🙂. ఆ మధ్యెప్పుడో ఓ ప్రముఖ తెలుగు నిర్మాత గారు థియేటర్లకు రమ్మని మా సినిమాలు చూడమని మిమ్మల్ని మేం బలవంతం చెయ్యడం లేదే అన్నాడు బాహాటంగా టీవీ తెర మీద, గుర్తుందా? సో, అదన్నమాట సంగతి.

    పైన మీరు చెప్పిన కథ మామూలుగా అయితే సిగ్నేచర్ బాటిల్ ని చూసిన టీచర్ మహదానంద పడిపోయి, నవ్వి, ఆ కుర్రాడి తల నిమురుతూ “సర్లే, సిగ్నేచర్ తీసుకొచ్చావుగా, పాసవుతావులే పో” అంటాడు, అక్కడితో ముగుస్తుంది. కానీ మీరు extend చేసిన కథ బాగుంది మన సినిమాల మీద విసురు విసరడానికి 👌.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. ఆ పని మాత్రం చెయ్యకండి మేష్టారు, ఇంకెప్పుడూ తెలుగు సినిమాల జోలికి వెళ్ళను. ఫాన్స్ అసోసియేషన్ ఆగడాలను కడపలో చాలా సార్లు చూశాను.

      ఆ తెలుగు నిర్మాత ఎవరో గానీ ఆయన అన్నదీ కరెక్టే. మనమే పొలోమని పరిగెత్తుకెళ్లి చూసొస్తాము.

      "సిగ్నేచర్ బాటిల్ ని చూసిన టీచర్ మహదానంద పడిపోయి, నవ్వి, ఆ కుర్రాడి తల నిమురుతూ 'సర్లే, సిగ్నేచర్ తీసుకొచ్చావుగా, పాసవుతావులే పో' అంటాడు, అక్కడితో ముగుస్తుంది" కాలం ఇలానే ఉంది ఇప్పుడు మరి.


      మెచ్చినందుకు ధన్యవాదాలు మేష్టారు. అన్ని జోకులు అక్కడా ఇక్కడా విన్నవే మేష్టారు, అన్నింటినీ ఆర్డర్ లో పెట్టి మన తెలుగు సినిమా లాగా తయారుచేశా అంతే. అర్రే, తెలుగు సినిమాల జోలికి వెళ్ళను అని మాట ఇచ్చి తప్పానే!

      తొలగించండి