27, మార్చి 2026, శుక్రవారం

అంతన్నాడు ఇంతన్నాడే గంగరాజు

అప్పుడెప్పుడో పన్నెండేళ్ళ క్రితం ఆస్ట్రేలియా లో మైనింగ్ త్రవ్వకాలు ఎక్కువగా ఉండి ఎక్కువ ఎగుమతి చేసే రోజుల్లో ఒక ఆస్ట్రేలియన్ డాలర్ విలువ, అమెరికన్ డాలర్ కంటే కాస్త ఎక్కువ ఉండేది. ఆ తర్వాత స్థానిక ప్రజల నుండి పర్యావరణ ఆందోళనలు మరికొన్ని కారణాల వల్ల అలాగే కొత్త గనుల తవ్వకాన్ని ఆపేయడం వల్ల, పైగా అన్నీ దిగుమతులే తప్ప ఎగుమతులు తక్కువ అవ్వడంతో అలాగే రెండు దేశాల ఆర్థిక విధానాలలో ఉండే తేడాల వల్ల అమెరికన్ డాలర్,  ఆస్ట్రేలియన్ డాలర్ విలువను దాటేసింది. (నా పరిజ్ఞానం ప్రకారం) 

ఈ ఆస్ట్రేలియా ఎప్పుడూ దిగుమతులు చేసుకోవడం తప్పితే ఎగుమతులు తక్కువ, అందుకే కోవిడ్ టైములో టాయిలెట్ టిష్యూల కోసం కూడా గొడవ పడ్డారు షాప్స్ లో మాక్కావాలంటే మాకు కావాలని. ఎప్పుడూ దిగుమతులే  చైనా, ఇండియా బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి. చాలా trucks వెనుక "Without trucks, Australia stops" అని రాసి పెట్టుకుంటారు. 

నేను ఆస్ట్రేలియా వచ్చిన కొత్తలో 50 రూపాయలు ఉండేది, తర్వాతి సంవత్సరం అనుకుంటా అది 60 రూపాయలకి పెరిగి తర్వాత 48 రూపాయల వరకు పడిపోయింది. ఈ మధ్య మళ్ళీ బాగా పెరిగి 60 ని దాటేసింది. గత పదేళ్ళలో డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియా అని, మోడీ పొడిచేస్తారని, దంచేస్తారని, దున్నేస్తారని, కాంగ్రేస్ పార్టీ చేతగానితం వల్ల పడిపోయిన రూపాయిని కాపాడేస్తారని అందరూ అంటూంటే విని ఏదో ఒక రోజు  ఒక ఆస్ట్రేలియన్ డాలర్ విలువ ఏ ముప్పై రూపాయిలకో పడిపోతుందేమో అని ఆశ పడేవాడిని. (నేను ఏ ఒక్క పార్టీ అభిమానిని కాదు, ఒక సామాన్య వ్యక్తిని...సగటు స్వార్థపరుడినే ఏదో రూపాయి విలువ పెరిగితే ఇండియన్ బ్యాంకుల్లో ఉండే కాస్తో కూస్తో రూపాయలు ఇక్కడికి తెచ్చుకుంటే బోలెడు డాలర్స్ అవుతాయని పేరాశ) 

ఇండియన్ రూపాయి ఎందుకు ఎదగటం లేదంటే వర్షాలు సరిగ్గా పడలేదు అన్నంత ఈజీ గా ఏవేవో విశ్లేషణలు చేస్తుంటారు గానీ ఈ ఆర్థిక శాస్త్రం లో నేను చాలా వీక్ కాబట్టి ఎప్పటికీ అర్థం కాదు. ఇదంతా గత కాంగ్రేసు పార్టీ  చేతగాని పరిపాలన వల్లే అని పదేళ్ళు దాటాక కూడా మోడీ అభిమానులు అంటూ ఉంటే జీర్ణం చేసుకోవడం కష్టంగా ఉంది. డాలర్ విలువ పెరిగిందంటే రూపాయి తగ్గినట్లు కాదు అని అంటారు మోడీ అభిమానులు మరి ఇదే అభిప్రాయం పదిహేనేళ్ల కిందట ఎందుకు లేదో అర్థం కాదు. అదేదో సినిమా లో మా నాన్న అలా చేసి ఉండకపోతే ఇవాళ నేనిలా ఉండేవాడిని కాదు అని బ్రహ్మానందం వాపోతుంటాడు కానీ బాగు పడటానికి ట్రై చేయడు, అచ్చంగా ఆ రోజుల్లో నెహ్రూ అలా చేసి ఉండకపోతే దేశం ఇప్పుడు బ్రహ్మాండంగా ఉండేది అన్నట్లుగా. 

"కావమ్మ మొగుడంటే కామోసు" అన్నట్లు "మోడీ పొడిచేస్తారని" అందరూ అంటే నిజమే కాబోలు అని నేనూ అనుకున్నా. 

19, ఫిబ్రవరి 2026, గురువారం

మన శంకర వరప్రసాదు గారు

మొన్న రాత్రి "మన శంకర వరప్రసాదు గారు" సినిమా చూశా OTT లో, సినిమా గొప్పగా ఏమీ లేదు కానీ టైం పాస్ మూవీ. సంక్రాంతికి వచ్చిన సినిమాల్లో రెండు లేదంటే మూడో స్థానం లో పెట్టచ్చు. ఆఖరి స్థానం దేనికి ఇవ్వచ్చో అందరికీ తెలుసు. మొదటి స్థానం నేనైతే  "నారి నారి నడుము మురారి" కి ఇస్తాను, కొందరు "అనగనగా ఒక రాజు" అన్నారు కానీ నాకెందుకో అదంత నచ్చలేదు. 

వింటేజ్ చిరంజీవి అదీ ఇదీ అంటున్నారు గానీ ఇదంతా చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకోవడం లాగానే ఉంది. అలాంటి వేషాలు ఎప్పుడో చూసేశాం మళ్ళీ అవే చూడటమేమిటీ మన ఖర్మ కాకపోతే. సినిమా అంటేనే బిజినెస్ కాబట్టి ఏది అమ్ముడుపోతోందో అదే తయారు చేస్తారు. 

ముసలోడికి దసరా పండుగ అన్నట్లుగా ఈ వయసులో ఈ వేషాలు అవసరమా? వయసుకు తగినట్లు అమితాబ్ , రజినీ లాగా చేయచ్చుగా అంటున్నారు గానీ వాళ్ళు మాత్రం చిరంజీవిలా కాస్త కాలు కదిపే శక్తి ఉంటే ఎందుకు వెయ్యరు. ఎవరి ఏడుపేదో వాళ్ళు ఏడుస్తున్నారు ఇష్టమైతే చూడండి లేదంటే దూరంగా ఉండండి. 

ఈయన హీరో వేషాలు వెయ్యడం ఆపేస్తే యువకులకు అవకాశం ఇచ్చినట్లు ఉంటుంది అంటారు గానీ ఇదేమీ ఇండియన్ క్రికెట్ టీమ్ కాదుగా పదకొండు మందే ఆడాలి అనటానికి సీనియర్స్ తప్పుకొని జూనియర్స్ కి అవకాశాలు ఇవ్వాలని. 

వెధవ డబ్బు కక్కుర్తి తప్ప మరేమీ లేదు, అంత సంపాదించాడు ఇక ఆపేయచ్చుగా పచ్చి స్వార్థపరుడు ఆయన అంటున్నారు గానీ డబ్బు సంపాదించే అవకాశం ఉన్నప్పుడు ఎంతమంది పరుగు ఆపారో చెప్పండి. యెంత చెట్టుకి అంత గాలి, రిటైరైన వాళ్ళు కూడా మనం సంపాదించింది చాల్లే అని ఇంట్లో ఊరికే కూర్చోవడం లేదుగా వారి టాలెంట్ కి తగ్గట్లు వాళ్ళు బిజినెస్ లేదంటే ఇంకో ఉద్యోగమో చేసి మరింత డబ్బు పోగు చేసుకోవడం లేదూ?

చూసేవాళ్ళు లేకపోవబట్టేగా మోహన్ బాబు, రాజశేఖర్ లాంటి వాళ్ళు ఇంటి పట్టునే కూర్చున్నారు. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లను అక్కడో ఇక్కడో చూసే వాళ్ళు ఉన్నారు కాబట్టి కాస్తో కూస్తో ఎదురు ఈదగలుగుతున్నారు. 

ఇప్పట్లో డెబ్భై ఏళ్ళు దాటితే మంచం మీద పడకుండా ఉండి కాస్త అటూ ఇటూ తిరిగితే చాలు అనుకుంటున్న వారిని ఎంత మందిని చూడలేదు అలాంటిది ఈ వయసులో శరీరాన్ని ఆ మాత్రం రిథమిక్ గా కదపగలుగుతున్నారంటే మెచ్చుకోవాల్సిందే. ఆపరేషన్స్ చేయించుకున్నారో, మందులు వాడుతున్నారో తర్వాత విషయం. 45 యేళ్ళకే బద్దకించి సినిమాలో చాలా వరకు డూప్ లను వాడాడు  అని చివరి స్థానం లో మిగిలి పోయిన సినిమా గురించి ఎంత మంది విమర్శించారో మర్చిపోతే ఎలా? మొదటి సారి తనని స్క్రీన్ మీద చూసినప్పుడు "హీరో అంటే ఇలా కదా ఉండాలి" అని అనుకున్న నేనే రాజుగారేంటి ఇలా అయ్యారు అనుకున్నా. 

నేనూ స్కూల్, కాలేజీ రోజుల్లో చిరంజీవి సినిమా వస్తే ఫాన్స్  షో అని జాబ్ చేయడం మొదలెట్టాక మొదటిరోజు మొదటి అట అని పెళ్ళైన తర్వాత  మొదటి వారం చూస్తే చాలని ఆపైన రెండో వారం చూసినా వచ్చే నష్టం లేదని ఇప్పుడైతే నెల తర్వాత OTT లో చూడచ్చులే అని థియేటర్ కి వెళ్లడం మానేశా ఇంకాసిన్ని ఏళ్ళు గడిస్తే చూడకపోతే వచ్చే నష్టం ఏమీ లేదు అని అనుకుంటాం. ఆ ఇంకాసిన్ని ఏళ్ళు గడిచే లోగా ఈ చిరంజీవికి కూడా  బేరాలు తగ్గి వేషాలు ఆపెయ్యచ్చు. 

థియేటర్ కి వెళ్ళి ఎగబడి చూసే ఎర్రి ఫాన్స్ ఉన్నంతవరకూ తగ్గడంటే తగ్గడంతే ఆయన తాత అయినా ముత్తాత అయినా. 

2, జనవరి 2026, శుక్రవారం

మెగాస్టార్ మండలం

                                                    అది 2040వ సంవత్సరం 

చూడండన్నయ్యా, ఈయన చేసిన పని ఎమైనా బాగుందా?  

ఏం చేశాడమ్మా?

మాకు మాట మాత్రమైనా చెప్పకుండా, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. మీరైనా మీ ఫ్రెండ్ ను అడగండి ఎందుకలా చేసాడో, మాతో ఏమీ చెప్పట్లేదు. 

ఉండమ్మా, నేను వాడితో మాట్లాడతానుగా? ఏంట్రా? నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నావట?

అవున్రా.  

ఇంకో ఐదేళ్ళ పాటు పనిచేయగల శక్తి సామర్థ్యం నీకుందిగా, పైగా మొన్నీ మధ్యే అన్నావ్ 2050 వరకు ఉద్యోగం చేస్తూనే ఉంటాను అని, మరి ఇప్పుడేంటి ఉన్నట్లుండి

... 

మేము ఇంతమంది అడుగుతున్నా బెల్లం కొట్టిన రాయిలా, మన్ను తిన్న పాములా సమాధానం చెప్పవేమిట్రా?

కొంచెం డబ్బు అవసరం పడింది. 

మమ్మల్ని సాయం అడగచ్చుగా?

కొంచెం డబ్బు అంటే కొంచం కాదు, కొద్దిగా ఎక్కువ మొత్తంలో. 

మరి ఆ డబ్బు ఎక్కడ?

నా దగ్గర లేదు, ఇక మనకు రాదు. 

మరి వృద్ధాప్యం లో మా  ఖర్చులకు,  అమ్మాయి పై చదువులకి,  అబ్బాయి పెళ్ళికి ఎక్కడి నుంచి తెస్తారో అడగండన్నయ్యా?

చెల్లాయి ఇంతగా బాధపడుతున్నా, దున్నపోతు మీద వానపడినట్లు ఉలుకూ పలుకూ లేకుండా ఎలా ఉండగలుగుతున్నావ్ రా?

గుర్తొచ్చింది, ఈ మధ్య ఖాసీం అన్నతో ఫోన్ లో గంటల తరబడి మాట్లాడటం విన్నాను అన్నయ్యా. 

అవునమ్మా, వాడు కూడా ఇలాగే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడని విన్నాను. మర్చిపోయా, ఆ బడదల్ గాడు కూడా ఇలాగే  వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడు. 

అవునా?

అవునమ్మా. వీళ్ళు ముగ్గురూ మూకుమ్మడిగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాక జుట్టు పీక్కోబోయి నెత్తి మీద చెయ్యి పెడితే అక్కడ ప్లే గ్రౌండ్ తప్ప దాని మీద గడ్డి లేదని తెలిసి వచ్చింది అప్పుడు 2040 కాబట్టి. 

ఈ విషయం తేల్చాలంటే వెంటనే అమెజాన్ లో ఆర్డర్ పెట్టాలి 

ఆర్డర్ దేనికి అన్నయ్యా

ఒక వైట్ బోర్డు , కొన్ని పుష్ పిన్నులు, దారాలు, మార్కర్లు ఆర్డర్ చెయ్యడానికి. 

ఇప్పుడు అవెందుకు?

సినిమాలు చూడట్లే, ఏదయినా విషయం పరిశోధించాలంటే అవన్నీ అవసరం. 

ఈ మాత్రం దానికి అవన్నీ ఎందుకు? వీరందరి కామన్ పాయింట్ ఏమిటో కనుక్కుంటే సరి పోతుందిగా అన్నయ్యా? 

అన్నయ్యే?

అన్నయ్యా?

అవును, వీళ్ళందరి కామన్ పాయింట్ అన్నయ్యే. 

ఉండు కళాధర్ కి ఫోన్ చేస్తాను. 

అతనెవరు?

వాడు మెగా స్టార్ ఫాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు. 

హలో, కళాధరేనా మాట్లాడేది?

కాదండి, ఆయన భార్యను. 

అమ్మా, మీ ఆయన వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నాడా గత కొన్ని రోజుల్లో?

అవునండీ, పోయిన వారమే తీసుకున్నాడు. ఆయనే కాదు నేను కూడా తీసుకున్నా?

ఎందుకో తెలుసుకోవచ్చా?

బ్లా బ్లా బ్లా 

ఏమన్నారు ఆవిడ?

చెల్లమ్మా, ఘోరం జరిగి పోయిందమ్మా?

ఏమైందన్నయ్యా?

గత ముప్పై సినిమాలు మట్టి కొట్టుకుపోవ"ఢాం"  వల్ల ఆ హీరో స్టార్ డం తగ్గి దగ్గొచ్చే వయసులో కూడా తండ్రి తాత వేషాలు వెయ్యడానికి రెడీ గా లేరు కాబట్టి ఆయన 200 వ సినిమా హీరో గా మొదలెట్టారు. 

అయితే?

ఆ సినిమా కి పది కోట్ల బడ్జెట్ తక్కువై సినిమా ఆగిపోతే వీరంతా కలిసి ఆ డబ్బు పంపారట ఆ హీరో కి. 

ఈ మెగా వెధవలు సరే ఆవిడ బుద్దేమయ్యిందట?

ఆవిడ మెగా స్టార్ ఫాన్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షురాలట, పళ్ళు రాలగొట్టే వాళ్ళు లేక.  అయినా వెధవా, ఈ వయసులో ఈ వేషాలు అవసరమేమిట్రా? ఉన్న డబ్బంతా ఇచ్చేసి అడుక్కుతింటావా?

అవసరం లేదు, మా బాస్ పది పైసలతో కూడా పది లక్షలు ఎలా సంపాదించచ్చో మాకు ఛాలెంజ్ సినిమాలోనే చెప్పి మాకు ఇన్స్పిరేషన్ అయ్యాడు, ఇప్పుడు మళ్ళీ మేము పది పైసలతో మొదలెట్టి సంపాదించగలం, అంతేకాదు చెప్పులు కుట్టి కూడా ఒక షాప్ తెరవచ్చని స్వయంకృషి లో చేసి చూపించాడు, ఇలా మా హీరో మా కిచ్చిన ఇన్స్పిరేషన్ లతో పోలిస్తే మేం ఆయనకి చేసింది కేవలం ఉడత సాయం, సముద్రంలో కాకి రెట్టంత. 


                                 ************


"ఆంధ్రా కింగ్ తాలూకా" సినిమా చూసిన తర్వాత వచ్చిన పైత్యానికి పరాకాష్టే ఈ "మెగాస్టార్ మండలం" బ్లాగ్ పోస్ట్ అంతే గానీ మెగా స్టార్ ని కించ పరచడానికి కాదు. కేవలం సరదాకే. 

కాకపోతే వందల సార్లు చూసిన సినిమాలని కూడా రీ-రిలీజ్ లని  ఒకటికి పది సార్లు రిలీజ్ చేస్తుంటే (మురారి సినిమా రెండో సారి, జల్సా మూడో సారి రీ రిలీజ్ చేశారట జనవరి ఫస్ట్ కి) వాటిని కూడా మళ్ళీ థియేటర్ లకి వెళ్లి చూసే పైత్యపు ఫాన్స్ కి ఈ పోస్ట్ అంకితం. 

24, డిసెంబర్ 2025, బుధవారం

అడుసు తొక్కాలి..కాలు కడుక్కోవాలి - ఇదే నేటి సూత్రం

అడుసు తొక్కనేల కాలు కడగనేల అన్నారు కానీ అవన్నీ పాత కాలం మాటలు. లైంలైట్ లో ఉండాలంటే ఇదే ఫార్ములా ఫాలో అవ్వాలి ఇప్పుడు. 

శివాజీ, రాజేంద్ర ప్రసాద్ ఇలా ఒక్కరని ఏం చెపుతాం, ఆచి తూచి మాట్లాడే చిరంజీవి కూడా లేడీస్ హాస్టల్ అనేసి ఆ తర్వాత తూచ్ నేనా ఉద్దేశ్యంతో అనలేదు అన్నాడు. 

నిన్నటికి నిన్న శివాజీ ..  సామాన్లు, దరిద్రపు *** అంటూ బూతులు మాట్లాడి బురద అంటించుకున్నాడు. 

రాజేంద్ర ప్రసాద్ కూడా ఈ మధ్య తరచుగా బూతులు వాడుతూ లైంలైట్ లో ఉంటున్నాడు. ఈయన కాస్త నయం, తోటి మగ నటులపైనే బూతులు మాట్లాడాడు కాబట్టి సరిపోయింది. 

ఈ మధ్య చాలా మంది స్టేజి ఎక్కితే కళ్ళు తాగిన కోతులే, మత్తులో ఏదేదో వాగడం ఆ తర్వాత క్షమాపణలు చెప్పడం. మోటు సామెత, కాకపోతే సందర్భానికి సరిపోతుందని చెప్తున్నా. "అచ్చమైన సంసారి ఉచ్చపోసి ఇల్లలికాడట" అట్లుంది శివాజీ వ్యవహారం. ఆయన చెప్పేది ఆయనకి ఒప్పు అనిపించచ్చు కానీ అదేదో కాస్త పద్దతిగా మంచి మాటలతో చెప్పి ఉంటే బాగుండేది. మొన్నా మధ్య వచ్చిన "కోర్ట్" సినిమా లోని మంగపతి క్యారెక్టర్ ట్రాన్స్ లోంచి బయటికి వచ్చినట్లు లేరు ఈ శివాజీ ఇంకా. 

ఇప్పుడో చిన్న పిట్ట కథ. అనగనగా ఒక ఊర్లో ఒక పేదవాడు తన దరిద్రాన్ని వదిలించుకోవడానికి, అడిగిన వారికి కాదనకుండా సహాయం చేస్తారనే పేరున్న ఆ దేశపు రాజు గారి దగ్గరికి వెళ్ళి తనకు చేతనైనంతలో ఒక టెంకాయ సమర్పించి, కాస్త సహాయం చేయమని అర్థించాలనుకున్నాడు. 

రాజుగారి దగ్గర "మహారాజా! ఈ టెంకాయను పుచ్చుకోండి, కాస్త డబ్బు ఇచ్చి నా పేదరికాన్ని పోగొట్టండి." అని అర్ధించడానికి ఏమి మాట్లాడాలో ముందుగానే ప్రిపేర్ అయ్యాడు. 

రాజభవనాన్ని, రాజుగారి మందిమార్బలాన్ని, ఆడంభరాలని చూడగానే ఆ పేదవాడికి నోటా మాట పడిపోయింది.  చాలాసేపు ఎదురు చూసిన రాజు గారు "నీకేం కావాలి?" అని సింహంలా గర్జించారు.

కుందేలు పిల్లలా భయపడిపోయిన ఆ పేదవాడు భయంతో, కంగారులో తడబడుతూ "మహారాజా టెంకాయ పిచ్చికొండ" అన్నాడట. అక్కడ అతను  భయంతో ఒక మాట కు బదులు వేరే మాట మాట్లాడినట్లు వీళ్ళు జనాల్ని, ప్రెస్ ని చూడగానే రెచ్చిపోయి పిచ్చి పిచ్చిగా పచ్చిగా మాట్లాడేస్తారేమో. 

అయినా ఇలాంటి వాటిల్లో మా దబిడి దిబిడి బుల్ బుల్ బాలయ్య తర్వాతే ఇంకెవరైనా.  

11, డిసెంబర్ 2025, గురువారం

కడలి తరంగాలు - పిచ్చి పూనడాలు - వెయ్యి కథలు

ఒక 20 సంవత్సరాలు వెనక్కి వెళితే అవి నేను డిగ్రీ వెలగబెడుతున్న రోజులు.

ఎప్పుడూ కాలేజీ కి రాని నేను పది రోజులుగా క్రమం తప్పకుండా క్లాస్ కు ఎందుకు వస్తున్నానో, ఎప్పుడూ కాలేజీ కి వచ్చే ప్రతాప్ మాత్రం కాలేజీ కి ఎందుకు రావడం లేదో అర్థం కాక మా లెక్చరర్స్ ,తోటి స్టూడెంట్స్ ఎవరి జుట్టు వారు పీక్కుంటున్నారు.

ప్రతాప్ కాలేజీ కి ఎందుకు రావడం లేదో ఎవరికైనా తెలుసా అన్నాడు ఒక లెక్చరర్.

"వాడికి పిచ్చి పట్టిందట సర్ వాళ్ళ అమ్మ చెప్పింది" అని సమాధానం ఇచ్చారెవరో. 

"వాడు మరీ ఎక్కువ చదువుతాడు సర్ అందుకే పిచ్చి పట్టి ఉంటుంది" అని తీర్మానించేసాను నేనూ. 

వాళ్ళు జుట్టు పీక్కోవడం, నేను కాలేజీ కి రావడం ఆగిపోయిన రోజు అది. ఆ రోజు ఏం జరిగిందో చూద్దాం.

ఆ రోజుల్లో వరస ప్లాప్ లతో విసిగి పోయిన చిరంజీవి,  "హిట్లర్ సినిమా అయినా హిట్ అయ్యింది" అనే మాట కోసం యెంత పరి తపించి పోతున్నాడో అంత కంటే ఆతృతగా 'పోస్ట్' అనే పిలుపు కోసం ఎదురు చూస్తున్నాను.

మార్కెట్ కి వెళ్లి బీరకాయలు, బెండకాయలు తెమ్మంటే తీసుకురావు కానీ కథలు, కాకరకాయలు అంటావా అని అమ్మ అరిచే ప్రమాదం ఉంది.

కరెంట్ బిల్ కట్టి రావడం తెలీదు కానీ కథలు రాయడం వచ్చా అని నాన్న అనచ్చు

అందుకని నేను రాసిన మొట్టమొదటి కథను పత్రికకు పంపినప్పుడు ఇంటి అడ్రస్ కాకుండా కాలేజీ అడ్రస్ ఇచ్చా. 

ఆ రోజు పోస్ట్ లో "మీ పిచ్చెక్కించే అమూల్యమైన కథను మేము అచ్చు వేయట్లేదు" అని నా కథ వెనక్కి పంపితే వెక్కి వెక్కి ఏడవలేకపోయాను అది క్లాసురూం కావడం వల్ల.

మా  లెక్చరర్ ఆ కథ చదవడం మొదలెట్టాడు 

                                                            కడలి తరంగాలు 

'సాగరం ఒడ్డున కూర్చొని సుఖ్ సాగర్  నుంచి తెచ్చుకున్న బిసి బేలే బాత్ తింటూ భోరున విలపిస్తోంది భీభత్స. కడలి తరంగాలు కూడ హోరుమని  శబ్దం చేస్తూ ఆమెతో పోటీపడుతున్నాయి'

భీభత్స బెంగళూరు కి రావడం అదే మొదటి సారి బహుశా ఆఖరి సారి కూడా ఇదేనేమో. బిసి బేలే బాత్ అక్కడ ఫేమస్ అని అందరూ చెప్పగా విని, బిసి బేలే బాత్ తో పాటు 'విషం' అని రాసున్న ఒక చిన్న బాటిల్ లోని ద్రవం కలుపుకొని తింటోంది. 

"చికిత్స కు కూడా అందని మీ 'భీభత్స' మానసిక సమస్య గురించి ఏం చేయాలో తెలియట్లేదు" అని అన్నయ్య ఊస్గరిధ్ తో డాక్టర్ కుక్కలయ్య  అన్న మాటలే పదే పదే గుర్తొస్తూ మనసును దేవేస్తూ ఉన్నాయి పక్కన పానీ పూరి వాడు చేయి పెట్టి నీళ్లలో యేవో మసాలాలు కలిపి దేవినట్లు. 

భీభత్స, ఊస్గరిధ్, కుక్కలయ్య  ఇవేం పేర్లు ? అన్నాడు కథ మధ్యలో ఆపేసి 

ఈ టీవీ లో కళంకిత అని సీరియల్ వస్తోంది కదా సర్.. అలా పేరు వెరైటీ గా ఉంటే బాగుంటుందని భీభత్స అని పెట్టా, ఇక మిగతా పేర్లు గోపి, రమేష్ లాంటి కామన్ పేర్లు కాకుండా కొత్తగా అలోచించి పెట్టాను. 

అయినా బెంగుళూరు లో బీచ్ ఎక్కడుందిరా?

"చిన్నదైన వైజాగ్ లోనే ఉన్నప్పుడు దానికన్నా పెద్దదైన బెంగుళూరు లో ఎందుకు ఉండదు సర్?" నా తెలివితేటల్ని శంకించిన మా లెక్చరర్ మీదకు ఒక ప్రశ్నను సంధిస్తూ. 

సంబంధం లేకుండా మాట్లాడతావేమిటి రా?

ఇప్పుడే పిలుచుకొస్తానండి?

ఎవర్ని?

అదే సంబంధాన్ని, మన కాలేజ్ బయట టీ స్టాల్ పెట్టుకున్న తమిళియన్ని.

వాడి అవసరం లేదు, చెప్పు.

వైజాగ్ లో ఉండే సినిమా హాల్స్, కాలేజీ ల కన్నా బెంగుళూరు లో ఎక్కువ సినిమా హాల్స్, కాలేజీ లు ఉంటాయి కదా అంటే వైజాగ్ కన్నా బెంగుళూరు  పెద్దది అలాంటప్పుడు వైజాగ్ లోనే బీచ్ ఉన్నప్పుడు బెంగుళూరు  లో ఉండకుండా పోవడమేమిటి సర్? ఉండే ఉంటుంది అన్నాను.

ఇక నా ప్రశ్నలకు సమాధానం చెప్పడం కంటే ఊరుకోవడం ఉత్తమం అని చదవడం మొదలెట్టాడు

మధ్యాహ్నం అనగా బయటికి వెళ్లిన తన చెల్లెలు ఇంటికి ఇంకా రాలేదెందుకని కంగారుగా ఉన్నాడు అక్కడ హైద్రాబాద్లో ఊస్గరిధ్ 

ఆదరా బాదరా గా పక్కన ఉన్న బైనాక్యూలర్స్ తీసుకొని చుట్టూ చూస్తే తన చెల్లి బెంగళూర్ బీచ్ దగ్గర కనిపించింది. భయంతో వణికిపోయి గ్లాసులో మిగిలున్న స్కాచ్ ని అలానే వదిలేసి బీచ్ వైపు చెల్లిని కాపాడటానికి పరిగెట్టబోతుంటే బల్లి స్కాచ్  లో పడింది. 

చెల్లా లేక బల్లా, 

బల్లా లేక  చెల్లా ,

అటు చెల్లి  ఇటు బల్లి ,

ఇటు బల్లి అటు చెల్లి  

వీరిలో ఎవరిని కాపాడాలి అని క్షణం లో ముప్పాతిక సార్లు సందిగ్ధావస్థలో పడి 'నేను గోడమీద నుంచి పడిన ఈ బల్లి ని కాపాడితే ఆ దేవుడు నా గోడు విని నా చెల్లిని కాపాడటానికి ఎవరో ఒకరిని పంపిస్తాడు' అని అనుకొని బల్లిని మొదట కాపాడాలనుకున్నాడు. 

బఠాణీలు అమ్ముకోవడానికి బీచ్ కొచ్చిన అనుక్షణ్ క్షణం కూడా ఆలస్యం చేయకుండా ఎవరో అమ్మాయి ఏదో అఘాయిత్యం చేసుకోబోతుందని గ్రహించి కాపాడటానికి అటు వైపుకు పరిగెత్తాడు. 

మరో పక్క పల్లీలు అమ్ముకునే ప్రతీక్షణ్ కూడా క్షణం కూడా ఆలస్యం చేయకుండా రెప్పవాటు సమయంలోనే  పరుగు అందుకున్నాడు

ప్రతీక్షణా  లేక అనుక్షణా ,

అనుక్షణా లేక  ప్రతీక్షణా ,

ఇటు ప్రతీక్షణ్  అటు అనుక్షణ్ 

అటు అనుక్షణ్  ఇటు ప్రతీక్షణ్ 

భీభత్స ను ఎవరు కాపాడుతారు? అని క్షణ క్షణం  జరుగుతున్న ఈ పరిణామాన్ని చూడటానికి ఇంటికెళ్లిపోదామనుకున్న సూరీడు కూడా  తన రథాన్ని ఆపేసి మరీ ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాడు. 

మా ప్రతాప్ గాడికి పిచ్చి ఎలా పట్టిందో అర్ధమయ్యే లోపే ఆయన కుర్చీ మీద నుంచి పడి గిల గిల కొట్టుకోవడం, అదే క్లాస్ లోనే ఉన్న వాళ్ళ అమ్మాయి నన్ను చూసి కసా బిసా పళ్ళు నూరుకోవడం జరిగిపోయాయి

తర్వాత ఆ కథ పోలీస్ స్టేషన్ లో 3rd డిగ్రీ కి చక్కగా పనికొస్తుందని తీసుకెళ్లడం జరిగింది. 

ఒక నెలరోజుల్లో తేరుకున్నాక ఆయన నాకిచ్చిన అమూల్యమైన సలహా - 'వెయ్యి కథలు చదివాకే ఒక కథ రాయడం మొదలెట్టు అని' కథ అంటే 4,5 పేజీలు ఉండాలని నవల లాగ వందల  పేజీలు రాయకూడదని చెప్పాడు. 

ఇక అప్పటి నుంచి ఆ వెయ్యి కథలు పుస్తకం కోసం వెదుకుతూనే ఉన్నాను. వెయ్యి పడగలు పుస్తకమైతే ఉంది అంటున్నారు కానీ వెయ్యి కథలు పుస్తకం లేదు అంటున్నారు ప్రతీ షాప్ లో. 

ఆ పుస్తకం దొరికేదెప్పుడో? 

నేనది చదివేదెప్పుడో? 

ఎప్పటికైనా ఒక కథ రాసేదెప్పుడో?  

రాసిన ఆ కథ ఏదో ఒక పత్రికలో అచ్చు అయ్యేదెప్పుడో? 

Every dog has its day అని నిరూపించేదెపుడో?

8, డిసెంబర్ 2025, సోమవారం

ది గర్ల్ ఫ్రెండ్

చదువెందుకు సంక నాకను, నాలుగు బర్రెలు కాచుకుంటూ ప్రేమికులు బతికేయచ్చు లాంటి కాన్సెప్ట్ తో  తేజ అనే ఒక డైరెక్టర్ హై స్కూల్ డేస్ కే ప్రేమ , పిల్లలు, కాపురం లాంటి అద్భుతమైన సినిమాలు ఓ పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం తీసి ఆపై కనుమరుగై పోయాడు.  తర్వాత అర్జున్ రెడ్డి లాంటి కథలతో కొన్ని అద్భుతమైన సినిమాలు వచ్చి హిట్టయ్యాయి. 

ఈ మధ్య రిలీజ్ అయిన వాటిల్లో అద్భుతమైన సినిమా "ది గర్ల్ ఫ్రెండ్ " అంటుంటే నిన్ననే నెట్ ఫ్లిక్స్ లో చూసా. 

అప్పట్లో విజయ శాంతి హీరోగా చేసే టైములో కాస్త మార్కెట్ తక్కువుండే రఘు (ఉరఫ్ రెహ్మాన్ ), వినోద్ కుమార్, జగపతి బాబు లాంటి వాళ్ళను పెట్టేవారు. ఇప్పుడు అలాంటి వారు ఎవరూ లేరో ఏమో కన్నడ ఇండస్ట్రీ నుంచి తెచ్చారు రక్షిత్ శెట్టి ని రష్మిక కోసం. దియా అనే కన్నడ సినిమా (ఇదే సినిమా తెలుగు లో రీమేక్ చేస్తే మేకై కూర్చున్నట్లుంది) గురించి ఇదివరకెప్పుడో బ్లాగులో రాశాను, ఆ రక్షిత్ శెట్టి నే ఇందులో (ప్రతి)నాయకుడు.

సత్రం లాంటి ఒక లేడీస్ హాస్టల్. అందులోకి ఎవరైనా డైరెక్ట్ గా లోపలికి వెళ్లి రావచ్చు (బాయ్ ఫ్రెండ్ అయినా లేదంటే ఆ అమ్మాయి నాన్న అయినా). బాయ్ ఫ్రెండ్ అయితే ఆ అమ్మాయితో రూంలో ఎన్ని నిద్రలైనా చెయ్యొచ్చు, ఉదయాన్నే అందరూ చూస్తుండగానే అతను బయటికి వెళ్ళొచ్చు. ఈ విషయం ఎప్పుడూ హీరోయిన్ కి అవమానం గా అనిపించదు ఎందుకనో మరి. సరే, ఈ జనరేషన్ వాళ్లకు ఇవన్నీ చాలా కామన్ ఏమో అని సర్ది చెప్పుకున్నా. 

రెగ్యులర్ కమర్షియల్ సినిమాలో ఎన్ని గొడవలు జరిగినా పోలీసులు కలగజేసుకోనప్పుడు మా సినిమా లో స్టూడెంట్స్ ఏం చేసినా మేమెందుకు పట్టించుకోవాలి అన్నట్లు ఆ సత్రానికి ఓనర్ (ఈ సినిమా డైరెక్టరూ ఈయనే) ఆయనకిష్టం వచ్చిన రూల్స్ ఆయన పెట్టుకుంటాడు. వాళ్ళేమీ డ్రగ్స్ తీసుకోవట్లేదు కదా ప్రేమించుకుంటున్నారు పైగా వాళ్ళు మేజర్స్  కాబట్టి మేము వాళ్ళకు అడ్డు చెప్పం అంటాడు.  

"అదేమైనా రాంబాయమ్మ కంపెనీనా? ఎవడు పడితే వాడు అమ్మాయితో రాత్రంతా పడుకొని తెల్లారి లేచి వెళ్లిపోవడానికి.. ఈ డైరెక్టర్ ని ఎవడికైనా చూపించండ్రా" అనాలని అనిపిస్తుంది కానీ ఏమో, ఇండియా లో కొన్ని హాస్టల్స్ ఇలాగే ఓయో రూమ్స్ లా మారాయేమో నేను ఔట్ డేటెడ్ అయి ఉండచ్చు అని ఆగిపోయా. 

ఒక రోజు ఉదయాన్నే హీరోయిన్ నాన్న తలుపు తడితే, వాళ్ళ అమ్మాయి బదులు ఆమె బాయ్ ఫ్రెండ్ తలుపు తీస్తాడు షార్ట్స్ వేసుకొని. పాతకాలం నాన్న కాబట్టి నానా అల్లరి చేసి చదువు మానేసి నాతో వచ్చేయ్ అని బెదిరిస్తాడు కూతురిని. తను రానని చెబితే మాట్లాడటం మానేస్తాడు.  

"ఈ పెద్దోళ్ళు ఉన్నారే" వీళ్లకు మీ మీద ఏ రైట్స్ లేవు. నువ్వు ఈ కాలపు అమ్మాయివి నీకు రైట్ అనిపిస్తే బోయ్ ఫ్రెండే కాదు కన్న తండ్రినైనా లెఫ్ట్ అండ్ రైట్ ఎదిరించచ్చు అని లెక్చర్ దంచుతాడు. 

"జరిగింది చాలు, ఇప్పుడే మనం పెళ్ళి చేసుకుందాం, తర్వాత నువ్వు ఇంట్లో పడి ఉండి పాలు పితుకుతూ ఉండు నేనెళ్ళి గేదెల్ని మేపుకొస్తాను మన లైఫ్ సెట్ అయినట్లే నువ్వు ఎలాగూ ముద్ద పప్పు లాంటి దానివేగా కాబట్టి ఈ చదువు నీకొద్దు, నేనే నీ ముద్దు" అని బాయ్ ఫ్రెండ్ అంటాడు. 

అప్పుడు జ్ఞానోదయం అయి "ఇక చాలు, బ్రేక్ అప్" అని హీరోయిన్ ఎదిరిస్తే, హీరోయిన్ కారెక్టర్ అస్సాసినేషన్ (వ్యక్తిత్వ ఖననం అనొచ్చా) కి జొరబడతాడు ఆ బాయ్ ఫ్రెండు. దాంతో మన వీరోయిన్ కి జేజెమ్మ పూని వీర విహారం చేసి స్టేజి ఎక్కి ఒక లెక్చర్ దంచేస్తుంది. 

కట్ చేస్తే .. లండన్ లో జాబ్ చేస్తూ తండ్రి అప్పట్లో తనతో మాట్లాడకపోయినా, ఇప్పుడు తన మంచి చెడ్డలు చూసుకునే కూతురిగా హీరోయిన్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ శుభం కార్డు వేస్తారు.  


2, జులై 2023, ఆదివారం

రెండు పాత సినిమాలు

ఈ వారాంతం లో ఇంట్లో ఎవరూ లేక కాస్త తీరిక దొరికి కొత్త సినిమాలు చూడబుద్ది కాక పాత కామెడీ సినిమాలు వెదికితే చూడని సినిమాలు ఏవీ దొరక్లేదు. సరే, కనీసం కృష్ణ గారి సినిమాలు చూసి కాస్త నవ్వుకుందామని వెదికితే నేను ఎప్పుడూ చూడని "సింహ గర్జన" సినిమా కనపడింది. సరే వంట చేసుకుంటూ, అంట్లు తోముకుంటూ, బట్టలు ఆరేస్తూ, ఆరిపోయిన బట్టలు మడిచేస్తూ, ఇల్లు ఊడుస్తూ, భోజనం చేస్తూ సినిమా మీద కన్నేస్తూ ఉంటూ వారాంతపుకార్యం స్వకార్యం రెండూ పూర్తవుతాయి కదా అని సినిమా చూడ్డం మొదలెట్టా. 

కృష్ణ హీరోగా, గిరిబాబు సెకండ్ హీరోగా పర్వాలేదనిపించే సినిమా. మరి గిరిబాబు నిర్మాతనో లేక మరో కారణమో తెలియదు గానీ సినిమాలో కొన్ని చోట్ల చాలా సేపు కృష్ణ తెర మీద కనిపించడు, గిరిబాబే లీడ్ తీసుకుంటూ ఉంటాడు మొదటి సగం లో. కృష్ణ ఆ రేంజ్ హీరో అయి ఉండీ భేషజాలకి పోకుండా పెద్దగా ఇమేజ్ లేని గిరిబాబుకి అంత స్క్రీన్ స్పేస్ ఇవ్వడం మరి కృష్ణ గారి గొప్పతనమో లేక సంవత్సరానికి పది పన్నెండు సినిమాలతో బిజీ గా ఉండే కృష్ణ గారి కాల్షీట్స్ దొరకక అలా లాగించేసారో తెలీదు మరి?

సరే అని మరుసటి రోజు "సింహబలుడు" అనబడే సినిమా చూద్దామనుకొని యూట్యూబ్ ఓపెన్ చెయ్యగానే..ఆడబోయిన తీర్థం ఎదురయినట్లు లేదంటే వెదకబోయిన తీగ కాలికి తగిలినట్లు  యూట్యూబ్ తన తెలివితేటల్ని ప్రదర్శించి సింహబలుడు సినిమాని సజెస్ట్ చేసింది. 

'మమ్మల్ని కాపాడటానికి ఎవరో ఒకరు రాకపోరు' అంటూ తరతరాలుగా తెలుగు సినిమాల్లో తరచూ ఇప్పటికీ వినిపించే స్టాక్ డైలాగ్ తో మొదలయ్యే ఈ సినిమాలో హీరో, హీరోయిన్ అయిన ఎంటీవోడు, వాణిశ్రీ ఇద్దరూ ముదురు టెంకలే కావడం వల్ల సినిమా జీర్ణించుకోవడానికి కాస్త సమయం పట్టింది. పైగా అదేదో అలెగ్జాOడర్ రాజ్యం ఏలుతున్నట్లు రావు గోపాల్ రావుకు, మరికొందరికి గ్రీకు రాజుల లాగా గెటప్ లు ఉంటాయి.

పైగా అదేం దౌర్భాగ్యమో గానీ పాత తెలుగు సినిమాల్లో హీరో కి చెల్లి అయిన పాపానికి ఆవిడకి మరణం తప్పదన్న సూత్రాన్ని ఈ సినిమా పాటించింది. ఇప్పటిలాగా అప్పట్లో మనోభావాలు ఉంటే ఎందరి చెల్లెమ్మల మనోభావాలు దెబ్బతినేవో పాపం?

ఇక ఈ సినిమా పూర్తిగా చూసేలోపు నేనెక్కడ ఆరిపోతానో అని భయపడుతూ ఆరిపోయిన బట్టలు మరుస్తూ ఉండటం పక్కన బెట్టి రిమోట్ చేతిలోకి తీసుకోబోతుంటే .. షోలే లో హేమమాలిని లాగా విలన్స్ ముందు డాన్స్ ఆడుతూ వాణిశ్రీ గారి నృత్య విన్యాసాలు చూసేప్పటికి ఇక ఇంతకంటే చూడటానికి దారుణాలు ఏముంటాయిలే, నిండా మునిగిన వాడికి చలేమిటి అని మిగిలిన ఆ కొద్ది సినిమా పూర్తిగా చూసేశాను. 

ఈ సినిమాకి రాఘవేంద్రరావు దర్శకుడైతే అప్పటికింకా పేరొందని మరో ప్రముఖ దర్శకుడు కోదండరామిరెడ్డి సహ దర్శకుడు కావడం విశేషం.  

పై రెండు సినిమాలు ఒకే సంవత్సరం రిలీజ్ అవడమే కాకుండా రెంటిలోనూ మరికొన్ని సారూప్యతలు ఉన్నాయి. 

  • రెండు సినిమాల్లోనూ మోహన్ బాబే ప్రతినాయకుడు అవ్వడం 
  • రెండు సినిమాల్లోనూ హీరోయిన్ రాజు గారి కుమార్తె అవ్వడం, నూటికి తొంభై తెలుగు సినిమాల్లో ఇది కామన్ అనుకోండి. 
  • రెంటిలో సుమారుగా ఒకే కథ, చాలా వరకు ఒకే సీన్స్ ఉండటం మరీ ముఖ్యంగా బానిసల సీన్ .. వినోదం కోసం బానిసల మధ్య పెట్టిన పోరాటాలు, తర్వాత బానిసల తో కలిసి తిరుగుబాటు చేయడం అక్కడ గిరిబాబు అయితే ఇక్కడ ఎంటీవోడు అన్నీ సేమ్ టు సేమ్

నేను పుట్టక మునుపే రిలీజ్ అయిన సినిమాలు కాబట్టి ఏ సినిమా హిట్టయ్యిందో ఏ సినిమా ఫట్టయ్యిందో నా కళ్ళతో చూడలేదు గానీ ఆ తర్వాత ఎప్పుడో విన్న సమాచారం ప్రకారం సింహ గర్జనే ఒక మెట్టు పైన నిలిచిందట. 

ఏది ఏమైతేనేం ఈ రెండు సినిమాలు చూసి తల బొప్పి కట్టించుకున్నట్లు మరే చెత్త సినిమాలు చూడకూడదు అనుకున్నా. కానీ కుక్క తోకే కాదు మనిషి బుద్ధి కూడా వంకర కాబట్టి మళ్ళీ యు ట్యూబ్ ఓపెన్ చేస్తే.... సింహ గర్జన, సింహ బలుడే కాదు సింహం అనే పేరుండే తెలుగు సినిమాలన్నీ అది వరసబెట్టి సజెస్ట్ చేస్తూ పోతే  

పల్నాటి సింహం

కొండవీటి సింహం

పల్లెటూరి సింహం

సాహస సింహం

కొదమ సింహం

భారత సింహం 

అడవి సింహాలు

సింహం నవ్వింది

జై సింహ

జయ సింహ

నర సింహ 

సింహం పులి 

ఆ తర్వాత పులితో మొదలెట్టి బొబ్బిలి పులి, పులి బెబ్బులి, పులి బిడ్డ వామ్మో అవన్నీ చూసి నేను ఏ సింహం లానో పులి లానో మారితేనే ???

నో నేను మనిషిని అన్నాననుకోండి అప్పుడు గూగుల్ ఆ మాటని పట్టేసుకుని 

దేవుడు చేసిన మనుషులు

నకిలీ మనిషి 

దేవుడి లాంటి మనిషి

మనిషికో చరిత్ర 

అని తెలుగు సినిమా చరిత్రలోని సినిమాలన్నీ సజెస్ట్ చేస్తూ పోతే ??? 

13, జనవరి 2023, శుక్రవారం

పండగ నాడూ పాత తాతలేనా?

మా సీమ లో నా చిన్నప్పుడే ఆగిపోయిన ప్యాక్షనిజాన్ని జపిస్తూ ఒక తాత; వీరయ్య, శూరయ్య అంటూ ఎప్పుడో అరిగిపోయిన ఆ కాలపు సోది కథలే చెప్తామంటూ మరో తాత మొహాన ఇంత మేకప్ వేసుకొని మన మొహాన ఇంత మట్టి కొట్టడానికి తయారయ్యారు పండుగ అనే జాలి కూడా చూపకుండా. 

పాత సినిమాల్లో "నేను బియ్యే పాసయ్యానమ్మా, ఇక మన కష్టాలన్నీ తీరిపోయినట్లే" అని పొట్టను టైట్ గా బెల్టు తో బిగించి తనకన్నా వయసులో చిన్నదైన మహిళను అమ్మగా సంభోదిస్తూ సీనియర్ ఎంటీయార్, "నిన్ను నేను ఘాడంగా ప్రేమిస్తున్నాను దేవి" అని శ్రీదేవి కి రోజా పువ్వు ఇస్తూ నాగేశ్వర్రావు డైలోగ్స్ చెప్తుంటే పడీ పడీ నవ్వుకునే వాళ్ళము. మరి ఈ జనరేషన్ పిల్లలు కూడా ఈ తాతల చేష్టలని చూసి నవ్వుకుంటున్నారేమో తెలీదు మరి. 

"సింహం గడ్డి తినదు",  "సింహం ముడ్డి కడగదు" అని టైటిల్ పెడితే చాలు సింహం ఉందిగా పూనకం వచ్చేస్తది ఒక తాతకి.  

పూనకం అంటే గుర్తొచ్చింది, "పులికి పూనకం వస్తే" అని ఒక మాస్ టైటిల్ పెట్టేస్తే ఇంకో తాత సినిమాకి ఒప్పేసుకుంటాడు. 

అప్పుడెప్పుడో జమానా లో "సింహం నవ్వింది" అని ఒక కామెడీ సినిమా అబ్బా కొడుకుల కాంబినేషన్ లో వచ్చినట్లుంది, అది చూసిన జనాలు పారిపోయారో లేక బతికి బయటపడ్డారో తెలీదు మరి. 

మా బాసేమో హిట్టో ప్లాపో, గాడ్ ఫాదర్ లాంటి సినిమాలు తీసి కాస్తో కూస్తో గాడిలో పడ్డాడు అనుకుంటే మళ్ళీ మాస్ మాస్ అంటూ రంగు రంగుల చొక్కాలు, రోజ్ ఫ్లవర్స్ చేతిలో పట్టుకొని అమ్మాయి వెంట పడటాలు చూడలేక పోతున్నాం. వద్దు బాబోయ్ ఈ తాతయ్య లీలలు.  

కనీసం ఒక తాతయ్యని తెగులు దేశం జనాలు కాస్త మోస్తున్నట్లు ఉన్నారు, ఇంకో తాతయ్య కాడిని ఫ్యాన్స్ కూడా వదిలేస్తున్నట్లు అనిపిస్తోంది గత రెండు సినిమాల వైఫల్యం చూస్తుంటే. ఈ సినిమాతో ఆ విషయం పూర్తిగా తెలిసిపోతుంది. 

ముఖ్యంగా కాలేజ్ అమ్మాయిలు, ఆడ లేడీస్ మన తాతల సినిమాలకి కాస్త దూరంగా ఉంటున్నారు గత కొన్నేళ్లలో.  కాబట్టి మహేష్ బాబు తోనో లేదంటే విజయ్ దేవరకొండ తోనో (వీళ్లేనా లేటెస్ట్ హార్టు-త్రోబ్స్, వేరే ఎవరైనా ఉన్నారేమో నాకు తెలీదు)  ఒక మంచి ఐటెం సాంగ్ చేయిస్తే సరిపోతుంది, ఎప్పుడూ హీరోయిన్స్ తోనేనా? ఏం హీరోస్ మాత్రం ఐటెం సాంగ్స్ చేయకూడదా? 

ఒకప్పుడు హీరో ఫాన్స్ అనే ఈ విపరీతమైన పైత్యం చదువుకోని వాళ్లలోనే ఉండేది అని అనుకునేవాడిని, చదువుకున్నవాడి కంటే చంచాలు, కంచాలు కడిగేవాడే బెటర్ అన్నట్లు ఉంది వీరి ప్రవర్తన. సిడ్నీ లో నేను వెళ్లిన థియేటర్ లో RRR సినిమా అయిపోయిన తర్వాత ఆ థియేటర్ కుప్పతొట్టి లా మారిపోయింది, చించేసి విసిరేసిన ఆ పేపర్స్ అవీ చూస్తే. అదనంగా ఈ కార్ ర్యాలీలట, బాబోయ్ ఒక పాతిక కార్లేసుకుని రౌండ్స్ కొడుతున్నారట వారి హీరో పేరు గట్టిగా అరుస్తూ అదీ రాత్రి పదకొండు పన్నెండు టైములో. పోలీసులు వచ్చి వారిని ఆపి ఇంటికి పంపేదాకా అరగంట సేపు ఆ సౌండ్స్ వినలేకపోయాం అన్నారు ఆ చుట్టుపక్కల నివసించే కొందరు మిత్రులు. ఏదో గ్రౌండ్ లోనే మరో చోటో కాదు ఒక సబర్బ్ మధ్యలో వీళ్ళు ఆ కార్ర్యాలీ నడిపిందట. 

నిన్నొచ్చిన తాతయ్య సినిమా కంటే ముందొచ్చిన అఖండ బాగుంది అని చెప్తూ దాన్ని కళాఖండం చేసేస్తున్నారు కొందరు. మరి ఈ రోజు తాతయ్య సినిమా పరిస్థితి ఏంటో సాయంత్రానికి తెలుస్తుందేమో. 

కాకపోతే ఈ తాతలే యువ తాబేళ్ళ కంటే నయంగా అనిపిస్తున్నారు, ఏదో రకంగా వేగంగా సినిమాలు చేస్తున్నారు. అలాగైనా కనీసం ఒక వెయ్యి మందికి  ప్రత్యక్షంగా, మరో వెయ్యి మందికి పరోక్షంగానైనా పని కల్పిస్తున్నారు.

12, జనవరి 2023, గురువారం

మరో ఫ్రాక్చర్ స్టోరీ

చంద్రుని మీద:

స్టార్టింగ్ సీన్ లో చంద్రుని మీద లాండ్ అవుతాడు నాసా లో పనిచేసే నసీర్.  

అక్కడ గుడారాలు వేసుకొని అమెరికా మీద దాడి చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న ఉగ్రవాదుల మీద ఒక చేత కత్తి మరో చేత సుత్తి పట్టి ఒక భీభత్సమైన ఫైటింగ్ సీన్. 

చంద్రుడి మీద నీరు ఉందో లేదో తర్వాత విషయం, రక్తం మాత్రం ఏరులై ప్రవహిస్తోందని మా శాటిలైట్స్ కనిపెట్టాయి అని రష్యా ప్రపంచానికి తెలియచెప్పింది ఈ లోగా. 

ఆ తర్వాత అక్కడే చందమామ మీద నసీర్ తన అభిమానులతో కలిసి ఒక ఇంట్రడక్షన్ సాంగ్  

మా బ్లడ్డు బ్రీడు వేరే 

మా ఫుడ్డు బ్రెడ్డు మీ ప్రేమే  

మా బ్లడ్ బ్రదర్స్ మీరే 

మీకిక మిగిలేది గాడిద గుడ్డే 


వైట్ హౌస్ లో :

అమెరికన్స్ మన హీరోని అభినందించి ఒక పార్టీ ఏర్పాటు చేస్తారు. అక్కడ అమెరికన్ ప్రెసిడెంట్ గా విజయశాంత్ అని మన తెలుగువాడే ఉంటాడు. అతను మన హీరో దగ్గరికి వెళ్ళి అమెరికాలో ఉగ్రవాదులని ఏరివేసి నీ కర్తవ్యం నెరవేర్చావు, కానీ ఇండియా లో నువ్వు చెయ్యాల్సిన పని ...... అని చెప్పబోతూ ఆగిపోతాడు. 

చెప్పండి, మీరేదో నా దగ్గర దాస్తున్నారు. 

చెప్తాను విను నడిపి సింహా రెడ్డి 

వాడెవడు?

అది నీ పేరే, శత్రువుల కంట పడకుండా నీ అసలు పేరు అయిన నడిపి సింహా రెడ్డి ని నసీర్ గా మార్చాము. మీది సీమలో చంద్రమూరి వంశం. మీకు ఆ సూర్యమూరి వంశానికి పడదు. 


అదే సోది ఫ్లాష్ బ్యాక్ 

అప్పట్లో మీ నాయనమ్మ గారే ఆ ఊర్లో వైద్యులు, ఆ సూర్యమూరి వంశస్తుడి ప్రాణం నిలబెడితే "పగవారు నిలబెట్టిన ప్రాణం ఉంటే యెంత పోతే యెంత" అని అప్పుడే వచ్చిన ఇంద్ర సేనా రెడ్డి సినిమా చూసి తన ప్రాణం తానే తీసుకున్నారు. 

ఆ తర్వాత అప్పుడెప్పుడో వచ్చిన ఎమ్మెస్ రెడ్డి, కేవీ రెడ్డి, సమర సింహా రెడ్డి, రాజ శేఖర్ రెడ్డి, జయ ప్రకాష్ రెడ్డి, ప్రభాకర్ రెడ్డి , జగన్మోహన్ రెడ్డి , ఎ  రెడ్డి, బి రెడ్డి , జెడ్ రెడ్డి అని ఫాక్షన్ సినిమాలన్నీ చూసేసి ఈ సీమ లో ఎవరూ కత్తి పట్టకూడదు రక్తపాతం చిందకూడదు అని నరుక్కు చచ్చారు. చివరికి మీ వంశంలో మిగిలిన ఒకే ఒక్క వంశోద్ధారకులు, వారసులు, అరిసెలు, జిలేబీలు, జాంగ్రీలు, వడలు, పకోడాలు అన్నీ మీరే బాబు. 

చివరికి చంపడానికి మీ వంశస్తులు లేక, ఆ సూర్యమూరి వంశస్తులు కత్తులు పట్టడమే మానేశారు. దాంతో తరతరాలుగా కత్తులు చేసేవారు, కత్తులు నూరేవారు తినడానికి పట్టెడన్నం దొరక్క 'అలో  స్విగ్గీ' అంటూ పీజ్జాలు, బర్గర్లు ఆర్డర్ చేసుకొని తింటున్నారు. 


లక్ష్యం 

అయితే నేను మా ఊరికి వెళ్ళి నా కర్తవ్యాన్ని నెరవేర్చాల్సిందే విజయశాంత్. 

వద్దు బాబూ వద్దు ఏదో పొరపాటున ఈ వైట్ హౌస్ లో మాన్షన్ హౌస్ ఎక్కువ తాగేసి నిజం చెప్పేశాను. కావాలంటే ఈ అమెరికన్ ప్రెసిడెంట్ పదవి రాసిస్తా, అసలు ఈ పదవే మీ వంశం పెట్టిన భిక్ష, మీరు ఇక్కడ ఉండటమే మీకు రక్ష, ఎందుకు బాబూ ఈ కక్ష్య. 

ఇకపై నా లక్ష్యం నాసా లో చంద్రుడు, సూర్యుడు, కక్ష్య కాదు, సీమలో మా చంద్రమూరి వంశ రక్ష, ఆ సూర్యమూరి వంశానికి శిక్ష. 

అట్నే గానీ బాబు. శానా సేపు ఎమోషన్ నడిసినాది, ఎంటర్టైన్ మెంట్ కోసం ఒక ఐటెం సాంగ్ ఏర్పాటు చేసినా , మీరు డాన్స్ చెయ్యాల్సిందే. 

ఐటెం సాంగ్ 

నా పేరు జారు మిఠాయి

పుట్టిందేమో బొంబాయి 

నేనిపుడే ఊరుతున్న ఊరగాయి 


నేనొక రాలుగాయి 

వాయిస్తా నీ సన్నాయి 

ఆపై నంజుకుంటా నిన్నమ్మాయి  

సీమలో కత్తులు తయారు చేసే కాలనీలో: 

ఇక మీరు పస్తులతో పడుకునే టైం ముగిసిపోయింది, ఇకపై రకరకాల డిజైన్స్ లో కత్తుల తయారీని మొదలుపెట్టండి. ఈ కత్తుల పరిశ్రమే కాదు మరే పరిశ్రమని మన ఆంధ్రా దాటి వెళ్లనివ్వను. ఆకలేస్తే అమృతాంజనం, జలుబు చేస్తే జండూబామ్ తింటున్న మీరు ఇకపై రోజూ బిర్యానీ తినేలా చేస్తా. 

"మరి బాత్రూములు ఎవడు కట్టిస్తాడు? మీ బాబా?" అప్పుడే సీన్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఓ ఇద్దరు 

అవును మా బాబే, ఈ సారి పదవిలోకి వచ్చేది మా బాబే, అప్పుడు కట్టిస్తాడు పేదలకు బాత్రూములు, ఈ లోగా అడ్డొచ్చిన వారికి కట్టేస్తాను సమాధులు. 

అది మీ నాన్న తరం కూడా కాదు 

తెలుగు జాతి కీర్తి పతాకాన్ని రెపరెపలాడించింది మా నాన్న, అలాంటి మా నాన్న ఊసెత్తిన నీ కుత్తుకని రపరపా రంపంతో కోసేయ్యకపోతే నేను చంద్రమూరి వంశస్తుడనే కాదు. 

అంటే నువ్వు మా అన్న నడిపి సింహా రెడ్డి వా?

అవును తమ్ముళ్ళు , మీరెవరు?

నువ్వెప్పుడొస్తావా అని ఎదురు చూస్తున్నాం అన్నా ఇన్నాళ్లు. నేను కుసిర్ వీడు ఎసిర్. 

అవేం పేర్లు, తేడాగా ఉన్నాయే?

మేము పుట్టగానే నీకు కుడిభుజంగా ఉండాలని కుడి సింహా రెడ్డి, తమ్ముడు ఎడమ భుజంగా ఉండాలని ఎడమ సింహా రెడ్డి అని బొడ్డు కూడా కోయకుండానే పేర్లు పెట్టేసారు మా ఇంట్లో వాళ్ళు. కానీ మీరు లేని టైం చూసి మమ్మల్ని బానిసలని చేసి వాళ్ళు మా పేర్లను ఇలా మార్చేశారు. 

తెలుగు తమ్ముళ్ళారా,  ఇక సహించేది లేదు, ఇష్టమొచ్చినట్లు పేర్లు, ఊర్లు మారిస్తే ఊరుకునేది లేదు. నేను రంగం లోకి దిగనంతవరకే వార్ టూ సైడ్, దిగానంటే వన్ సైడే. కంటి చూపుతో శాసిస్తా, పంటి కొనలతో నమిలేస్తా, కత్తి వేటుతో నరికేస్తా.  ఇకపై మనదే రాజ్యం పదండి ముందుకు. 

జై బాబయ్య జై జై బాబయ్య 

15, నవంబర్ 2022, మంగళవారం

చెల్లని నాణెం

పూరి జగన్నాథ్ కొడుకుని హీరో గా పెట్టి అప్పుడెప్పుడో తీసిన మెహబూబా సినిమా ఈ వీకెండ్ చూశాను. ఇక తరువాతి వాక్యం చదివే ముందు ఒక గ్లాస్ చల్లటి నీళ్ళు పక్కన పెట్టుకోండి ముందు ముందు పనికొస్తాయి. 

ఆయన ఆ సినిమా 2018 లో తీసినట్లు ఉన్నాడు గానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే అలాంటి కథనే నేను 2015 లో రాసుకున్నా. ఇప్పుడు మీరు మూర్చబోయే స్టేజి లో ఉంటారు, కాస్త ఆ చల్ల నీళ్లు మీ గొంతులో పోసుకోవడమో లేదంటే మొహాన కొట్టుకోవడమో చేయండి.  

ఇప్పుడు కాస్త తేరుకున్నారు కదా, మళ్ళీ చదవండి. చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే కొంత ఇష్టం ఉండటం వల్ల అవంటే నాకు అభిమానం. అందుకే యెంత చెత్త సినిమా అయినా పూర్తిగా చూడందే వదలను. చూసిన తర్వాత అలా కాకుండా ఎలా తీస్తే బాగుండేదో నేను ఒక బుక్ లో రాసుకునేవాడిని.  అలా రాసుకున్న పుస్తకం నేను సిడ్నీ కి వచ్చేసాక బెంగళూరు లో నేనుండే రెంటెడ్ హౌస్ ఖాళీ చేసేప్పుడు మా నాన్న న్యూస్ పేపర్స్ తో పాటు నా నోట్స్ మెటీరియల్స్ అంతా పాత పేపర్ వాడికి అమ్మేశాడు. 

సిడ్నీ కి వచ్చాక ఒక రెండు మూడేళ్ళు బుధ్దిగానే ఉన్నాను. తర్వాత 2015 టైం లో అనుకుంటా నేను బ్లాగ్ లో రాయడం మొదలెట్టాను. చాలా మంది చదివి అభినందించేవారు బాగానే రాస్తున్నావని. అప్పుడు నా మైండ్ లో ఒక పాత జ్ఞాపకం మెదిలింది. 

నేను బెంగళూరు లో ఉన్నపుడు, మగధీర సినిమా విడుదలయ్యి బాగా హిట్టయ్యింది. నాకప్పుడు సినిమా బాగానే అనిపించింది కానీ దాన్ని ఇంకా బాగా తీయొచ్చు అనిపించింది (రచయిత లేదా దర్శకుడు పాపం కథ బాగానే రాసుకొని ఉంటాడు, కాకపోతే బాగా పేరున్న హీరోలు, అతని వెనకున్న భజన బృందాలు వాళ్ళ బంధువులు అంతా తలో చెయ్యి వేసి ఆ కథను బ్రష్టు పట్టించి ఉంటారు. అదేదో సినిమాలో ఒకతను సీరియస్ సినిమా తీద్దాం అనుకుంటే షూటింగ్ పూర్తయ్యి ప్రివ్యూ చూసేప్పటికీ అది ఒక కామెడీ సినిమాలా అవుతుంది. పులిహోర కలపాలని దర్శకుడు అనుకుంటే అతనితో బిర్యాని వండిస్తారు)  

నోట్స్ లో అదే మగధీర సినిమానే ఇంకెలా తీయొచ్చు అనుకున్నపుడు వేరొక కథ మదిలో మెదిలింది. నేను పుట్టక ముందు నుంచి అంటే మూగ మనసులు తో మొదలుకొని జానకి రాముడు మీదుగా నిన్నటి మగధీర వరకు పునర్జన్మల మీద సినిమాలు తీసి హిట్ కొడుతున్నారు అంటే మనం ఎంటర్టైనింగ్ గా తీయగలితే ఇంకో హిట్ సినిమా కూడా తీయొచ్చు అని క్లుప్తంగా ఒక కథ రాసుకున్నాను పునర్జన్మల కథకు అప్పుడెప్పుడో చూసిన సన్నీడియోల్ 'గదర్:ఏక్ ప్రేమ్ కథా'  సినిమా కాన్సెప్ట్ ని మిక్స్ చేస్తూ (నాకు తెలిసి 90% సినిమా వాళ్ళు ఒక నాలుగైదు సినిమాలు చూసేసి ఒక కథ అల్లుకుంటారనుకుంటా)  రాసుకున్న నోట్స్ చెత్త పేపర్స్ వాడి దగ్గరికి చేరినా ఆ కథ మాత్రం నా మైండ్ లో అలాగే ఉండిపోయింది కదా అని దాన్ని డెవలప్ చేసి ఫుల్ డైలాగ్స్ వెర్షన్ తో ఒక బౌండెడ్ స్క్రిప్ట్ రాసి బైండ్ కూడా చేసి పెట్టుకున్నాను. నాకంత సీన్ లేదు, నేను ఆ సినిమా ఎలాగూ తీయలేనని తెలుసు గాని అదో సెల్ఫ్ సాటిస్ఫాక్షన్  అంతే. ఆ 132 పేజీల స్క్రిప్ట్ ని ఎప్పుడూ నా టేబుల్ మీదే ఉంచుకుంటాను నేను  నా ఫెయిల్యూర్ కి జ్ఞాపకంలా. 

నా ఉద్దేశ్యం చెత్త వాడికి అమ్మేసిన ఆ నోట్స్ పూరి గారి కంట పడి కాపీ కొట్టాడని కాదు కానీ ఐడియాస్ అలా ఇద్దరికీ ఒకేలా వస్తుంటాయి అని. సంతోషం సినిమాలో ప్రభుదేవా ఒక పల్లెకి ఉదయాన్నే వెళ్ళినప్పుడు, కాల కృత్యాల కోసం మోకాళ్ళ మీద కూర్చుని ఉన్న వారంతా లేచి నిలబడతారు. పర్లేదు కూర్చోండి నాకంత మర్యాద ఇవ్వాల్సిన అవసరం లేదు అంటాడు ప్రభుదేవా . అప్పుడు పక్కన ఉన్న మా శీను నాకెప్పటి నుంచో ఇలాంటి సీన్ నా మైండ్ లో ఉండేది అన్నాడు. 

ఇప్పుడు కూడా కొన్ని సినిమాలు రిలీజ్ అయ్యాక కొందరు ఇది నా కథ అని గొడవ పెడుతుంటారు. వాటి విషయం లో కూడా ఇద్దరూ ఒకే లాగా అలోచించి ఉండచ్చు లేదంటే నిజంగానే కథ కొట్టేసి ఉండచ్చు అది వేరే విషయం. 

సినిమాలో కుర్రాడు బానే చేశాడు, పూరి జగన్నాథ్ గారు గనుక మునుపటి ఫామ్ లోకి వచ్చి ఇడియట్ లాంటి హిట్టు సినిమాలు అతడితో తీస్తే అతను స్టార్ హీరో అయ్యే అవకాశం ఉంది  (ఇడియట్ అనేది గొప్ప సినిమా అని కాదు కానీ, హిట్టే సినిమా ఇండస్ట్రీలో కొలమానం అది బాగుందా లేదా అని కాదు. నిజం చెప్పాలంటే పూరి గారి ఏ సినిమా నాకింత వరకు నచ్చలేదు. నా లాంటి ఓ బోడి లింగానికి నచ్చకపోతే ఆయనకేం నష్టం లేదనుకోండి)  ఇక ఆ సినిమా సెకండ్ హాఫ్ నుంచి పూరీ విశ్వరూపం చూపిస్తాడు.  ఇక  క్లైమాక్స్ లో మాత్రం తాండవం ఆడేస్తాడు.  ఎంతో సెన్సిటివ్ గా తీసి ఉండాల్సిన లవ్ స్టోరీ ని బాగా లౌడ్ గా తీశాడు. ఇక ఇండియన్ పాకిస్తాన్ బోర్డర్ విషయాలను  మాత్రం  వీధిలో నీళ్ళ కొళాయిల దగ్గర జరిగే కొట్లాట స్థాయి లోకి దిగజార్చి చూపించాడు.  బాబోయ్ ఆ బోర్డర్ దగ్గర ఇండియన్ మిలిటరీ ఆఫీసర్ గా ఓవర్ యాక్షన్ చేసిన ఆవిడెవరో గానీ ఆస్కార్ ఇచ్చేయచ్చు (పోకిరి సినిమా తర్వాత ఆవిడని మళ్ళీ ఇదే సినిమాలోనే చూడ్డం)

సారూప్యత ఉందనిపిస్తోంది కాబట్టి ఎక్కడో ఎప్పుడో చదివిన ఒక చిన్న కథ నాకు గుర్తు ఉన్నంతలో చెప్పి ముగిస్తాను. సమానమైన విలువున్న ఓ రెండు కొత్త కాయిన్స్ ని ముద్రించి వదిలారు. అందులో ఒక కాయిన్ ఎక్కడో రోడ్లో పడిపోయింది, ఇంకో కాయిన్ మాత్రం చలామణి లోకి వెళ్ళిపోయి దాని వేల్యూ అది పొందింది. రోడ్లో పడిన కాయిన్ అలా వాహనాల కింద పడి అట్నుంచి అటు రోడ్ పక్కన చెత్తలోకి చేరిపోయింది. కొన్నేళ్ళకి చెత్త ఏరుకునే వాడికి ఆ కాయిన్ దొరికింది కానీ అప్పటికే సొట్టలు పడి, తుప్పుపట్టిపోయి ఉన్న ఆ కాయిన్ ఎక్కడా చెల్లలేదు. 

ఈ పోటీ ప్రపంచం లో మీ ఐడియాస్ ని వీలైనంత తొందరగా సేల్ చేసెయ్యండి. దేనికైనా విలువ ఉండేది సరైన సమయంలో దాన్ని వినియోగించినప్పుడే అంతే కాదు సరైన ఛానెల్లో వెళ్ళినప్పుడే.  మీరూ వినే ఉంటారు శంఖంలో పోస్తేనే తీర్థం అని, సరైన టైం లో మీ ఐడియాస్ ఎగ్జిక్యూట్ చేయకుండా పక్కన పెట్టేస్తే కథలోని ఆ చెల్లని నాణెం లాగా లేదంటే నా 132 పేజీల స్క్రిప్ట్ లాగా మీ ఐడియా కూడా ఎందుకూ పనికి రాకుండా పోతుంది. 

3, నవంబర్ 2022, గురువారం

ది ఘోస్ట్ - ఓ.టి.టి రివ్యూ

రెండు మూడు నెలల క్రితం చంద్రుడి బ్యాక్ డ్రాప్ లో గన్ పట్టుకొని , క్లాక్ టవర్ బ్యాక్ డ్రాప్ లో తల్వార్ పట్టుకొని నిలుచునే రెండు పోస్టర్స్ వదలగానే చూసి 'పేరు గొప్ప' అనుకున్నా గానీ సినిమా మొదటి సీన్ చూశాకే అర్థమైంది 'ఊరు దిబ్బ' అని. 

మనం పాట్లాక్ అంటూ నాలుగు పిక్నిక్ మాట్స్ పార్క్ కి ఎత్తుకెళ్ళి, ఒక క్యాంపింగ్ సెట్ వేసుకొని మనం వండుకు తెచ్చిన చపాతీలు, కూరలు, అన్నం అంతా అక్కడ సర్దుతున్నట్లు ..  సినిమా ఓపెనింగ్ సీన్ లోనే టెర్రరిస్టులు ఒక ఎడారిలో నాలుగు  తివాచీలు పరిచి, పది టెంట్స్ వేసుకొని నల్ల చెక్క పెట్టెలలో తెచ్చుకున్న గన్స్, బాంబులు బయటికి తీస్తుంటారు. 

ఇంతలో ఎక్కడినుంచో బుల్లెట్ల వర్షం, కాసేపటికి ఇసుకలోంచి బయటకి దూకుతూ నాగ్ మాయ్య ఎంట్రీ, అటువైపు నుంచి బాలీవుడ్ కన్నా తెలుగు సినిమాల్లోనే ఎక్కువగా కనపడే బాలీవుడ్ హీరోయిన్ అనబడే ఆటలో అరటిపండు లాంటి ఒక హీరోయిన్. 

ఆ యాక్షన్ సీక్వెన్స్ తర్వాత ఇది ప్రెజెంట్ జెనెరేషన్ హీరో మూవీ అని కలరింగ్ ఇస్తూ ఒక లిప్ కిస్ ప్లస్ ఇప్పటికీ మన్మథుడు అని చూపించుకోవడానికి ఒక రొమాంటిక్ కలర్ ఫుల్ సాంగ్. 

ఆ తర్వాత మరో రెండు ఫైట్ సీక్వెన్సెస్ తర్వాత గార్ధభ స్వరంతో ఓండ్ర పెడుతూ హీరో గురించి బిల్డప్ ఇస్తూ  

ఇదిగిదిగో వచ్చాడొక ఘోస్ట్

చేస్తాడిక  మీ టైం వేస్ట్

మీరు అవుతారు చికెన్ రోస్ట్

ఇందాక అయిపోయిన రొమాంటిక్ సాంగ్ ఒక్కటే మీకు ఫీస్ట్

ఇక ఆ తర్వాతదంతా వరస్ట్

ఇది చూడ్డానికి వచ్చారంటేనే తెలుస్తోంది మీ టేస్ట్ 

మీకిదే నా అల్ ది బెస్ట్ 

అని ఒక బాక్గ్రౌండ్ సాంగ్. 

ఇన్నేళ్ళ బట్టీ చూస్తున్నా గానీ కొన్ని సీన్స్ లో నాగ్ మాయ్య ఎక్సప్రెషన్స్ ఏమిటో అర్థం కావు.  జగపతి బాబు, బాలయ్య బాబు లాగా ఈయన కూడా కూసింత వీకే కొన్ని రకాల ఎక్స్ప్రెషన్స్ మోహంలో పలికించాలంటే. 

ఇక ఆ హీరోయిన్ గత పన్నెండేళ్ళ నుంచి ఫిజిక్ మెయింటైన్ చేయడంలో పెట్టిన ఎఫర్ట్ నటన ఇంప్రూవ్ చేసుకోవడంలో పెట్టలేదేమో అనిపిస్తోంది. నాకు తెలిసి బాలకృష్ణ తనకి ఏ హీరోయిన్ దొరక్క ఈవిడని పట్టుకురాక పోయి ఉంటే ఈ పాటికి ఈవిడకి ఈ మాత్రం తెలుగు సినిమా ఛాన్స్ లు కూడా వచ్చేవి కావేమో. కంటెంట్ ఉంటే కటవుట్ ఎలా ఉన్నా పర్లేదు అని నిత్యామీనన్, విద్యా బాలన్, సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ నిరూపించారు వారి నటనతో. ఈవిడది డిఫరెంట్ రూటు. కంటెంట్ ఎలా ఉన్నా కటవుట్ తో కొట్టుకొస్తోంది.    

మొదట్లో కాజల్  ని హీరోయిన్ గా అనుకొని ఆవిడ ప్రెగ్నెంట్ అని యాక్షన్ సన్నివేశాలు కష్టం అని తెలిసి లాస్ట్ మినిట్ లో ఈవిడని పట్టుకొచ్చారట ఏ రాయి అయితేనేం ఈ సినిమా లో నటించడానికి అని.   

ఇక అక్క గా ఎవరూ దొరకనట్లు ఆ గుల్ పనాగ్ ను ఎందుకు తెచ్చారో తెలీదు, మేకప్ ఎక్కువ యాక్టింగ్ తక్కువ.  యాక్షన్ రాదో, మర్చిపోయిందో లేక ఆ డైరెక్టర్ ఏం చెపుతున్నాడో అర్థం కాక ఏదో ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చిందో ఆవిడకే తెలియాలి. చైల్డ్ ఆర్టిస్ట్ గా మనకు సుపరిచయమైన అనీఖా సురేంద్రన్ పక్కన కూడా ఈవిడ యాక్టింగ్ సరితూగలేదంటే ఆ రోల్ కి న్యాయం చేయలేక పోయిందనే చెప్పుకోవాలి.  

గడ్డం పెంచితే ధనవంతులలా కనిపిస్తారనో లేక  అలా అయ్యాకే గడ్డం పెంచుతారో తెలీయట్లేదు.  ఈ మధ్య కాలం వచ్చే సినిమాల్లో రిచ్ పీపుల్ అంటే వారికి గడ్డం ఉండాల్సిందే అని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. ప్రతీ ఒక్కడూ గడ్డం తోనే.  ఎవడు ఎవడో ఎవడి మొహం ఎవడిదో పోల్చుకునేప్పటికే సినిమా మొత్తం అయిపొయింది. తిరుపతిలో గుండు గీయించుకుని దానికి  గంధం పూసుకొని నుదుట నామాలు పెట్టుకుని  తిరిగినట్లు సినిమాలో అందరూ గెడ్డాలు పెంచుకొని కూలింగ్ గ్లాస్సెస్ పెట్టుకొని సూటు బూటు వేసుకొని తిరుగుతూ ఉంటారు.  

హీరో క్యారెక్టర్ ఆర్క్ అనేది పెరుగుతూ పోవాలి అనేది కమర్షియల్ సినిమా సూత్రం, దానికి రివర్స్ లో ఉంటుంది ఈ సినిమా. ఒక రకంగా చెప్పాలంటే ఇటీవల వచ్చిన కమల్ హాసన్ 'విక్రమ్' కథా ఇలాంటిదే, కానీ తాగుబోతుగా అతన్ని చూపించి తర్వాత తర్వాత అతని రేంజ్ పెంచుతూ పోయారు. కానీ ఇందులో ఆపోజిట్ లో మొదట్లో హీరోని హై పిచ్ లో చూపించి చివరికి నాగార్జున 'కిల్లర్' సినిమా ట్రాక్ లోకి తీసుకువచ్చారు. 

తమిళ్ హీరో విక్రమ్ కి నా సినిమాలో నువ్వు పది వేషాలు వెయ్యాలి అంటే కథ కూడా వినకుండా ఒప్పేసుకున్నట్లు నాగార్జున కి కూడా నువ్వు నా సినిమాలో ఒక ఇంటర్ పోల్ ఆఫీసర్ వి గన్నులతో కాల్చుకోవచ్చు అని అంటే ఒప్పుకుంటాడేమో (అధికారి, వైల్డ్ డాగ్ లాంటి సినిమాలని ఇదే మత్తులోనే ఒప్పుకొని ఉంటాడేమో). 

అసలు విలన్ ని చూస్తే వీడేం విలన్ రా బాబూ అనిపిస్తుంది. 'డీల్ తీసుకునే ముందు వాడి బాక్గ్రౌండ్ ఏమిటో తెలుసుకోమని నీకెన్ని సార్లు చెప్పాను అసలే తెలుగు సినిమా హీరోలందరికీ భాషా లాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని తెలీదా' అని విలన్ బెల్ట్ లాంటిది తీసుకొని కొడుకుని కొడుతూ ఉంటే 'ఇది అట్టర్ ప్లాప్ అయిందని తెలిసి కూడా ఫ్రీ గా వస్తోందని ఓ టి టి లో చూస్తావా' అని ఆ దెబ్బలు నా వీపుకు తగిలినట్లు అనిపించింది. 

5, అక్టోబర్ 2022, బుధవారం

గ్రాండ్ ఫాదర్ .. క్షమించాలి గాడ్ ఫాదర్

ఒరేయ్ అబ్బీ, పాత చొక్కా వేసుకొని వెళ్ళాలని తెలీదా చిరంజీవి కొత్త సినిమాకి వెళ్ళేప్పుడు అని తిట్టేవాళ్ళు అప్పట్లో. ఆ పాత రోజుల్ని తలచుకొని సంబరపడటమే. 

ఇప్పుడు చిరంజీవి సినిమా మొదటి రోజు చూడాలి అనే ఇంటరెస్ట్ కలగడం లేదు. గాడ్ ఫాదర్ రైట్స్ నెట్ ఫ్లిక్స్ కి  ఇచ్చారట , ఒక నాలుగైదు వారాల్లో చూడచ్చులే అని లైట్ తీసుకున్నా. 

చిరంజీవి కి స్టోరీ ఎంచుకునే సామర్థ్యము తగ్గిపోయింది అని నా ఉద్దేశ్యం. 150 సినిమాలు చేసిన ఆయనకి తెలియకపోవడం ఏమిటి అనుకోవచ్చు కానీ ఎవరికైనా డౌన్ ఫేజ్ అనేది ఉంటుంది కదా ఎప్పుడో అప్పుడు. అసలు సినిమాల్లోకి రీ ఎంట్రీ అన్నప్పుడు  "ఆటో జానీ" అనే టైటిల్ తో సినిమా అని వినిపించింది. ఈ మధ్య దేవర కొండ నెత్తిన మరో బండ పడేసిన పూరి డైరెక్షన్ లో ఆ సినిమా అన్నారు. అసలు ఆ టైటిల్ పూరి చెప్పినప్పుడే కథ కూడా వినకుండా రిజెక్ట్ చెయ్యాల్సింది. నా లాంటి ఓల్డ్ జెనెరేషన్ పీపుల్ తప్ప ఎవరైనా ఈ కాలంలో రిలేట్ అవగలుతారా ఆటో డ్రైవర్ క్యారెక్టర్ తో. ఇదేమైనా రౌడీ అల్లుడు కాలమా? అసలు చిరంజీవి ఏజ్ కి రేంజ్ కి ఆటో డ్రైవర్ అంటే మ్యాచ్ అవుతుందా? టాక్సీ డ్రైవర్ అంటే కాస్తో కూస్తో ఓకే. కాకపోతే నా అభిప్రాయం ఏమిటంటే ఆ 'ఆటో జానీ' స్టోరీ నే అటూ ఇటూ మార్చేసి బాలయ్య తో "పైసా వసూల్" అని తీసేశాడని నా ఫీలింగ్. 

సరే, అప్పటి విషయం వదిలేస్తే ఇప్పుడు మొహంలో గ్రాండ్ ఫాదర్ కళ కొట్టొచ్చినట్లు కనపడుతుంటే గాడ్ ఫాదర్ అని పెట్టుకుని వస్తే జనాలు చూస్తారా? లేదా? అనేది ఈ రోజుతో తేలిపోనుంది. 

వకీల్ సాబ్, భీమ్లా నాయక్, గాడ్ ఫాదర్ అని వరసబెట్టి పక్క రాష్టాల సరుకును మన మీదికి తోలుతున్న మెగా బ్రదర్స్ ఇకనైనా రూట్ మార్చకపోతే వారి ఫేట్ మార్చడానికి తెలుగు ప్రజలు రెడీ గా ఉన్నారన్నది కాదనలేని సత్యం. కాకపోతే ఒక్కటి మాత్రం నిజం, ఈ OTT కాలంలో కూడా అందరూ చూసేసిన పరభాషా సినిమాలను కూడా హిట్ సినిమాలుగా మలచగలుగుతున్నారంటే మాత్రం ఆ మార్పులు చేసిన వారిని అభినందించి తీరాల్సిందే. 

చెర్రీ, వర్రీ, వెర్రి, ధర్రీ, కర్రీ, బర్రి, గొర్రి అని ఇప్పటికే అరడజను వారసులను హీరోలను మోస్తున్నాము. చరణ్ ని చెర్రీ అన్నట్టు వరుణ్ ని వర్రీ అని సాయి ధరమ్ ని ధర్రీ  అని  పిలవచ్చేమో? రేప్పొద్దున జెర్రి అని ఇంకో హీరో రావచ్చు. మరి వారి ఫామిలీ నుంచి ఇంత మంది హీరోలు ఉండగా ఇప్పటికైనా ఈయన హీరోగా చెయ్యడం ఆపచ్చు కదా అనిపిస్తుంది. ఇంకా నయం ఈ సినిమాలో హీరోయిన్ అంటూ లేదు కాబట్టి డ్యూయెట్స్ ఉండకపోవచ్చు. కమల్ లాగా విక్రమ్ లాంటి సినిమా చేస్తే బాగుండేది ఏజ్ కి తగ్గట్టు. 

దెబ్బలు తిన్న సింహాన్ని కాకులు కూడా లోకువగా పొడుచుకుతింటాయంటారు కదా ఇప్పటికే సైరా, ఆచార్య లాంటి దెబ్బలు తిన్న మా బాస్ కి అలాంటి పరిస్థితి రానీయకుండా ఈ సినిమా హిట్టవ్వాలని కోరుకుంటున్నాను.  

26, ఆగస్టు 2022, శుక్రవారం

లైగర్ - పూరీ పగిలిందట

బద్రి, ఇడియట్, పోకిరి , బిజినెస్ మాన్, ఇస్మార్ట్ శంకర్ లాంటి పనికి మాలిన సినిమాలను రిజెక్ట్  చేయకపోవడం వల్ల వచ్చిన ఖర్మ ఇది. ఇడియట్, పోకిరి లాంటి సినిమాలు హిట్టయి ఉండచ్చు, ఎక్కువ మంది ఆడియెన్స్ కి నచ్చి ఉండచ్చు గానీ వాటికంటే ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం, అతడు (ఇది వేరే డైరెక్టర్  సినిమా, కాకపోతే పోకిరి ముందు వచ్చిన సినిమా) లాంటి సినిమాలు బాగుంటాయి.  

యేవో నాలుగు పంచ్ డైలాగ్స్, రెండు మెట్ట వేదాంతాలు, శృతి మించిన హీరోయిజం అతని సినిమాలో వాడేసి హిట్ అని అనిపించుకుంటాడు గానీ చాలా వరకు అతని సినిమాల్లో మొదటి నుంచి  విషయం తక్కువే. కొన్ని సినిమాల్లో అయితే హీరోయిన్ అనే పదార్థానికి చీము నెత్తురు, రోషం పౌరుషం, సిగ్గు షరం, మానం మర్యాద లాంటివేవీ ఉండవన్నట్లు కారక్టరైజెషన్ పెడతాడు. 

ఫేస్బుక్, వాట్స్ అప్ లలో వచ్చే కోట్స్ కి ఆయన తన స్టైల్ కోటింగ్ ఇచ్చి ఆ మధ్య musings మొదలు పెట్టాడు. శంఖం లో పోస్తేనే తీర్థం అన్నట్లు సెలబ్రిటీ నోటి నుంచి వచ్చాయి కాబట్టి అవి బాగా క్లిక్ అయినట్లున్నాయి. అది చూసి కొందరు వాతలు కూడా పెట్టుకున్నట్లు ఉన్నారు. 

పూరి గారికి టాలెంట్ ఉంది. అది కాదనే దమ్ము, ధైర్యం ఎవరికీ లేదు ఎందుకంటే ఆయన సినిమాలు చెప్పాయి  ఆయన టాలెంట్ ఏంటో. సినిమా జనాలు ఆహా ఓహో అని ఆయన్ను తెగ పొగిడేస్తూ ఉంటారు మీరు అది సర్ ఇది సర్ అని, వాళ్ళందరినీ కాస్త దూరం పెట్టి జాగ్రత్త తో పొలోమని పాన్ ఇండియన్ సినిమా అని ఇంకొకరి లాగా తాను కూడా పాన్ ఇండియా డైరెక్టర్ కావాలని వాతలు పెట్టుకోవడం మానేస్తే మంచిది.  

ఈ లైగర్ సినిమా ప్లాప్ వల్ల అనసూయతో పాటు మెగాస్టార్ ఫాన్స్ సంతోషంతో చంకలు గుద్దుకొని "కర్మ సిద్ధాంతాన్ని" ప్రచారం చేస్తున్నారు. అనసూయ కి విజయ్ దేవరకొండ కి మధ్య అప్పుడెప్పుడో అర్జున్ రెడ్డి సినిమా టైములో జరిగిన గొడవలు కారణం అయితే, అప్పట్లో "ఆటో జానీ" సినిమా సెకండ్ పార్ట్ నచ్చలేదని చిరంజీవి ఆ సినిమా చేయకుండా "బ్రూస్ లీ" అనే కళాఖండం లో గెస్ట్ రోల్ చేస్తే అది తుస్సుమన్నప్పుడు చార్మీ సంతోషపడుతూ ట్వీట్స్ చేయడం మరొక కారణం .   

ఒకప్పుడు ఫలానా హోటల్ లో పూరి బాగుంటుంది అని ఎగబడి తింటున్న జనాన్ని చూసి, ఎలాగూ ఇక వస్తూనే ఉంటారులే అని ఆ హోటల్ ఓనర్ పదేళ్ళ క్రితమే పెద్ద మొత్తంలో పిండికలిపి పెట్టుకుని ఇప్పటికీ  అదే పిండితోనే పూరీలు చేసి వడ్డిస్తున్నాడు.ఈ మధ్య వాటికి పాచి కంపు మొదలయ్యేసరికి కస్టమర్లు ఆ సద్ది పూరీలు తినలేక కొద్ది కొద్దిగా రావడం తగ్గించేశారు. 

కాబట్టి కాస్తో కూస్తో పూరి అభిమానిగా నా ఆశ ఏమిటంటే తన హోటల్ లో జనాలు పూర్తిగా  కనుమరుగయ్యే లోపు ఆ పాత పిండిని పారేసి కొత్త పిండిని కలుపుకుంటే మంచిది లేదంటే ఇక తన గురువు గారి లాగా కొట్టు మూసేసి షెడ్డు దారి పట్టడమే.  

సినిమాలో కథ ఎవడికి కావాలి?

మన సినిమాలో హీరో కి సొట్ట కాలు, పేరు "బండోడు". 

టైటిల్ అదే పెడదామా? బాగా మాసీ గా ఉంది. 

ఆగండి సర్, నేను టైటిల్ ఫిక్స్ చేసుకున్నా ఆల్రెడీ. 

వెరీ గుడ్, కంటిన్యూ. 

ఒక గుడి దగ్గర చెప్పులు పెట్టుకునే స్టాల్లో పని చేస్తుంటాడు.  హీరోయిన్ కి గుడ్డి, అదే గుడి దగ్గర పూల వ్యాపారం చేస్తుంటుంది. 

ఏంటీ, తమిళ్ సినిమా తీస్తున్నామా?

కాదు తెలుగే, కాస్త మాస్ కారక్టరైజెషన్. 

ఇలా సినిమా తీస్తే తర్వాత అదే గుడి దగ్గర నేను అడుక్కుతినాలి. అయినా కుంటి, గుడ్డి ఇవన్నీ అవసరమా. 

అదే ట్రెండ్ సర్, ఏదో ఒక లోపం పెడితే ఆడియన్స్ కి కిక్కివ్వచ్చు. ఈ మధ్య కొన్ని సినిమాలు చూశాం కదా. 

సరే మిగతా కథ చెప్పు 

అవును సర్,  'చెప్పే' మన కథా వస్తువు. 

అర్థం కాలేదు. 

చెప్తాను వినండి. ఒక పెద్ద లీడర్ అయిన "అమిత్ నరేంద్ర జోడి" ఢిల్లీ నుంచి  ఏదో ఒక పని మీద  హైదరాబాద్ వచ్చి ఈ గుడికి దర్శనానికి వస్తాడు. 

అతను గుడి నుండి బయటకి రాగానే  మన బండోడు వెళ్ళి తన చేతులతోనే చెప్పులు తొడుగుతాడు. దాంతో అతను ఇంప్రెస్ అవుతాడు. 

బాగుంది, తర్వాత.. 

మన "జోడి" కార్ ఎక్కేప్పుడు ఆ కార్ లోపల నుంచి మెరుపులా ఒకడు దూకి కోడి కత్తితో పొడవబోతుంటే మన బండోడు ఉరుములా వచ్చి "జోడి" ని కాపాడతాడు. దాంతో ఆ "జోడి" మన బండోడ్ని మెచ్చి తనతో పాటే ఢిల్లీ  తీసుకుపోతాడు. 

ఇంటరెస్టింగ్ 

ఇక అక్కడి నుంచి మన హీరో ఎలా ఎదుగుతాడు అనేది మనకిష్టం వచ్చినట్లు ఏ రోజు ఎలా తడితే అలా తీసుకోవచ్చు. 

మరి గుడి దగ్గరి హీరోయిన్ 

అక్కడితో ఆ హీరోయిన్ ని వదిలేద్దాం సర్, ఢిల్లీ లో క్లబ్ లో డాన్స్ చేస్తూ మరో హీరోయిన్ ని దింపుదాం. హీరోయిన్స్ మన ఇష్టం సర్, ముగ్గురు నలుగురు హీరోయిన్స్ కూడా పెట్టుకోవచ్చు. కానీ హీరో ఒక్కడే ఉండాలి. 

అంతేనంటావా? 

కావాలంటే ఆ హీరోయిన్ ని కూడా ఢిల్లీ రప్పించి ఇద్దరు హీరోయిన్ లని పెట్టి ఫారిన్ లో 

"అటు మాస్, ఇటు క్లాస్ .. మధ్యలో నేను ఊర మాస్

ఇటు పచ్చడి అటు పిజ్జా .. నంజుకోరా తనివి తీరా

ఇటు ఐస్క్రీమ్ అటు పుల్లైసు .. చప్పరించేయ్ చెలికాడా

అటు స్లమ్ము ఇటు స్లిమ్ము ఇక చూపిస్తా నా దమ్ము"

అని ఒక మంచి ఊపున్న సాంగ్ క్లైమాక్స్ ముందు ప్లేస్ చేద్దాం.  

ఇప్పుడు డబల్ ఓకే. ఇంకా కావాలంటే ఆ "జోడి" ఒకప్పుడు అదే గుడి దగ్గర టెంకాయలు అమ్మేవాడని అక్కడే హీరో తల్లిని తండ్రిని చంపి వాళ్ళ "టెంకాయల" కొట్టును కొట్టేశాడని ఒక రివెంజ్ కథ కూడా అల్లుకోవచ్చు. 

గ్రేట్ సర్. టైటిల్ 'చప్పల్' అని పెడదాం. 

హిందీ పేరులా ఉంది??

అవును సర్. దేశమంతా అదే టైటిల్ తో ప్రచారం చేసుకొని పాన్ ఇండియా మూవీ అందాం.  ఒక నార్త్ ఇండియన్ పిల్లని హీరోయిన్ గా పెడదాం ఎలాగూ. ఆ లీడర్ క్యారక్టర్ ని ఒక నార్త్ ఇండియన్ ఆర్టిస్ట్ తో చేయించి, అతని పక్క ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులని కన్నడ, తమిళ్, మలయాళం నుంచి తీసుకొచ్చి అవసరం ఉన్నా లేకున్నాఇరికిద్దాం పాన్ ఇండియా మూవీ అయిపోతుంది. 

ఇంప్రెస్డ్.  రేపే ప్రెస్ మీట్ పెట్టి మన సినిమా 'చప్పల్' అనౌన్స్ చేద్దాం. 

తోక ముక్క: ఈ విధంగా డబ్బు మూటల్తో వచ్చిన నిర్మాతకి ఏదో ఒక కథ చెప్పేసి కొద్ది మంది దర్శకులు కథ లేకుండా కాకరకాయ మాత్రమే పెట్టి సినిమా తీస్తున్నట్లు ఉన్నారు. నాకూ అలాంటి నిర్మాత దొరికితే బాగుండు, బోలెడు కథలు రాయగలను నేను కూడా డబ్బులిస్తే మరింత శ్రద్ధగా.                                         


23, ఆగస్టు 2022, మంగళవారం

చిరంజీవన్నయ్య

వెండి తెరపై నటుడిగా నా కంటే ముందు పుట్టడం వల్ల అన్నయ్య అయ్యాడు. నా వయసు పెరుగుతున్నట్లే అన్నయ్య ఇమేజ్ పెరుగుతూ వచ్చింది. నా ఆటల్లో పాటల్లో అన్నయ్య ఒక భాగం అయిపోయాడు, అందుకేనేమో ఆ బాండింగ్ ఇప్పటికీ ఇలా నిలిచిపోయింది. 

ఒకపక్క ఎన్టీఆర్-ఏయన్నార్ లాంటి మహామహులు, మరో పక్క కృష్ణ -శోభన్-కృష్ణంరాజు లాంటి సీనియర్లు , తన తర్వాత వచ్చిన బాలకృష్ణ-నాగార్జున-వెంకటేష్ లాంటి జూనియర్స్ తో పోటీ పడి వారందరి జనరేషన్ మధ్య ఒక వారధిగా ఉండగలిగారంటే యెంత కష్టపడి ఉంటారు. ఇక పడిన కష్టం చాలనుకున్నారో ఏమో ఆ కష్టపడేతత్వాన్ని రాజకీయాల్లో కంటిన్యూ చేయలేక మొదట్లోనే కాడి వదిలేసి వెళ్ళడం మాత్రం ఒక మాయని మచ్చ. 

ఒక చిరంజీవి అభిమాని గా నేను చాలా ఎక్కువ ఆశిస్తాను, అదే నాకు వచ్చిన ప్రాబ్లెమ్. నా వరకైతే టాలెంట్ విషయం లో "కమల్ హాసన్ + రజని కాంత్ = చిరంజీవి" . అబ్బ ఛా! వీడు మరీ ఎక్కువ  అతి చేస్తున్నాడు అని మీరు అనుకోవచ్చు గానీ, నటన పరంగా కమల్ కు, స్టైల్స్ విషయం లో రజనీ కి చిరంజీవి సరితూగగలడు అని నా గట్టి నమ్మకం. 

అప్పట్లో మణిరత్నం, శంకర్ లాంటి డైరెక్టర్స్, వాళ్ళకు తోడు రెహమాన్ లాంటి యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మన తెలుగులో తగలక కాస్త రేసులో వెనుకబడ్డాడు. పైగా మన తెలుగు వాళ్ళు తమిళ్ సినిమా వాళ్ళని ఆదరించినంతగా అక్కడివారు మన వాళ్ళని ఆదరించరు అని నా అభిప్రాయం. 

కమల్ హాసన్ కి ఉన్న నేషనల్ వైడ్ క్రేజ్ ని మణిరత్నం నాయకుడు, శంకర్ భారతీయుడు మరింత పెంచాయి. అలాగే రజనీ క్రేజ్ ని మణిరత్నం 'దళపతి', శంకర్ 'శివాజీ', 'రోబో సీరీస్' సినిమాలు పెంచాయి. 'Bigger Than Bachhan' అనే క్రేజ్ ఉన్న రోజుల్లోనే చిరంజీవికి  ఇప్పటి రాజమౌళి లాంటి వాడు దొరికిఉంటే ఆ క్రేజ్ రెట్టింపు అయ్యేది. 

కథల ఎంపికలో, తనకు తగిన సినిమాలు చేయడంలో చిరంజీవి పొరపాట్లు కూడా ఉండి ఉండచ్చు.  దానికి తోడు కాస్త ధైర్యం చేసి ముందడుగు వేసినప్పుడల్లా 'రుద్రవీణ', 'స్వయం కృషి', 'ఆపద్బాంధవుడు' , 'డాడీ' లాంటి సినిమాలు దెబ్బతిన్నాయి. 'డాడీ' సినిమాలో కూతురిని కాపాడుకోలేక జైలులో నిస్సహాయుడుగా కూర్చోవడం నచ్చక కడప లో ఒక థియేటర్ లో ఫాన్స్ ఆ థియేటర్ ని పీకి పందిరి వేశారు. అప్పుడెప్పుడో ఖైదీ లోనే పోలీసులని ఉతికి ఆరేసిన మా హీరో ఇప్పుడు లాకప్ లో ఏడవడం ఏమిటి అని. సరే అదంతా ఆయన స్వయంకృతాపరాధమే. 'రోగి పాలు కావాలన్నాడు, డాక్టర్ అవే తాగు బాబూ' అన్నాడు అన్నట్లు కెరీర్ మొత్తం లో అన్నీ అలాంటి సినిమాలే చేసాడు ఫ్యాన్స్ కోసం అంటూ.  

కమల్ హాసన్ పాత సినిమాలు ఇప్పటికీ ఎవరు గ్రీన్ అనిపిస్తాయి. అడ్డంగా ఇరవై ముప్పై మందిని చితక్కొట్టే మాస్ సన్నివేశాలు ఆయన సినిమాలో అరుదు. మొదట్లో ఉట్టి మాస్ సినిమాలు, కమర్షియల్ సినిమాలు చేసిన సల్మాన్ ఖాన్, షారుక్ ఖాన్ కెరీర్ దెబ్బతింది. కానీ మొదట్లో కుదురుకోవడానికి కాస్త టైం పట్టినా రొడ్డకొట్టుడు సినిమాలు చేయని అమీర్ ఖాన్ కెరీర్ మంచి బూమ్ లో ఉంది ఈ మధ్య వచ్చిన రెండు ప్లాప్స్ తప్ప. 

అన్నయ్య కెరీర్ వయసు కంటే తక్కువ వయసున్న నేను ఆయనకు చెప్పగలిగే స్థాయిలో  లేను కానీ ఒక అభిమానిగా 'అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు' లాంటివి పక్కన బెట్టి తన వయసుకు తగ్గ సినిమాలు చేసి అలరిస్తారని కోరుకుంటున్నాను. 

Belated happy birthday wishes చిరంజీవి అన్నయ్య. 

చిన్న జ్ఞాపకం: ఖైదీ సినిమా మొదట వేరే హీరో చేయాల్సి ఉండేది అనే మాట నిజం. కానీ అది మా దగ్గరికి వచ్చేప్పటికి - "రగులుతోంది మొగలిపొద" పాటలో బెండు అప్పారావు (క్షమించాలి ఆయన ఫాన్స్ నన్ను. యెంత చిరంజీవి ఫ్యాన్ అయినా నాకెందుకో ఆయనంటే ఇప్పటికీ బాగా అభిమానం, అప్పట్లో ఆయనను కొందరు అలా యెగతాళి చేసేవారు కానీ ఇలాంటి సిల్లీ విషయాలను అస్సలు పట్టించుకోని సాహసి ఆయన) డాన్స్ అస్సలు చేయలేకపోయాడని అందుకే ఆయన్ని తీసేసి పల్లెటూరి రైతు పాత్రని స్టూడెంట్ పాత్రగా మార్చి చిరంజీవి ని పెట్టి తీశారనే విధంగా మారిపోయింది రాజు గారి నోట్లో తాటి చెట్టు  మొలిచిందట అనే సామెత లాగా.  

మీ సొట్ట కాళ్ళోడు యెంత గంతులేసినా మా హీరో లాగా డైలాగ్స్ చెప్పలేడు అనేవాళ్ళు అవతలి హీరో ఫాన్స్.  

అవన్నీ ఇప్పుడు తలచుకుంటే భలే నవ్వొస్తుంది. 

16, ఆగస్టు 2022, మంగళవారం

ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 6

ఇది ఆస్ట్రేలియా ఏమీ స్వర్గం కాదు - 5  కి కొనసాగింపు  

ఆఫీస్ కి వెళ్ళే హడావిడిలో ఉంటే డోర్ ఎవరో కొడుతున్నట్లు శబ్దం వచ్చింది. 

ఓపెన్ చేసి చూస్తే ఇంగ్లీష్ బామ్మ, ఆవిడ తలుపు తట్టిందంటే ఎవరికైనా చెమటలు పట్టాల్సిందే. ఎప్పుడూ ఏదో ఒక రగడ చేస్తుంది వచ్చిందంటే. 

మీ బాల్కనీ లో బట్టలు ఆరేశారు అంది 

ఇది కొత్తగా వచ్చిన మా ముఖేష్ పనే అని అర్థమైంది మాకు. 

ఈ సారికి మమ్మల్ని ఒగ్గెయ్యవే బామ్మ అని కాళ్ళు చేతులు పట్టుకొని బతిమలాడితే "కొత్తవాడు తెలియదు అన్నారు కాబట్టి వదిలేస్తున్నా" అంది 

బాబూ ముఖేషూ,  బాల్కనీ లో బట్టలు ఆరేయద్దు. 250 డాలర్ల దాకా ఫైన్ వేస్తారు అన్నాను. 

ఎందుకలా?

బాల్కనీ లో బట్టలు ఆరేస్తే , బిల్డింగ్ బ్యూటీ దెబ్బతింటుందని ఇక్కడి వారి బోడి ఫీలింగ్. 

అవును మరి ఇదో ఓపెరా హౌస్ లేదంటే తాజ్ మహల్ మరి, కనీసం మా ఊరిలో పాడు బడ్డ రాయల్ టాకీస్ లా కూడా లేదు అన్నాడు. 

అవుననుకో, కానీ ఇక్కడ రూల్స్ అలా ఉన్నాయి మరి. మన బాల్కనీ అటు మెయిన్రోడ్  వైపుకు వస్తుంది కాబట్టి ఆరేయకూడదు. 

అయినా నేను ఆరేసింది బాల్కనీ గోడలమీద కాదు కదా, బాల్కనీలో ఉన్న మన చైర్స్ మీదే కదా! 

మన బాల్కనీ ఎవరికీ కనపడకుండా రోడ్డుకు వెనుక వైపు ఉంటే ఆరేసుకోవచ్చు. లేదంటే అది కూడా తప్పే అన్నాను. 


                                                    ********************


బుధవారం సాయంత్రం రూమ్ కి వచ్చేసరికి కిచెన్ లో కాస్త బ్యాడ్ స్మెల్ వస్తున్నట్లు అనిపించింది. ఏమిట్రా అని అన్ని గిన్నెలు వెదికితే విరిగిపోయిన పాలు కనిపించాయి ఒక గిన్నెలో. 

"నేనే పాలల్లో తోడు వేశా పెరుగు కోసం" అన్నాడు మా ముఖేష్. 

ఈ చలికి అంత ఈజీగా పెరుగు తోడుకోదు, మైక్రోవోవెన్ లో ఉంచు లేదంటే రెండు రోజులైనా పేరుకోక ఇలా బాడ్ స్మెల్ వస్తుంది. మన రూమ్ పక్కన ఉండే షాప్ లో కొను ఈ ఇబ్బందులు పడకుండా అన్నాను. 

వాడి దగ్గర పెరుగు లేదు అన్నాడు. 

వాడి దగ్గర ఉంటుందే, నేను ఎప్పుడూ అక్కడే తెచ్చుకుంటా. 

అదేంటి? మరి వాడు నేను అడిగితే తెలీదు, లేదు అన్నాడే?

నువ్వేం అడిగావు?

కర్డ్ అని అడిగా. 

ఈ సారి వెళ్ళినప్పుడు యోగర్ట్ అని అడుగు ఇస్తారు, వీళ్ళు కర్డ్ అనే మాట వాడరు అన్నాను. 


                                                       ******************                             


మరుసటి రోజు ఇవాళ చికెన్  చేసుకుందాం అని చికెన్ షాప్ కి పట్టుకెళ్ళాడు. 

కిలో చికెన్ అడిగితే షాప్ వాడు ఫ్రిడ్జ్ లోంచి తీసి ఇచ్చాడు. 

మనూర్లో అయితే చక్కగా అప్పటికప్పుడు మన కళ్ళ ముందు కోసి ఇస్తే గానీ తీసుకోము అలాంటిది వీడేంటి నిన్నో మొన్నో ఫ్రిడ్జ్ లో పెట్టినది తీసి ఇస్తున్నాడు. 

నిన్నో మొన్నో కాదు ప్రతీ శుక్రవారం స్టాక్ వస్తుంది 

అంటే ఈ రోజు గురువారం, అంటే 6 వ రోజు అన్నమాట 

అవును స్టాక్ వచ్చి 6 రోజులు అంతే, కోసిన తర్వాత రెండు రోజులు warehouse లో ఉంచిన తర్వాతే ఇలా షాప్ కి పంపిస్తారు రూల్ ప్రకారం. 

ఇవెక్కడి రూల్స్ రా బాబూ, మనూర్లో ఉదయం కోసిన చికెన్ మధ్యాహ్నం ఇస్తేనే ఒప్పుకోము. 

అవును ఇక్కడ అంతే. ఈ సారి శుక్రవారం ఈవెనింగ్ లేదంటే ఆదివారం వచ్చి కొను అన్నాను. 

సర్లే చికెన్ అప్పుడే కొంటా, అయినా ఈ చికెన్ తినడానికా ఆస్ట్రేలియా వచ్చింది, ఇవి కాదురా అబ్బాయ్ ..  ఇక్కడ కంగారు, క్రొకోడైల్ మాంసం దొరుకుతాయట? ఎక్కడ అన్నాడు. 

కంగారు అంటే మనకు ఇంగ్లీష్ తెలియదనుకుంటారు, దాన్ని కేంగరు అని ఒక రకంగా పలకాలి. అయినా వాటిని కూడా వదిలిపెట్టవా? 

తినేప్పుడు కోడి అయితేనేం క్రొకోడైల్ అయితేనేం పద ఆ షాప్ చూపించు అన్నాడు. 

అక్కడ అరకిలో క్రొకోడైల్ మాంసం కొని రూమ్ కి వెళ్ళాం కానీ ఆ రోజు రాత్రి జరగబోయే క్రొకోడైల్ ఫెస్టివల్ (ఉపద్రవం) ఊహించలేకపోయాం. 

12, ఆగస్టు 2022, శుక్రవారం

ఇదో అంతులేని మరో సినిమా గాథ

                                                                చాప్టర్ 1

అనగనగా కర్నూల్ అనే ఊరిలో "పీకలు కోసి బదులుగా చెట్లు నాటే" ఒక నాటు విలన్ ఉంటాడు. అదే ఊరికి డాక్టర్ గా మన హీరో వస్తాడు. వచ్చీ రాగానే విజిల్ వేసే అమ్మాయితో ప్రేమలో పడతాడు.

"డాక్టరూ డాక్టరూ నువ్వేలే నా సారూ, తగ్గించు మా అమ్మకి షుగరు" అంటూ హీరోయిన్ ఒక పాట వేసుకుంటుంది. 

అటు విలన్ చేసే ఆగడాలు, ఇటు విజిల్ వేసే అమ్మాయి విన్యాసాలతో రెండు మూడు సీన్స్ ముగిశాక విలన్ మీద పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేస్తాడు మన హీరో. ఆ  కంప్లైంట్ వెనక్కి తీసుకోవాల్సి వస్తుంది విలన్ బెదిరింపుల వలన. అలా రెండు సార్లు హీరో విలన్ కి ఎదురొచ్చాక కొండారెడ్డి బురుజు దగ్గర హీరోని చితక్కొట్టి అక్కడే కొక్కానికి వేలాడదీసి వెళ్ళిపోతాడు విలన్. 


                                                                    చాప్టర్ 2

డాక్టర్ తో పని అయ్యేలా లేదు అని ఈ సారి మళ్ళీ కర్నూల్ వస్తాడు రెండేళ్ళ తర్వాత పోలీస్ అయి. 

"భూమికి బెత్తెడు లేవు నువ్వేం పోలీసువి రా"  అని విలన్ 

"భూమికి బెత్తెడు కాదు బారెడు నేను" అని హీరో 

నాలుగైదు కౌంటర్ డైలాగ్స్ అనేసుకొని రెండు మూడు ఛాలెంజ్ విసురుకోవడాలు అయిన తర్వాత  మళ్ళీ ఆ కొండారెడ్డి బురుజు దగ్గర కొట్టుకున్నాక  విలన్ ని అరెస్ట్ చేసి బొక్కలో వేస్తాడు హీరో. 

"పోలీసు పోలీసు నువ్వేలే నా బాసు, కొట్టేయ్ మా నాన్న మీది కేసు" అని హీరోయిన్ వచ్చి ఒక పాట వేసుకుంటుంది. 

అరెస్ట్ చేసిన విలన్ ని కోర్టులో ప్రవేశపెడతారు. అక్కడ విలన్ తరపు లాయర్ ఒకడు గొప్పగా వాదించేసి విలన్ మీద కేసులన్నీ కొట్టేయించి బయటకి తీసుకొస్తాడు. 

ఈ చెట్లు నాటే కార్యక్రమానికి పుల్ స్టాప్ పెట్టించాలనుకొన్న హీరో కామా మాత్రమే పెట్టించగలుగుతాడు.  


                                                                     చాప్టర్ 3

పోలీస్ తో పని పయ్యేలా లేదు అని రెండు మూడేళ్ళ తర్వాత నల్లకోటు వేసుకొని లాయర్ గా వస్తాడు. 

డ్రైవర్, మనం కరెక్ట్ రూట్ లోనే కర్నూల్ వెళ్తున్నామా?

అవును సర్.  

మరి ఏదో అడవి లాగా ఉందే దారంతా!

అవును సర్, ఈ కర్నూల్ అరణ్యం అయిపోయింది ఆ విలన్ నాటిన మొక్కలు చెట్లై, చెట్లు మానులై, మానులు వృక్షాలై, వృక్షాలు వనాలై, వనాలు అరణ్యం గా మారిపోయింది సర్. ఇలానే అయితే ఒకప్పుడు ఇక్కడ కర్నూల్ నగరం ఉండేది అని మన పిల్లలు పుస్తకాల్లో చదువుకోవసి వస్తుంది సర్ అని గుక్క తిప్పుకోకుండా గుప్పెడు డైలాగ్స్ చెప్పేస్తాడు డ్రైవర్. 

అది ఆపడానికి వచ్చింది నేను, కార్ ఆపు కోర్ట్ వచ్చేసింది అంటాడు హీరో. 

"లాయరూ లాయరూ చూపించు నీ జోరూ, అయిపోవాలి అందరూ బేజారూ" అని హీరోయిన్ వచ్చి ఒక పాట వేసుకుంటుంది. 

కేసును తిరగతోడి మళ్ళీ విలన్ ని కోర్ట్ బోనులో నిలబెడతాడు. 

అద్భుతంగా వాదించినా జడ్జి ఇచ్చిన తప్పుడు తీర్పుతో మళ్ళీ కేసు కొట్టివేస్తారు. 


                                                                చాప్టర్ 4

ఈ సారి జడ్జి గా వచ్చి విలన్ కి ఉరిశిక్ష పడేలా చేస్తాడు. 

ఉరిశిక్ష వేసి వచ్చి బయటకి వస్తుంటే ఎదురుగా ఉండే కిరాణాకొట్టులో ఉండే ఒక వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయి "మీరు? ఇక్కడ?" అని అడిగితే 

అవును, నేనే ఆ తప్పుడు తీర్పు ఇచ్చిన జడ్జి ని, దానికి పశ్చ్యాతాపంగా ఆ జడ్జి జాబ్ వదిలేసి ఇదిగో ఇలా  "పక్కా కమర్షియల్" అనే కిరాణా కొట్టు నడుపుకుంటున్నాను అంటాడు. 

హీరోయిన్  వస్తుంది గానీ జడ్జి పాత్రధారి పాట పాడితే బాగోదని కొంచెం డీసెన్సీ మెయింటైన్ చెయ్యడం వల్ల ఇక్కడ సాంగ్ పెట్టడం లేదు. 

"కర్నూల్ నగరాన్ని అమెజాన్ అడవిలా పెంచి పర్యావరణాన్ని కాపాడినందుకు" రాష్ట్రపతి మెచ్చుకొని ఇచ్చిన క్షమాభిక్ష వల్ల ఉరి శిక్ష నుంచి తప్పించుకుంటాడు విలన్. 

                                                                    

                                                                చాప్టర్ 5

మీరు మరీ స్మార్ట్ ఈ పాటికే ఊహించివుంటారు హీరో ఎంట్రీ ఈ సారి రాష్ట్రపతి గా అని. 

సినిమా చివర్లో డీసెన్సీ లాంటివి వదిలేయాలి, ఎందుకంటే మాస్ కి ఇక్కడో మాంచి బీట్ ఉన్న సాంగ్ పెట్టి తీరాలి ఎప్పటి నుంచో వస్తున్న తెలుగు సినిమా ఆచారం ప్రకారం కాబట్టి "రాష్ట్రపతి రాష్ట్రపతి  నువ్వే నాకు పతి, చేసుకో నన్ను నీ సతి" అని పెట్టిన పాట సెన్సార్ నుంచి బయటకు వస్తే చూడచ్చు. 

క్షమాభిక్ష ని కొట్టివేసి తిరిగి విలన్ కి ఉరి శిక్ష విధిస్తాడు మన హీరో. 


                                                                    చాప్టర్ 6

ఈ సారి మన హీరో అమెరికా ప్రెసిడెంట్ అవుదామని అమెరికా వెళ్ళి అక్కడ రోడ్డుపై నడుస్తూ ఉండే సీన్ తో "వారియర్-2" అని  సినిమా ముగుస్తుంది. 

2, ఆగస్టు 2022, మంగళవారం

అంతా ఆయనే చేశారు

సాధారణంగా నేను హిందీ సినిమాలు ఇష్టపడను. ఒక ఇరవైయ్య్యేళ్ళ క్రితం కాస్తో కూస్తో చూడాలని అనిపించేవి. తర్వాత అవీ చూడబుద్ధి కాలేదు. అప్పుడప్పుడూ మరీ బాగున్నాయి అన్న సినిమాలు తప్పితే హిందీ సినిమాలు చూడటం దాదాపు మానేశాను. 

మొన్న ఆదివారం రోజు, నాకు ఈ పంచాంగాలు, జాతకాలు తెలీదు కాబట్టి ఏ శుక్రుడో నన్ను వక్ర దృష్టితో చూస్తుండబట్టో లేక ఆ దిక్కుమాలిన ఆదివారం అమావాస్య రోజో ఏమో తెలీదు కానీ ఒక హిందీ సినిమా అదీ హారర్ చూద్దామని అనుకుంటే ఆ netflix భాండాగారంలో ఓ సినిమా కనపడింది. రేటింగ్స్ లాంటివి చూడకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్టు ఏ సినిమా దొరికితే అది చూసే నేను ఆ సినిమా చూడటం మొదలు పెట్టాను.  

కాసేపటికే ఆ సినిమా హారర్ కాదు జుగుప్సకి పరాకాష్ట అనిపించింది, నా లైఫ్ లో ఒక్క సినిమా కూడా పూర్తిగా చూడకుండా మధ్యలో మధ్యలో వదిలేసింది  లేదు అలాంటిది పాతిక భాగం కూడా చూళ్ళేకపోతున్నానే అని 1.5 స్పీడ్ లో పెట్టి ముగిద్దాం అని  అనుకున్నా కానీ అర్ధ భాగం చూసేప్పటికీ ఆ జుగుప్స ని తట్టుకోలేక ఆపేశాను. ఆ సినిమా పేరు "ఘోస్ట్ స్టోరీస్" , కరణ్ జోహార్, జోయా అక్తర్, అనురాగ్ కశ్యప్, దిబాకర్ బెనర్జీ అనబడే నలుగురు ఉద్దండుల చేత తీయబడిన నాలుగు స్టోరీల సమాహారమే ఆ సినిమా. రెండు స్టోరీస్ చూసేప్పటికే నాకు కంపరం పుట్టుకొచ్చి ఆపేశాను, ఇక ఆ నాలుగు స్టోరీస్ చూసిన వారెవరో గానీ వారికి గొప్ప గొప్ప అవార్డ్స్ ఇవ్వచ్చు. 

పోయిన ఏడాది వరకు ఈ హిందీ సినిమాలు నాకు నచ్చడం లేదంటే నేను outdated అయ్యానేమో అని అనిపించింది కానీ ఇప్పుడు బాలీవుడ్ సినిమా, బాలీవుడ్  ప్రేక్షకులకే ఎక్కడం లేదంటే హమ్మయ్య! కాస్తో కూస్తో ఇంకా నేను outdated కాలేదేమో సినిమాలని ఆస్వాదించగలిగే టేస్ట్ మన దగ్గర మిగిలే  ఉంది అనుకున్నా (మన అంటే నేనే, మా ఎన్టీవోడి పద ప్రయోగం అంతే, నన్ను నేనే గౌరవంగా పిలుచుకొని, గర్వంతో భుజం తట్టుకొని అభినందించుకుంటున్నాను)

పదేళ్ళ క్రితం బాలీవుడ్ సినిమా హిట్టవ్వాలంటే షారుఖ్ అయినా ఉండాలి లేదా సెక్స్ అయినా ఉండాలి అనేవారు, తర్వాత షారుఖ్ కూడా ఆ లిస్ట్ లోంచి వెళ్ళిపోయి సెక్స్ ఒక్కటే మిగిలింది. యాభై శాతం పైన సినిమాల్లో కథలు అక్రమ సంబంధాల చుట్టూ లేదంటే సహ జీవనం  అనబడే విచ్చలవిడి జీవితాల చుట్టే తిరుగుతుంటాయి. మా తెలుగు సినిమాలే మేలబ్బా, ఇంకా అంత ఎత్తుకు ఎదగనందుకు. ఇంకా అవే రొటీన్ సినిమాలైనా ఏ చెట్టు లేని చోట ఆముదము చెట్టు లాగా వెలిగిపోతున్నాయి. 

చాలా మంది బాలీవుడ్ హీరోయిన్స్ కాస్త డిమాండ్ లో ఉన్నప్పుడు "ఆ టాలీవుడ్ లో కథంతా హీరో చుట్టే తిరుగుతుంది, అందుకే మేము తెలుగు సినిమాల్లో నటించం" అని పెద్ద స్టేట్మెంట్స్ పడేస్తుంటారు అక్కడికి వారేదో అక్కడ గొప్ప గొప్ప క్యారెక్టర్స్ చేస్తున్నట్లు. 

"దేశంలో ఉండే ఎన్నో సమస్యలతో పాటు ఈ హిందీ సినిమా ఇండస్ట్రీ ఇలా దరిద్రంగా  తయారవ్వడానికి కారణం ఆ గాంధీ గారు కదూ, నెహ్రూ గారిని కాకుండా పటేల్ గారిని ప్రధానిని చేసి ఉంటే అసలు ఇలా జరిగేదా" అని సభాముఖంగా ప్రశ్నిస్తూ సెలవు తీసుకుంటున్నాను. 

27, జులై 2022, బుధవారం

ఫ్రీ కూపన్స్ పథకం

ఉచితాలు ఇచ్చి శ్రీలంక దివాలా తీసింది, త్వరలోనే ఆంధ్ర కూడా అలాగే అవుతుంది అని ప్రతిపక్షం జగన్ గారి మీద విమర్శలు కురిపిస్తోంది. పైగా మోడీ గారు కూడా ఈ మిఠాయి సంస్కృతి కి(ఉచితాలు ఇవ్వడం) రాష్టాలు మంగళం పాడితే మంచిది అని చురకలు అంటించారు గానీ దేశం మొత్తం మీద చాలా పెద్ద మొత్తం అప్పే ఉందని అంటున్నారు, ఇలాంటి విషయాల్లో పెద్దగా విషయ పరిజ్ఞానం లేదు కాబట్టి కాస్త లైట్ గా అన్ని విషయాలను  టచ్ చేస్తా. 

ఇప్పుడు పాకిస్తాన్ కూడా శ్రీలంకలాగా దివాలా తీస్తుందని అంటున్నారు, పాకిస్తాన్ రూపాయి డాలరుతో పోల్చితే 210 కి చేరుకుందట, మన ఇండియన్ రూపాయి 80 కి చేరుకున్నట్లు.  

పాకిస్తాన్ లో ఆ మధ్య టీ తాగడం తగ్గించుకోండి అని ప్రభుత్వం ప్రజలని రిక్వెస్ట్ చేసిందట, ఆ దేశం టీ పొడిని అధికంగా దిగుమతి చేసుకోవడం వల్ల ఆ దిగుమతి చెల్లింపులు తగ్గించుకోవడానికొచ్చిన తిప్పలు అవి. 

ఇంధనం వృథా చేయొద్దని ఫ్రాన్స్ కూడా ఏసీ లను వాడుతున్నప్పుడు వీలైనంతవరకూ తలుపులు మూసి ఉంచాలని, అలాగే లైట్స్ మితంగా వాడాలని ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత నెలలో ఆస్ట్రేలియా ప్రభుత్వం కూడా విద్యుత్ వినియోగం కాస్త తగ్గించుకోమని ప్రజలని కోరింది. 

ఇవన్నీ మన తాతలు తండ్రుల కాలం నుంచి చెబుతున్నవే, నీళ్ళు వేస్ట్ చెయ్యొద్దురా, కరెంట్ వేస్ట్ చెయ్యొద్దురా అని ఎన్ని సార్లు చెప్పి ఉంటారో. కోవిడ్ వచ్చేదాకా బయటికి వెళ్లి వచ్చాక చేతులే కాదు కాళ్ళు కూడా కడుక్కోవాలి అని మన పెద్దలు చెప్పిన మంచి అలవాట్ల విలువ మనకి తెలియరాలేదు. పీకల్దాకా మునిగే వరకు ఉండి అప్పుడు నివారణ చర్యలు చేపట్టడం అలవాటయిపోయింది. 

ఇక ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలయ్యాక మొత్తం ప్రపంచమే ఒక కుదుపుకి లోనయింది. నేను కార్ కొనక ముందు లీటర్ పెట్రోల్ డాలరు, కార్ కొన్నాక రెండు  డాలర్లని దాటేసింది. నేను అపార్ట్మెంట్ లో ప్లాట్ కొనక ముందు హొం లోన్ వడ్డీ రేటు 1.5% ఉండేది, ఇప్పుడది 4% కి ఎగపాకింది, ఇంకా పెరిగే ఛాన్స్ ఉందని అది ఈ సంవత్సరం చివరకి అది 7% కి చేరవచ్చని వాట్సప్ విశ్లేషకులు కోడై కూస్తున్నారు. 

ఈ ఉచితాలు ఇవ్వడం వల్లే ఆంధ్రా అప్పుల్లో కూరుకుపోతోంది అంటున్నారు. ఆ విషయం మీద మాట్లాడే పరిజ్ఞానం నాకు లేదు గానీ ఉచితాలు అనేవి ప్రతీ దేశంలో ఉండేవే, కాకపోతే అవి ప్రోత్సాహకాలని మరొకటని పేర్లు మార్చుకొని ఉంటాయి అంతే. 

ఇక్కడ ఆస్ట్రేలియా లో కూడా సంపాదించేవారు కట్టే 35% టాక్స్ డబ్బులనుంచి పని లేని వారికి ఆహార పథకం అన్నట్లు జాబ్స్ లేని వారికి నెల నెలా డబ్బులు ఇస్తూ ఉంటుంది ప్రభుత్వం. కొంతమంది అదే చాలు అనుకుంటూ బద్దకస్తులుగా ఉండిపోయారు. ఒక ఫామిలీ లో సంపాదన బిలో సం లైన్ కింద ఉంటే ఆ ఫామిలీ లో ఉండే ఒక్కొక్క కిడ్ కి కాస్త పెద్ద మొత్తంలోనే నెల నెలా డబ్బులు ఇచ్చేవారు, ఒకప్పుడు జనాభా ఇక్కడ తక్కువని అలా ప్రోత్సాహకాలు అందించేవారు. ఇప్పడు ఆ అమౌంట్ ని కాస్త తగ్గించినట్లు ఉన్నారు. 

ఇక ఫ్రీ కూపన్స్ పథకం అని టైటిల్ లో ఎందుకు అన్నానంటే COVID తర్వాత జనాల్ని ఇళ్ళ లోంచి బయటకి రావడానికి ఎంకరేజ్ చేసి తద్వారా రెస్టారెంట్స్, రిసార్ట్స్ , థియేటర్స్ బిజినెస్ ని మళ్ళీ ట్రాక్ లోకి తీసుకురావడానికి 18 ఏళ్ళు నిండిన ఒక్కొక్కరికి (సిటిజెన్ అవ్వాల్సిన అవసరం లేదు, కేవలం ఏదో ఒక వీసా మీద ఆస్ట్రేలియా లో ఉంటే చాలు) ఎనిమిది 25$ ఫ్రీ కూపన్స్ ఇచ్చింది. వీటిని క్యాష్ చేసుకోలేము గానీ రెస్టారెంట్స్ లో గానీ థియేటర్స్ లో గానీ ఉపయోగించుకోవచ్చు. 

పోయిన సంవత్సరం పిల్లల స్కూలింగ్ అంతా ఇళ్ళలోనే గడిచి పోయింది కాబట్టి మీ పిల్లలను మీరు భరించినందుకు మా గిఫ్ట్ ఇది అంటూ గవర్నమెంట్ 250$ విలువ చేసే మరో కూపన్ ఇచ్చింది. దీన్ని ఎక్కడైనా ట్రిప్స్ కి వెళితే యూజ్ చేసుకోవచ్చు ఒక రోజు  హోటల్ రూమ్ బుక్ చేయడానికి ఇలాంటి తాయిలాలు గవర్నమెంట్ అప్పుడప్పుడూ పంచేస్తూ ఉంటుంది. 

ప్రతీ ఆరు నెలల కొకసారి పర్మనంట్ రెసిడెంట్స్/ సిటిజన్స్ కి పిల్లలు ఉంటే వారికి active vouchers అని ప్రతీ కిడ్ కి 100$ ఇస్తుంది, వీటిని కూడా క్యాష్ చేసుకోలేము, కాకపోతే పిల్లల్ని స్విమ్మింగ్ క్లాసెస్ కో లేదంటే కరాటే క్లాసెస్ కో పంపినప్పుడు వేడినీళ్ళకు చల్లనీళ్ళు తోడైనట్లు ఉపయోగపడతాయి. మన దేశంలో కూడా రేషన్ ఇవ్వడం లాంటివి ఇలాంటి పథకాల కిందే వస్తాయి, డైరెక్ట్ గా డబ్బులు చేతిలో పెట్టకుండా. 

కాబట్టి గవర్నమెంట్ దగ్గర డబ్బులుంటే క్యాష్ పరంగా కాకుండా ఇలా కూపన్స్ పరంగా ఇవ్వడం అనే పద్దతి బాగుంది, దానివల్ల ప్రజలకి, బిజినెస్ కి ఉపయోగకరంగా ఉంటుంది. కాకపోతే వాటిని క్యాష్ చేసుకోవడం లేదంటే వేరే వారికి బదిలీ చేయడం లాంటి వాటిని నిరోధించగలగాలి. 

ఇన్ని చెప్పాను కానీ దేశాలు, రాష్ట్రాలు ఎలాగోలా అప్పులు తీర్చేసుకుంటాయి కానీ ముడ్డి కింద ఉన్న నలుపు ఎరుగని గురివిందగింజ లాగా నా అప్పుల గురించి మరచిపోయానే ఈ పెరిగిన వడ్డీ రేట్లతో ఇంటి అప్పు ఎప్పటికి తీరునురా దేవుడా!